కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు.. బీఆర్ నాయుడు స్పందనిదే..
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:01 PM
తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్వామివారి దర్శనం కోసం ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. శనివారం నాడు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ(116) అలిపిరి మెట్ల మార్గాన కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. కొంతమంది భక్తులు ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.
ఆ వీడియో కాస్తా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించాను. వృద్ధురాలి గురించి ఎవరికైనా వివరాలు తెలిస్తే దయచేసి టీటీడీ ఛైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించగలరు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వృద్ధురాలిపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు. మరోవైపు టీటీడీ సిబ్బంది వృద్ధురాలి వివరాలపై ఆరా తీయడం ప్రారంభించారు.
తొలుత ఆమె కర్ణాటకకు చెందిన మహిళగా ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా టీటీడీ అధికారులు గుర్తించారు. దీంతో వృద్ధురాలికి వీఐపీ దర్శనం చేయించాలని బీఆర్ నాయుడు నిర్ణయించారు. ‘నా విజ్ఞప్తిపై వెంటనే స్పందించి 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి వివరాలను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు హృదయపూర్వక అభినందనలు. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన శ్రీమతి నవనీతమ్మని, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉన్నట్లు గుర్తించారు. రేపు (సోమవారం) ఉదయం నవనీతమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే భాగ్యం దక్కడం ఆనందంగా ఉంది. శ్రీవారి అనుగ్రహం ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఎక్స్ వేదికగా బీఆర్ నాయుడు మరోసారి స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జులై 8 నుంచి సదరం స్లాట్ బుకింగ్ పునః ప్రారంభం: మంత్రి సత్యకుమార్
ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..