ప్రజల సొమ్ము కార్ల పాలు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:04 AM
ఎంత బాగా తిరిగేవారైనా ఏడాదిలో ఒక కారులో ఎన్ని కిలోమీటర్లు తిరగ్గలరు..? మహా అయితే లక్ష. ఇంకా బాగా తిరిగితే.. 2 లక్షల కిలోమీటర్లు!. కానీ, ట్రాన్స్‌కో అధికారులు మాత్రం ఏకంగా 6,71,500 కిలోమీటర్లు తిరిగేస్తామని చెబుతున్నారు.
ఏడాదిలో 6.71 లక్షల కి.మీ. తిరిగేస్తారట
చిత్తూరు సబ్‌స్టేషన్ నిర్మాణంలో సిత్రాలు
దూరం 20 కి.మీ.. తిరిగేది లక్షల కిలోమీటర్లు
ప్రాజెక్టు టెండరు విలువ రూ.51 కోట్లు
అందులో రూ.67 లక్షలు వాహనాల ఖర్చే
ఎంత బాగా తిరిగేవారైనా ఏడాదిలో ఒక కారులో ఎన్ని కిలోమీటర్లు తిరగ్గలరు..? మహా అయితే లక్ష. ఇంకా బాగా తిరిగితే.. 2 లక్షల కిలోమీటర్లు!. కానీ, ట్రాన్స్‌కో అధికారులు మాత్రం ఏకంగా 6,71,500 కిలోమీటర్లు తిరిగేస్తామని చెబుతున్నారు. ఇదే విషయాన్ని చిత్తూరు జిల్లాలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి పిలిచిన టెండరులో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం పొగురుపల్లి వద్ద 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, కుప్పం నుంచి పొగురుపల్లి 10 కిలోమీటర్ల మేర 220 కేవీ డబుల్ లైన్ నిర్మాణం, కుప్పం సబ్‌స్టేషన్‌లో 2 బేల నిర్మాణం కోసం ట్రాన్స్‌కో అధికారులు ఈ నెల 11న టెండరు పిలిచారు. దీని విలువ సుమారు రూ.51 కోట్లు. క్షేత్రస్థాయిలో అధికారులు తిరిగేందుకు వాహన ఖర్చే సుమారు రూ.67 లక్షలుగా పేర్కొన్నారు. ఏడాది కాలంలో తాము 6,71,500 కిలోమీటర్లు తిరుగుతామని, కిలోమీటరుకు సుమారు రూ.10 చొప్పున రూ.67 లక్షలు ఖర్చవుతుందని చూపారు. సాధారణంగా ట్రాన్స్‌కోలో పనులను పర్యవేక్షించే అధికారికి కాంట్రాక్టరు కారు ఏర్పాటు చేస్తారు. ఆ మొత్తాన్ని కూడా టెండరులో చూపుతారు. ఆ తర్వాత లాగ్‌బుక్‌లో తప్పుడు ఎంట్రీలు వేసి 6,71,500 కిలోమీటర్లు తిరిగినట్లు చూపి కాంట్రాక్టరుకు లబ్ధి చేకూరుస్తారు.
20 కిలోమీటర్ల దూరం..
టెండరులో పేర్కొన్నదాని ప్రకారం పొగురుపల్లిలో సబ్‌స్టేషన్ నిర్మాణం, కుప్పం నుంచి పొగురుపల్లికి లైన్ నిర్మాణం చేయాల్సి ఉంది. లైన్ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మాత్రమే అధికారులు కుప్పం, పొగురుపల్లి నడుమ తిరగాల్సి ఉంటుంది. మిగిలిన పని పర్యవేక్షణ పొగురుపల్లిలో ఉండే చేయవచ్చు. కుప్పం-పొగురుపల్లి మధ్య దూరం 20 కిలోమీటర్లు. ఈ పనులను పర్యవేక్షించే అధికారులు రోజుకి 5 సార్లు అటు ఇటు తిరిగి నా 200 కిలోమీటర్లకు మించి తిరగలేరు. ఇద్దరు అధికారులు రెండు కారుల్లో 5 సార్లు తిరిగారని అనుకున్నా మరో 200 కిలోమీటర్లు అవుతుంది. మొత్తమ్మీద రోజుకి 400 కిలోమీటర్లు తిరుగుతారని అనుకున్నా ఏడాదిలో సెలవులు పోను 300 రోజు ల్లో రోజుకి 400 కిలోమీటర్లు చొప్పున వేసుకున్నా 1.20 లక్షల కిలోమీటర్ల మించి తిరగలేరు. అలాంటిది. ఏడాదిలో 6.71 లక్షల కిలోమీటర్లు తిరుగుతామని పేర్కొన్నారు. దీనికిగాను రూ.67 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ మొత్తాన్ని విద్యుత్ శాఖ నుంచి కాంట్రాక్టరుకు కట్టబెట్టేందుకు, అటు నుంచి తమ జేబుల్లో కొంత మేరకు వేసుకునేందుకు అధికారులు పక్కా ప్లాన్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు