డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా ఓటు వేయండి.. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:09 PM
మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఓ దశకు చేరుకుంటున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
ఢిల్లీ, నవంబర్ 27: మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఓ దశకు చేరుకుంటున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు (శుక్రవారం) ఆయన నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి, ఇతర కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర కేబినెట్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నానని చెప్పారు. ‘నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చాను. డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచుకోవాల్సి ఉంది. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియతో 50 శాతం మేర సీట్లు పెరుగుతాయి. 1971, 2011, 2026 సెన్సెస్ ప్రకారం ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయి. గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయి. మేము కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ ప్లానింగ్‌పై గట్టిగా పనిచేశాం. ఓ క్యాంపెయిన్ మోడ్‌లో కృషి చేసి జనాభా నియంత్రణను సాధించగలిగాం. ఫెర్టిలిటీ రేటును తగ్గించగలిగాం. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది నష్టపోతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
అనంతరం సీఎం డీలిమిటేషన్ అవసరాన్ని వివరించారు. ‘1971లో దేశ జనాభా 58.8 కోట్లు ఉంది. 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 2026 లెక్కల ప్రకారం జనాభా దాదాపుగా 147 కోట్ల మేర ఉంది. ఇంత జనాభాకు 543 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉండటం సరికాదు. 1971లో ప్రతి 10 లక్షల మందికి ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత జనాభా ప్రకారం 27 లక్షల మంది జనాభాకు ఓ ఎంపీ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో 7.8 లక్షల మందికి ఓ ప్రజాప్రతినిధి ఉన్నారు. డీలిమిటేషన్ ప్రకారం 50 శాతం మేర సీట్లు పెరిగితే ప్రతి 18 లక్షల మంది జనాభాకు ఓ ఎంపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది’ అని ఆయన వెల్లడించారు. ‘ప్రస్తుతం ఏపీకి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ ప్రకారం 50 శాతం సీట్లు పెరిగితే 38కు చేరతాయి. తమిళనాడులో 59, కర్ణాటకలో 42, తెలంగాణలో 26, కేరళంలో 30 స్థానాలకు లోక్‌సభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. ఇలా... దక్షిణాది రాష్ట్రాల్లో 195 పార్లమెంటు సీట్లు ఉంటాయి’ అని తెలిపారు.
ఆ తరువాత మహిళా రిజర్వేషన్ల గురించి చంద్రబాబు మాట్లాడారు. ‘2024 ఎన్నికల్లో మొత్తం ఎంపీల్లో 13.96 శాతం మంది మహిళలు ఉన్నారు. 2019లో 14 శాతం మంది ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. ఈ బిల్లును వ్యతిరేకిస్తే.. అది మహిళా ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవటమే అవుతుంది. ప్రతి ఒక్కరూ మహిళల పక్షాన నిలిచేందుకు వీలుగా బిల్లుకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. చారిత్రక తప్పిదానికి పాల్పడవద్దని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆకాంక్షలు నెరవేరే సమయం వచ్చింది. ఈ నెలాఖరున జరిగే పార్లమెంటు సెషన్లో సభ్యులంతా ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేయాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
ఈ వార్తలూ చదవండి
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు