ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 29 , 2026 | 10:25 AM
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 29: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి స్వగ్రామమైన అద్దంకి మండలం చెరువుకొమ్ముపాలెంకు వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. టోల్ ఫీజు చెల్లించేందుకు ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి లోకేశ్
ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..