అమరావతికి చట్టబద్ధత!
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:10 AM
వ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
చంద్రబాబుకు అమిత్ షా హామీ
పార్లమెంటులో గందరగోళంతో అనేక బిల్లులు ఆగిపోయాయి
మలివిడత సమావేశాల్లో రాజధాని బిల్లు పెడతామన్న కేంద్ర హోం మంత్రి
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం భేటీ
తొలుత జలశక్తి మంత్రితో సమావేశం
పోలవరం రెండో దశ నిధులకు అభ్యర్థన
నల్లమలసాగర్‌కు అనుమతులివ్వాలని వినతి
ఢిల్లీలో చంద్రబాబు సుడిగాలి పర్యటన
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో అనేక బిల్లులు ఆగిపోయాయని.. మలివిడత బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు సీఎం ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు. వరుసగా ఏడుగురు కేంద్ర మంత్రులను, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీని కలిశారు. అమిత్‌షాతో ఆయన నివాసంలో గంటపాటు చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను వివరించినట్లు తెలిసింది. జగన్ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వైనాన్ని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలను భగ్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏపీలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. రెవెన్యూ లోటు భర్తీకి తలపెట్టిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు కేంద్ర సహకారం అవసరమన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పార్లమెంటు భవనంలో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటు ఆమోదించేలోపు రాష్ట్రానికి మరిన్ని నిధులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. బడ్జెట్‌కు ముందు తానిచ్చిన ప్రతిపాదనల్లో పలు అంశాలపై కేంద్రం స్పందించాల్సిందన్నారు.
కొబ్బరి సాగు అభివృద్ధికి 200 కోట్లివ్వండి..
రాష్ట్రంలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌ను సీఎం కోరారు. కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉందని.. అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం సహా అనుబంధ రంగాల అభివృద్థికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సేంద్రియ సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ‘పీఎం ప్రణామ్ పథకం కింద ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్‌ను విస్తరించడానికి నిధులివ్వండి. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం వల్ల ఇచ్చే పీఎం ప్రణామ్ ప్రోత్సాహకాలివ్వాలి. 2024-25కు సంబంధించిన రూ.216 కోట్లు ఇవ్వాలి. సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించాం. రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటి వరకు 18 లక్షల మంది రైతులు 8 లక్షల హెక్టార్లల్లో సేంద్రియ సాగుకు సమ్మతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు అభివృద్థి చేయడానికి రూ.200 కోట్లు సాయం చేయండి. కొబ్బరి ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణకు సహకరించాలి. కొబ్బరి రైతులకు లాభం చేకూర్చేలా.. సుమారు 15 వేల మందికి ఉపాధి కలిగించేందుకు ప్రాసెసింగ్ పార్క్, మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్లు పని చేస్తాయి. ‘పర్ డ్రాప్.. మోర్ క్రాప్’ పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.695 కోట్లను విడుదల చేయండి. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్‌లో తోతాపురి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్లు కూడా విడుదల చేయాలి. ధరలు పడిపోవడంతో ఇబ్బందులు పడ్డ తోతాపురి రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వాటాను కలిపి రూ.200 కోట్లు చెల్లించాం’ అని చెప్పారు.
రైల్వే మంత్రికి వినతులు..
వైజాగ్-విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు కారిడార్‌ను మంజూరు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం విన్నవించారు. ‘విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలి. హైదరాబాద్-శ్రీశైలం-మార్కాపురం కొత్త రైల్వేలైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీ పెంచాలి. తిరుపతి మీదుగా విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ సర్వీసు నడపాలి. వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వండి. అక్కడ రైలు బోగీల నిర్వహణ టెర్మినల్‌ను ఏర్పాటు చేయండి. బెంగళూరు-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌ను తిరుపతికి కనెక్ట్ చేసేలా చూడాలి. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ విడుదల చేయాలి. తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలి. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిల్లో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలి. ఉత్తర-దక్షిణ భారతాలను కలుపుతూ ఇటార్సీ-విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకరించాలి. ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్‌పూర్-చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలి. రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను అనుసంధానించేలా పలు కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనలను ఆమోదించాలి’ అని కోరారు. ఇటీవల బడ్జెట్‌లో ఏపీ గుండా వెళ్లేలా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించడంపై మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
లాభాలబాటలో స్టీల్‌ప్లాంట్..
కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో పార్లమెంటులో భేటీ అయిన సీఎం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి సహకరించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, కార్మికులు- ఉద్యోగుల పట్టుదల, శ్రమతో లాభాలు సాధ్యమయ్యాయని వివరించారు. పైగా స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తోందని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన తోడ్పాటు, సహకారాన్ని అందించాలని కోరారు. ఆయా భేటీల్లో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కూటమి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేశినేని చిన్ని, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీకే పార్థసారథి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, జీఎం హరీశ్, శ్రీభరత్, వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ ఉన్నారు.
స్వచ్ఛభారత్ నిధులివ్వండి..
స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కేంద్ర పట్టణాభివృద్థి, గృహనిర్మాణ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం వివరించారు. వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్‌గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను తెలియజేశారు. ‘స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0’ కింద రూ.276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్‌కు కార్యాచరణ రూపొందించాం. స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా కేంద్ర వాటా కింద రూ. 105 కోట్లు మంజూరు చేయాలి’ అని కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన విశాఖ మెట్రోకు సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా విశాఖ మెట్రో నిర్మాణానికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని.. వాటిని త్వరగా పరిష్కరించాలని కోరినట్లు సీఎం మీడియాకు చెప్పారు.
ఢిల్లీకి మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు హుటాహుటిన వెళ్లారు. ఢిల్లీలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. బుధవారం తిరిగి అమరావతి చేరుకుంటారు.

