Share News

స్థానిక ఎన్నికల్లో..బలమైన అభ్యర్థులను నిలపాలి

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:39 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించారు. కూటమి పార్టీల అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే శ్రేణులు వెళ్లాలని, మనస్పర్ధలకు తావుండకూడదని, ..

స్థానిక ఎన్నికల్లో..బలమైన అభ్యర్థులను నిలపాలి

  • కూటమి పార్టీలతో సమన్వయం కీలకం

  • రేపల్లె శ్రేణుల భేటీలో సీఎం నిర్దేశం

బాపట్ల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించారు. కూటమి పార్టీల అధిష్ఠానం నిర్ణయం ప్రకారమే శ్రేణులు వెళ్లాలని, మనస్పర్ధలకు తావుండకూడదని, అందరి అభిమతం రాష్ట్రాభివృద్ధే కావాలని చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా రేపల్లె పర్యటనలో టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టంచేశారు. సరైన ఫలితాలు రాకపోతే వారే జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అయిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

రేపల్లె టీడీపీకి కంచుకోటగా ఉందని.. ఇక్కడి నుంచి యడ్ల వెంకట్రావు (1983, 85), ముమ్మనేని వెంకటసుబ్బయ్య (1994, 99) రెండేసి సార్లు టీడీపీ నుంచి విజయం సాధించారని గుర్తుచేశారు. తొలిసారి పోటీలో (2009) అనగాని ఓటమిపాలైనా నిలదొక్కుకుని తర్వాత వరుసగా 3సార్లు విజయం సాధించి రేపల్లెను టీడీపీకి బలమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. కృష్ణా, బాపట్ల జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజలు అత్యవసర వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో గోల్డెన్‌ అవర్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అనగాని తెలిపారు. వెంటనే స్పందించిన సీఎం రేపల్లెలో కార్పొరేట్‌కు దీటుగా ఉండే వంద పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనగాని భావోద్వేగానికి లోనై పాదాభివందనం చేయబోగా, సీఎం వారించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:39 AM