Share News

‘విజయ’కు చలసాని రాజీనామా

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:13 AM

విజయ డెయిరీ చైర్మన్‌ పదవిపై ఏర్పడిన అనిశ్చితి, ఉత్కంఠకు తెరపడింది. మంత్రి కొలుసు పార్థసారథి నచ్చచెప్పడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు.

‘విజయ’కు చలసాని రాజీనామా

ఆసుపత్రిలోనే మంత్రి కొలుసు పార్థసారథికి లేఖ అందజేత

విజయవాడ, (ఆంధ్రజ్యోతి): విజయ డెయిరీ చైర్మన్‌ పదవిపై ఏర్పడిన అనిశ్చితి, ఉత్కంఠకు తెరపడింది. మంత్రి కొలుసు పార్థసారథి నచ్చచెప్పడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణా మిల్క్‌ యూనియన్‌ (విజయ) చైర్మన్‌ చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. చైర్మన్‌, బోర్డు డైరెక్టర్‌ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పార్టీయే తనకు ముఖ్యమని, అధిష్ఠానం ఆదేశాలను గౌరవిస్తానన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ఆంజనేయులు రాజీనామా చేయకపోవటంతో శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్ర క్యాంపు కార్యాలయంలో మంత్రులు వాసంశెట్టి సుభాష్‌, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్థసారథి విజయా డెయిరీ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వారికి వివరించిన మంత్రులు... నాయకత్వ మార్పుపై పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు. సమావేశం కొనసాగుతుండగానే ఆసుపత్రికి వెళ్లిన డైరెక్టర్లతో చలసాని రాజీనామా చేయనని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించండి అంటూ తేల్చి చెప్పారు.


ఈ దశలో మంత్రి కొలుసు ఆసుపత్రికి వెళ్లారు. చలసానికి నచ్చ చెప్పడంతో ఎట్టకేలకు రాజీనామా లేఖపై చలసాని సంతకం చేశారు. ఈ క్రమంలో మంత్రిని ఆయన ఒక కోరిక కోరారు. ‘విజయవాడ చిట్టినగర్‌లోని ప్రధాన మిల్క్‌ ఫ్యాక్టరీకి 24.70 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చింది. దానికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పేరుతో టైటిల్‌ డీడ్‌ ఇప్పించండి. డెయిరీకి, పార్టీకి మంచి జరుగుతుంది’ అని కోరారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళతానని మంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో... ‘నేను రాజీనామా చేస్తున్న డైరెక్టర్‌ పోస్టు స్థానంలో నామినేషన్ల సందర్భంలో రాజీనామా చేసిన చలసాని చక్రపాణికి అవకాశం కల్పించండి’ అన్న ఆంజనేయులు అభ్యర్థనపైనా మంత్రి సానుకూలంగా స్పందించారు.


ఇవి కూడా చదవండి

తీరు మార్చుకోని అధికారి!

మూసీ ప్రాజెక్టుకు లైన్‌క్లియర్‌

Updated Date - Aug 08 , 2026 | 07:31 AM