Share News

జాతీయ విపత్తు నివారణ నిధిపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ..

ABN , Publish Date - Aug 11 , 2026 | 08:04 PM

జాతీయ విపత్తు నివారణ నిధి కింద మొత్తం 18 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 నగరాలకు ఆర్థికసాయం చేసేందుకు ఏకంగా రూ.5,520.07 కోట్లను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించింది.

జాతీయ విపత్తు నివారణ నిధిపై పార్లమెంట్ వేదికగా కేంద్రం క్లారిటీ..
Urban Flood Management

ఢిల్లీ: జాతీయ విపత్తు నివారణ నిధి కింద మొత్తం 18 నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 నగరాలకు ఆర్థికసాయం చేసేందుకు ఏకంగా రూ.5,520.07 కోట్లను ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించింది. ఈ నిధులతో ఆయా నగరాల్లో విపత్తు నివారణ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొంది. అయితే, రెండు దశల్లో ఈ నగరాలను ఎంపిక చేసినట్లు హోంశాఖ చెప్పింది. ఈ మేరకు పార్లమెంట్‌లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానంలో వివరాలను వెల్లడించారు.


తొలిదశలో ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, పుణె ఉన్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ ఏడు నగరాల్లో మొత్తం రూ.3,075.65 కోట్ల వ్యయంతో పట్టణ వరద ప్రమాద నిర్వహణ కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొంది. అలాగే రెండో దశలో ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నంతోపాటు భోపాల్‌, భువనేశ్వర్‌, గౌహతి, జైపూర్‌, కాన్పూర్‌, పాట్నా, రాయ్‌పూర్‌, త్రివేండ్రం, ఇండోర్‌, లఖ్‌నవూ ఉన్నట్లు తెలిపింది. ఈ నగరాల్లో మొత్తం రూ.2,444.42 కోట్ల వ్యయంతో పట్టణ వరద ప్రమాద నిర్వహణ కార్యక్రమం రెండో దశకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. మొదటి, రెండో దశల కింద మొత్తం రూ.5,520.07 కోట్లు ఆమోదించినట్లు పేర్కొంది.


ఈ వ్యయంలో హైదరాబాద్‌ నగరానికి రూ.319.53 కోట్లు కేటాయించగా.. ఇందులో ఎన్‌డీఎంఎఫ్‌ ద్వారా రూ.250 కోట్లు ఆర్థికసాయం ఉంటుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రూ.75 కోట్లు ఎన్‌డీఎంఎఫ్‌ ద్వారా నిధులు విడుదల చేసినట్లూ తెలిపింది. అలాగే, రెండో దశలో ఆమోదం పొందిన విశాఖపట్నానికి రూ.222.22 కోట్లు కేటాయించగా.. ఇందులో ఎన్‌డీఎంఎఫ్‌ ద్వారా రూ.200 కోట్లు కేంద్ర ఆర్థికసాయంగా ఉంటుందని వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

వందేమాతరం కూడా ఇక జనగణమనతో సమానం.. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

Updated Date - Aug 11 , 2026 | 08:05 PM