పల్లెలో తెగిన నోట్ల కట్టలు!
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:46 AM
రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో నోట్ల కట్టలు తెగాయి. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు డబ్బులు వెదజల్లారు.
నెల్లూరు జిల్లా బండగానిపల్లిలో ఓటుకు 45 వేలు
తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరంలో 21 వేలు
రెండో విడత ఎన్నికల్లో జోరుగా తాయిలాల పంపిణీ
ఉదయగిరి/ఏలూరు/భీమవరం/రంగంపేట, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో పల్లెల్లో నోట్ల కట్టలు తెగాయి. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు డబ్బులు వెదజల్లారు. కొన్నిచోట్ల పురుషులకు మద్యం బాటిళ్లు, స్త్రీలకు చీరలు, రైస్ కుక్కర్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని బండగానిపల్లి పంచాయతీలో ఒక్కో ఓటు ఏకంగా రూ.45వేలు పలికిందట!! ఈ పంచాయతీలో 1634 ఓట్లు ఉన్నాయి. ప్రధాన పార్టీల మద్దతు గల ఇద్దరు అభ్యర్థులు ఓటుకు రూ.25 వేలు, రూ.15వేలు చొప్పున ఇవ్వగా.. వైసీపీ రెబల్ అభ్యర్థి రూ.5 వేలు ఇస్తున్నట్లు సమాచారం.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలో సర్పంచ్ అభ్యర్థులు ఒక్కొక్కరు ఓటుకు రూ.5-6వేల వరకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. వార్డు అభ్యర్థులు మరో రూ.5 వేల వరకు అందిస్తున్నట్టు ప్రచారం ఉంది. ఏలూరు జిల్లాలోని పలు చోట్ల తాయిలాల ఎర జోరుగా సాగింది. నిడమర్రు మండలం ఫత్తేఫురంలో ఓటుకు రూ.6 వేలు చొప్పున పంపకాలు జరిగినట్లు సమాచారం. కలిదిండి మండలం భాస్కరరావుపేటలో ఓటుకు రూ.4-6 వేల వరకూ ఇస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులకు అదనంగా మహిళలకు చీరలు, రైస్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు పంపిణీ చేశారు. ద్వారకాతిరుమల మండలంలో ఒక అభ్యర్థి మహిళలకు చిన్న వెండి గంధపు గిన్నెలు, చీరలు ఇచ్చారని అంటున్నారు.
కొల్లేరు గ్రామాల్లోను రూ.3 వేల వరకు ఓటు పలికింది. నిడమర్రులో ఓ కుటుంబంలో 10 ఓట్లు ఉంటే గుత్తగా రూ.లక్ష ఇవ్వడానికి అభ్యర్థులు సిద్ధపడ్డారు. పురుషులకు మద్యం బాటిళ్ల పంపిణీ చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల డబ్బుతో పాటు స్త్రీలకు చీరలు, కుక్కర్లు ఇచ్చారు. పెంటపాడు మండలంలోని పరిమళ్ల గ్రామంలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.2500తో పాటు ప్రతి ఇంటికీ కుక్కర్ ఇచ్చారు. బోడపాడు పంచాయతీలో ఒక అభ్యర్థి పట్టు చీరలు, రూ.2 వేలు పంచిపెడితే, మరో అభ్యర్థి రూ.2 వేల వరకు పంపకాలు చేపట్టారు. తణుకు మండలం తేతలిలోనూ ఒక్కో ఓటుకు రూ.2 వేలు ఇచ్చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..