అసెంబ్లీకి ఎమ్మెల్యేల హాజరుపై నిఘా కోసం సీట్లకు కెమెరాలు: స్పీకర్ అయ్యన్న
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:33 AM
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తుని రూరల్, (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మంగళవారం కాకినాడ జిల్లా తుని రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషిచేస్తారనే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. అయితే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించి సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా బయట సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. సభ్యుల హాజరును పారదర్శకంగా పర్యవేక్షించేందుకు వారి సీట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే తన సీటులో ఉన్నప్పుడే సభకు హాజరైనట్లు పరిగణించే విధానాన్ని అమలు చేయబోతున్నాం’ అని వెల్లడించారు. డీఎస్సీ అంశాన్ని అనవసరంగా వివాదం చేయడం సరికాదన్నారు. క్రీడాకోటా నియామకాలకు సంబంధించి వాస్త్తవాలను రికార్డుల పరిశీలన అనంతరం వెల్లడించాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్పోర్ట్స్ అంటే మాజీ మంత్రి రోజా కబడ్డీ ఆడినట్లా అని ఎద్దేవాచేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ నెల 17న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు స్పీకర్ తెలిపారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చకు అవకాశం కల్పిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి
జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని పేల్చుకున్న తండ్రి