‘ఎర్ర బస్సు’ కష్టాలు!
ABN , Publish Date - Aug 02 , 2026 | 08:08 AM
వైసీపీ అధ్యక్షుడు ఏదో ఒకటి అనేసి ‘డ్యామేజీ’ చేసేస్తారు! ఆ తర్వాత... అదే పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి ‘డ్యామేజీ కంట్రోల్’కు ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో జరిగింది ఇదే! ఇప్పుడు... ‘ఎర్రబస్సు’తో వైసీపీకి పెద్ద తిప్పలొచ్చి పడ్డాయి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు ఏదో ఒకటి అనేసి ‘డ్యామేజీ’ చేసేస్తారు! ఆ తర్వాత... అదే పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వచ్చి ‘డ్యామేజీ కంట్రోల్’కు ప్రయత్నిస్తారు. అనేక విషయాల్లో జరిగింది ఇదే! ఇప్పుడు... ‘ఎర్రబస్సు’తో వైసీపీకి పెద్ద తిప్పలొచ్చి పడ్డాయి. భోగాపురం క్రెడిట్‌ను జేబులో వేసుకోవాలనుకున్న ఆ పార్టీకి గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలే అడ్డంకిగా మారాయి. మరీ ముఖ్యంగా... ‘ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు’ అనే మాట! శనివారం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎర్రబస్సు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. దీంతో ఆ వెంటనే సజ్జల తెరమీదికి వచ్చారు. ఆ మాటలన్నది జగన్ కాదని... మరో మహిళ అడుగుతోంది అంటూ ఆమె మాటగా చెప్పారని చెప్పుకొచ్చారు. ఆమె అడిగిందో లేదో తెలియదు గానీ, జగన్ మాత్రం మైకులో ఆ మాట గట్టిగా చెప్పారు. దీంతో... సజ్జల టింకరింగ్‌లు పని చేయలేదు. నిజానికి... అప్పట్లో విపక్ష నేతగా జగన్ అంతటితో ఊరుకోలేదు. భోగాపురం విమానాశ్రయమే అనవసరమన్నారు. ‘విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటుంటారు. మళ్లీ భోగాపురంలో ఎయిర్ పోర్టు ఎందుకు?’ అని ప్రశ్నించారు. ‘భోగాపురాన్ని అడ్డుకునే కార్యక్రమం చేద్దాం! కోర్టుకు పోదాం! కేసులు వేద్దాం!’ అని కూడా చెప్పారు.
ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి... సజ్జల దీనికీ సమాధానం చెప్పాలి కదా! భోగాపురంపై జగన్ మొదటి మూడు నాలుగేళ్లు మౌనంగా ఉండి, ఆ తర్వాత ప్రజా వ్యతిరేకతతోపాటు కొన్ని ఇతర కారణాలతో 2023లో మళ్లీ రెండోసారి శంకుస్థాపన చేశారు. జీఎంఆర్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరగదోడారు. 500 ఎకరాలు వెనక్కి లాక్కున్నారు. ఇవన్నీ కాదనలేని వాస్తవాలు. 2023 మే నెలలో భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సమయంలోనే 2026లో ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు తిరుగుతాయంటూ ప్రకటించానని ఎక్స్ వేదికగా జగన్ ట్వీట్ చేశారు. అంతకుముందు నాలుగేళ్లు ఏం చేశారన్న సంగతి మాత్రం చెప్పలేదు. తన హయాంలో భోగాపురం విమానాశ్రయం పనులు ఏకంగా 80 శాతం పూర్తయ్యాయని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం ఆరులేన్ల జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారంటూ జగన్ పలుమార్లు చెబుతూ వచ్చారు. ఇదే జగన్ తాజాగా ఈ రోడ్డు పనులు పూర్తవలేదంటూ విమర్శలూ గుప్పించారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా పొంతన లేని మాటలు చెబుతున్నారు. ఐదేళ్ల జగన్ హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు జరిగింది 26 శాతం! ఇది అధికారిక సమాచారం. జగన్ గద్దెదిగే నాటికి భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలూ ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో... భోగాపురం విమానాశ్రయంపై జగన్ మాట్లాడకుండా ఉండటమే మంచిదని మెజారిటీ వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్‌లో భారత్‌కు రెండు పతకాలు
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..