నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులతో బీజేపీ నేత వాగ్వాదం
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:16 AM
శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఆదివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బారికేడ్లను కారుతో ఢీకొట్టి లోపలకు వెళ్లేందుకు యత్నం
సీఐ, ఎస్సైకి స్వల్పగాయాలు
శ్రీకాకుళం క్రైం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఆదివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రానికి వందమీటర్ల దూరంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపుగా వాహనాల రాకపోకలు నిలిపేశారు. బీజేపీ నాయకుడు వెంకటేశ్వరరావు తన కారులో నామినేషన్ కేంద్రానికి వచ్చారు. తాను వికలాంగుడినని, తన కారును లోపల కార్యాలయం వరకు అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల విధుల్లో భాగంగా విశాఖపట్నం నుంచి వచ్చిన సీఐ శ్రీనివాసరావు, శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్సై సుధాకర్.. కార్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అయినప్పటికీ వెంకటేశ్వరరావు బారికేడ్లను కారుతో ఢీకొట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. సీఐ, ఎస్సై కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. టూటౌన్ పోలీసులు.. వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!