వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దు: బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ
ABN , Publish Date - Jun 15 , 2026 | 01:27 PM
కొంత కాలంగా బీజేపీపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ మాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అమరావతి, జూన్ 15: కొంత కాలంగా బీజేపీపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ మాటలను ప్రజలు నమ్మొద్దని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ లేని సమస్యను ఉన్నట్లుగా చూపిస్తూ.. అబద్ధపు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. గతంలో తిరుపతిలో బస్సుల్లో దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందన్నారు. ఆ సమయంలో బీజేపీ నాయకులు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో, వైసీపీకి సహకరించిన కలెక్టర్ సహా పలువురు అధికారులను విధుల నుంచి తొలగించారని గుర్తుచేశారు. ఓట్ల తొలగింపు అనేది నిబంధనల ప్రకారమే జరుగుతుందని... కేవలం చనిపోయిన వారి ఓట్లు, రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి వివరాలను మాత్రమే తొలగిస్తారని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను సమ న్యాయంతో చూసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని షేక్ బాజీ పునరుద్ఘాటించారు.
ఓట్ల సర్వేపై దుష్ప్రచారాలు నమ్మొద్దు..
ఓటర్ల ప్రత్యేక సర్వే ప్రక్రియపై దేశవ్యాప్తంగా సాగుతున్న అపోహలను మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ఖండించారు. ఈ ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదని, కాంగ్రెస్ హయాంలోనే 2002లో ఇది మొదలైందని స్పష్టం చేశారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ సర్వే ద్వారా మైనారిటీల ఓట్లను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం నకిలీ ఓట్లను ఏరిపారేయడానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాల వారికి ఇక్కడ ఓట్లు ఉంటే అవి ఎలా వచ్చాయో పరిశీలిస్తారని, అలాగే రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి వివరాలను తొలగిస్తారని చెప్పారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసమే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టిందని సయ్యద్ బాషా వివరించారు.
ఇవి కూడా చదవండి...
ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పోలీసుల కాల్పులు..
Read Latest Telangana News And Telugu News