మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు.. బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:58 PM
మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని చేపడుతున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది..
అమరావతి, సెప్టెంబర్ 2: వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా మంత్రి సత్యకుమార్‌ను నియమించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రజాసేవ, దేశాభివృద్ధి, ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ఈ అభియాన్‌లో పలు కార్యక్రమాలను రూపొందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ నిర్వహించనున్నారు.
ఈ అభియాన్‌లో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి పలు సేవా.. ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అభియాన్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మరికాసేపట్లో జరగనున్న రాష్ట్రవ్యాప్త కార్యశాలలో మంత్రి సత్యకుమార్ పాల్గొననున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలపై ఈ కార్యశాలలో చర్చించి.. అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు
గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ
Read Latest AP News And Telugu News