Share News

వారు ఓడారు.. పార్టీనీ గెలిపించలేకపోయారు!

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:35 AM

తెలుగుదేశం, జనసేనలతో పాటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా బలాన్ని చాటుకోలేకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

వారు ఓడారు.. పార్టీనీ గెలిపించలేకపోయారు!

  • ‘స్థానికం’లో బీజేపీ ముఖ్య నేతలకు షాక్‌

  • జిల్లా అధ్యక్షులకూ తప్పని పరాజయం

  • కొందరు కీలక నేతలదీ ఇదే పరిస్థితి

  • జాతీయ స్థాయి నేతలున్న చోటా ఓటమి

  • కూటమి పార్టీలతో సమన్వయం కరువు

  • సొంత క్యాడర్‌కూ దూరం

  • రాష్ట్ర నాయకత్వ తీరుపై పార్టీలో అంతర్మథనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం, జనసేనలతో పాటు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగా బలాన్ని చాటుకోలేకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేసింది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో.. పార్టీలో ముఖ్య నేతలే ఓటమిపాలవడం కమలనాథుల్లో చర్చకు దారితీస్తోంది. జిల్లా అధ్యక్షులుగా పనిచేసినవారు, రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నవారు పలువురు ఓడిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

విజయనగరం జిల్లా లో రెండుసార్లు జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన రెడ్డి పావని గజపతినగరం జడ్పీటీసీగా పోటీచేసి గెలవలేకపోయారు. ప్రకాశం జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నెగ్గం శ్రీనివాసరావు ఒంగోలులో కార్పొరేటర్‌గా ఓటమి చవిచూశారు. తిరుపతిలో రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సామంచి శ్రీనివాసు సైతం కార్పొరేటర్‌గా గెలవలేకపోయారు. విశాఖపట్నం నగర బీజేపీలో జనరల్‌ సెక్రటరీ దామోదర యాదవ్‌ కార్పొరేటర్‌ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. బీజేపీ సీనియర్‌ నేత చిగురుపాటి కుమారస్వామి ఓటమి పార్టీలో మరో చర్చకు కారణమైంది. కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన సొంత మండలం గన్నవరం జడ్పీటీసీగా విజయం సాధించలేకపోయారు.

‘అనంత’లో మరీ దారుణం!

అనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్‌ ఇచ్చాయి. ఆ పార్టీకి చెందిన మంత్రి సత్యకుమార్‌ ఉన్నప్పటికీ, బీజేపీ ఆశించినస్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. జిల్లా నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న సందిరి శ్రీనివాసు వ్యవహారశైలి, అభ్యర్థుల ఎంపికపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయ అనుభవం, ప్రజాబలం ఉన్నవారిని పక్కనపెట్టి అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేనకు ఏడు కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించగా ఆరు చోట్ల విజయం సాధించింది.

బీజేపీకి ఆరు స్థానాలు కేటాయిస్తే ఒక్కస్థానంలో మాత్రమే గెలుపొందింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో బీజేపీ యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మిట్టా వంశీ, జాతీయ పార్టీ సెల్స్‌ కన్వీనర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి మద్దతున్న అభ్యర్థి కౌన్సిలర్‌గా ఓటమి పాలవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది.

సమన్వయం ఏదీ?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పరాజయాలకు కూటమి పార్టీలతోనూ, పార్టీలోనూ సమన్వయం లోపం ప్రధాన కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయని సీనియర్‌ నాయకులు, గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేసినవారు, ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న నేతలను కనీసం సంప్రదించలేదన్న అసంతృప్తి ఉంది. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోలేకపోయారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడికి అప్పగించడంపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు, శాసనమండలి పక్ష నేత సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజనా చౌదరి వంటి సీనియర్‌ నాయకులు ఉన్నారు. ఈ పరాజయాలపై నాయకత్వం సమీక్షించుకోవాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలో రాష్ట్రవ్యాప్తంగా 67 కార్పొరేటర్‌ స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా.. 40 చోట్ల గెలిచింది. 179 మున్సిపల్‌ కౌన్సిలర్ల స్థానాలకు పోటీ పడి.. 113 విజయం సాధించింది. 34 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసి.. 23 స్థానాల్లోను, 303 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయగా.. 169 స్థానాల్లో గెలుపొందింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:37 AM