Share News

రీ కౌంటింగ్‌ పెట్టండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:53 AM

అనంతపురం నగర మేయర్‌ ఎన్నికపై కూటమి అభ్యర్థి, బీజేపీ నేత అజేష్‌ బాబు జిల్లా కోర్టును ఆశ్రయించారు

రీ కౌంటింగ్‌ పెట్టండి

  • అనంత మేయర్‌ ఓట్ల లెక్కింపుపై అనుమానాలు

  • జిల్లా కోర్టులో కూటమి అభ్యర్థి అజేష్‌ బాబు పిటిషన్‌

అనంతపురం క్రైం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అనంతపురం నగర మేయర్‌ ఎన్నికపై కూటమి అభ్యర్థి, బీజేపీ నేత అజేష్‌ బాబు జిల్లా కోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని, రీ కౌంటింగ్‌ చేయించాలని విన్నవించారు. ఈమేరకు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు సమక్షంలో గంటకుపైగా వాదనలు జరిగాయి. దీనిపై శనివారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. జిల్లా కోర్టులో అనుకూల తీర్పు రాకపోతే, హైకోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది. కాగా, ఈ సీటును వైసీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రమేష్‌ గౌడ్‌ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అజేష్‌ బాబుపై గెలిచారు.

ఈ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్‌ సీట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిచింది. మేయర్‌ సీటు మాత్రం వైసీపీకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్‌పై మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి అజేష్‌ బాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్‌, కౌంటింగ్‌, ఆర్వో వ్యవహరించిన తీరుపై బీజేపీ అభ్యర్థి పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండటం, 7వ రౌండ్‌లో వైసీపీకి అసాధారణ మెజారిటీ రావడం, కౌంటింగ్‌ హాల్‌లో బయటి వ్యక్తులు తిరగడం, అదనపు కౌంటింగ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయడం తదితర పరిణామాలపై అజేష్‌ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చేసిన ఫిర్యాదులపై ఫలితం లేకపోవడంతో బీజేపీ పెద్దల ఆదేశాలతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Updated Date - Nov 21 , 2026 | 07:02 AM