Share News

అమ్ముడుపోయారు!

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:20 AM

పోలీసులు అనుకుంటే ఎంత కరుడుగట్టిన నేరస్తుడినైనా... ఎక్కడ దాక్కున్నా ఇట్టే పట్టుకోగలరు! అంతర్రాష్ట్ర క్రిమినల్‌ భీముడు అజిత్‌ కుమార్‌ను విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కష్టపడి పట్టుకున్నారు. కానీ...

అమ్ముడుపోయారు!

  • అతను మోసాలు చేయడంలో ఆరితేరాడు! నాలుగు రాష్ట్రాల్లో 32 కేసుల్లో నిందితుడు! మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌! పేరు... భీముడు అజిత్‌ కుమార్‌! పేరుకు తగినట్లుగానే భారీకాయంతో గంభీరంగా ఉంటాడు! అరెస్టు తర్వాత ‘గుండె నొప్పి’ పేరుతో ఆస్పత్రిలో చేరాడు. తర్వాత... చాలా కూల్‌గా బయటికి వచ్చేసి, ఆటో ఎక్కి పారిపోయాడు! ఇదో గ్రేట్‌ ఎస్కేప్‌! దీనికోసం అతను పెట్టిన ఖర్చు... రూ.50 లక్షలకు పైగానే! జైలు వార్డర్‌ నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వేలూ లక్షలు విసిరేశాడు! చల్లగా తప్పించుకున్నాడు. డబ్బులతో కొడితే ఎవరినైనా ‘వదిలేస్తారా?’ అంతగా అమ్ముడుపోవడమేనా? అటు జైళ్ల శాఖలో, ఇటు పోలీసు శాఖలో ఇప్పుడు ఇదో చర్చ! దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే అంతర్గత నివేదిక అందింది.

  • ఖైదీ భీముడు ఖరీదైన ఎస్కేప్‌

  • రూ.50 లక్షలకుపైగా కట్టలతో కొట్టాడు

  • వార్డర్‌, జైలర్‌, డాక్టర్‌, కోర్టు క్లర్కు, పోలీసు అధికారులు

  • అన్ని వ్యవస్థలనూ మేనేజ్‌ చేసిన వైనం

  • కోరుకున్న రేపల్లె జైలుకే రిమాండ్‌

  • గుండెనొప్పి పేరుతో గుంటూరు ఆస్పత్రికి

  • అక్కడి నుంచి కూల్‌గా పరార్‌

  • ప్రభుత్వానికి అందిన అంతర్గత నివేదిక

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పోలీసులు అనుకుంటే ఎంత కరుడుగట్టిన నేరస్తుడినైనా... ఎక్కడ దాక్కున్నా ఇట్టే పట్టుకోగలరు! అంతర్రాష్ట్ర క్రిమినల్‌ భీముడు అజిత్‌ కుమార్‌ను విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కష్టపడి పట్టుకున్నారు. కానీ... ఆ నేరస్తుడు గతనెల 28వ తేదీన చల్లగా తప్పించుకు పారిపోయాడు. దీని వెనుక సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తొలుత భావించారు. కానే కాదు... నోట్ల కట్టలు, భారీ కుట్రలు ఉన్నట్లు నేడు తేలింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...


ఇదీ చరిత్ర...

ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్నగూడెం గ్రామానికి చెందిన భీముడు అజిత్‌ కుమార్‌ మోసాలకు అలవాటు పడ్డాడు. పదేళ్ల క్రితం ఒంగోలులో గ్రానైట్‌ వ్యాపారం మొదలు పెట్టి..నకిలీ వే బిల్లులు సృష్టించి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టాడు. వ్యాపారులనూ బురిడీకొట్టించి డబ్బులు కొట్టేశాడు. గ్రానైట్‌ వ్యాపారి పేరుతో క్యాబ్‌లు బుక్‌ చేసుకోవడం, డ్రైవర్లతో పరిచయాలు పెంచుకోవడం, డబ్బులు ఎరవేసి సిమ్‌ కార్డులు కొనిపించడం, వారి బ్యాంకు ఖాతాలకు మోసాల డబ్బు జమ చేయించుకుని సిమ్‌ తీసి పారేయడం! ఇదీ అతని చీటింగ్‌ స్టైల్‌! ఎట్టకేలకు ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి... 2018లో అజిత్‌ను అరెస్టు చేసి ఒంగోలు జైలుకు తరలించారు. జైలు వార్డర్లకు డబ్బుల ఆశ చూపించి... అనారోగ్యం పేరుతో ఆసుపత్రికి వెళ్లి పరారయ్యాడు. అక్కడ అజిత్‌ను అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లిన జైలు వార్డర్లు... దేవపాల్‌, సుభాష్‌ చంద్రబోస్‌! వీరిద్దరినీ అధికారులు సస్పెండ్‌ చేసి... తర్వాత కొన్నాళ్లకు వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్స్‌ ఇచ్చారు.

ఒంగోలు జైలు నుంచి పరారయ్యాకా... అజిత్‌ కుమార్‌ తన మోసాలు మానలేదు. ఈసారి... ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా మార్చుకున్నాడు. ఆ వెబ్‌సైట్‌లో కార్ల అమ్మకాల కోసం ఫొటోలు పెట్టేవారిని సంప్రదించి తాను ఏజెంట్‌నని పరిచయం చేసుకునేవాడు. కొనుగోలు, అమ్మకాల పేరుతో లక్షలు కొట్టేశాడు. ఇలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో అతనిపై 32 కేసులు నమోదయ్యాయి. విజయవాడ పోలీసులకు వచ్చిన ఒక ఫిర్యాదుతో ఇటీవలే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అజిత్‌ను అరెస్టు చేశారు. అయితే, పాత కేసులో అరెస్టు చూపించేందుకు అతడిని ఒంగోలు పోలీసులు తీసుకెళ్లారు. అక్కడి జిల్లా జైలులో బంధించారు. తమ పోలీసు స్టేషన్‌లోనూ అజిత్‌పై మోసం కేసు నమోదైందంటూ... తెనాలి పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లారు. ‘గ్రేట్‌ ఎస్కే్‌ప’కు అక్కడే నాంది పడింది. తెనాలి జైలులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో... అజిత్‌ను రిమాండ్‌ కోసం ఇంకేదైనా జైలుకు తరలించాల్సి ఉంది. అసలే... అంతర్రాష్ట్ర నేరస్తుడు. పైగా... అప్పటికే ఒకసారి తప్పించుకుపోయిన చరిత్ర! అలాంటి ఖైదీని జిల్లా స్థాయి జైలుకు తరలించాలి. కానీ... అనూహ్యంగా రేపల్లె సబ్‌ జైలుకు పంపించారు.


రేపల్లె ఎందుకు... ఎలా?

ఒంగోలు జైలులో ఉండగా అజిత్‌ కుమార్‌ తప్పించుకున్నప్పుడు సస్పెండ్‌ అయిన ఇద్దరు వార్డర్లలో ఒకరు... దేవపాల్‌! అదే దేవ్‌పాల్‌ ఇప్పుడు రేపల్లె సబ్‌ జైలులో పని చేస్తున్నారు. ఆ జైలులో మొత్తంగా ఉండే సిబ్బందే చాలా తక్కువ! పైగా... జైలు అధికారి మద్యం మత్తులో ఉంటారని, అప్రమత్తంగా ఉండరనీ ఆరోపణలు! సరిగ్గా... అజిత్‌ ఇదే సబ్‌ జైలును ఎంచుకున్నారు. రేపల్లె జైలుకే రిమాండ్‌ రావడం వెనుక కోర్టు క్లర్కు పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ రిమాండ్‌లో ఉండగానే... అజిత్‌కు మళ్లీ ఆయాసం, గుండె నొప్పి వచ్చాయి. అంతకుముందు ఒంగోలు జైలు నుంచి అజిత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన వార్డర్‌ దేవ్‌పాలే ఇప్పుడూ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్చి 28వ తేదీ ఉదయం గుంటూరు ఆస్పత్రిలో ఖైదీల వార్డులకు కాపలాగా ఉన్న ముగ్గురు ఏఆర్‌ కానిస్టేబుళ్లలో ఇద్దరు ఏదో పని మీద పక్కకు వెళ్లారు. ఇంకో కానిస్టేబుల్‌ టిఫిన్‌ చేస్తుండగా... ‘సార్‌, టాయ్‌లెట్‌’ అని అజిత్‌ అడగ్గానే, ‘వెళ్లవయ్యా, వెళ్లు’ అని కానిస్టేబుల్‌ తలూపారు. అజిత్‌ తన భారీ కాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వెళ్లి, ఆటో ఎక్కిపరారయ్యాడు.

కుమ్మక్కులు, కుట్రలు బయటికి..

భీముడు అజిత్‌ కుమార్‌ పరారీ వెనుక భారీ స్థాయిలో కుమ్మక్కులు, కుట్రలు ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు అనుమానించారు. సీసీ ఫుటేజీల నుంచి ఫోన్‌ పే, కాల్‌ డిటైల్స్‌ వరకూ కూపీ లాగారు. చెన్నైలో ఉన్న అజిత్‌ కుమార్‌ సన్నిహితుడి ద్వారా భారీ స్థాయిలో సొమ్ములు చేతులు మారాయని తేలింది. కొందరికి ఏకంగా ఫోన్‌ పేలోనే సొమ్ములు పడ్డాయి. జైళ్ల శాఖ అధికారి ఒకరికి రూ.10 లక్షలు అందగా... మరో పోలీసు అధికారికి రూ.పాతిక లక్షల వరకూ ముట్టజెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అజిత్‌కు గుండెకు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ లేదని, అయినా జైలు డాక్టర్‌ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చారని కూడా తేలింది. ఈ బాగోతంపై విచారణ జరిపిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అంతర్గత నివేదిక ఇచ్చినట్లు సమాచారం. సెలవుపై అమెరికాకు వెళ్లిన జైళ్లశాఖ ఇన్‌చార్జి డీజీ గురువారం విధుల్లో చేరనున్నారు. అజిత్‌ కుమార్‌ పరారీ కుట్రలో మరెన్ని కోణాలు బయటపడతాయో వేచి చూడాలి!

Updated Date - Apr 23 , 2026 | 03:20 AM