అంధ విద్యార్థుల మరో నేత్రం
ABN , Publish Date - Sep 18 , 2026 | 04:04 AM
మంచి ఆశయానికి ఉత్తమ కృషి తోడైతే అందని ఆకాశం, దొరకని విజయం ఉండవు. భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థలో ఈఈఈ చివరి సంవత్సరం చదువుతున్న లింగంపల్లి హిమజ విషయంలో ఇది ముమ్మాటికీ నిజం.
వారి అభ్యాసాన్ని తేలిక పరిచే ‘రుద్ర’
మాటల్ని బ్రెయిలీలోకి మార్చే వాయిస్ ప్రింటర్
రూపకల్పన చేసిన భీమవరం విద్యార్థిని హిమజ
ఆమె ఆవిష్కరణకు జాతీయస్థాయిలో ప్రథమ స్థానం
అంతర్జాతీయంగా టాప్-20లో గుర్తింపు
భీమవరం టౌన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మంచి ఆశయానికి ఉత్తమ కృషి తోడైతే అందని ఆకాశం, దొరకని విజయం ఉండవు. భీమవరంలోని బీవీ రాజు విద్యాసంస్థలో ఈఈఈ చివరి సంవత్సరం చదువుతున్న లింగంపల్లి హిమజ విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలో పాఠాలను రాసుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఆమె చూపిన పరిష్కారం జాతీయ గుర్తింపును పొందింది. ఈ సమస్యకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపే వినూత్న పరికరాన్ని హిమజ రూపొందించారు. మాట్లాడిన మాటలను నేరుగా బ్రెయిలీ లిపిలోకి మార్చి ప్రింట్ చేసే వాయిస్ ప్రింటర్‌ను ఆవిష్కరించారు. దీనికి ‘రుద్ర’గా నామకరణం చేశారు.
అక్కడే బీజం పడింది...
భీమవరంలో డాక్టర్ యు.వి. రమణరాజు నిర్వహిస్తున్న అంధుల పాఠశాలను హిమజ తోటి విద్యార్థులతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులు బ్రెయిలీ లిపిలో పాఠాలను తయారు చేసుకునేందుకు పిన్ ఆధారిత పద్ధతిని ఉపయోగించడాన్ని ఆమె గమనించారు. ఇందుకు వారు పడుతున్న అవస్థలను దగ్గరగా గమనించారు. దీనికి పరిష్కారంగా.. మాట్లాడిన విషయాలను నేరుగా బ్రెయిలీ అక్షరాలుగా మార్చి ప్రింట్ చేసే పరికరం ఉంటే బాగుంటుందని భావించారు. ఈ ఆలోచనను లెక్చరర్ రోహిత్ బాలాజీ జొన్నలతో పంచుకోగా, ఇందుకు ఆమెను ఆయన ప్రోత్సహించారు. బాలాజీ అందించిన సాంకేతిక సహకారంతో పరికరం రూపకల్పన ప్రారంభమైంది. తొలుత బటన్ ఆధారిత నమూనాను రూపొందించి అంధ విద్యార్థిని రమ్యతో హిమజ పరీక్షించారు. అనంతరం మరో విద్యార్థిని అలేఖ్య సూచనతో బ్రెయిలీ అక్షరాలు నేరుగా ప్రింట్ అయ్యేలా పరికరాన్ని మరింత అభివృద్ధి చేశారు.
రూ.1.50 లక్షలతో రూపకల్పన
సాధారణంగా అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలో రాసిన పేజీని వెనకకు తిప్పి, అక్షరాలను చేతి వేళ్లతో తడుముకుంటూ చదవాల్సి ఉంటుంది. దీనివల్ల సమయం పట్టడంతోపాటు ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హిమజ రూపొందించిన వాయిస్ ప్రింటర్ చాలావరకు ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఈ పరికరం తయారీకి సుమారు రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయని హిమజ తెలిపారు. అవసరమైన పరికరాలను ఆన్‌లైన్ ద్వారా సమకూర్చుకుని, సుమారు మూడు నెలల వ్యవధిలో ప్రింటర్‌ను రూపొందించినట్లు వివరించారు. ఈ మిషన్‌ను అంధ విద్యార్థులకు రూ.50 వేలకే రూపొందించి ఇవ్వవచ్చని తెలిపారు.
సర్వత్రా గుర్తింపు..
ప్రతి సంవత్సరం నిర్వహించే జేమ్స్ డైసన్ అంతర్జాతీయ పోటీల్లో భాగంగా 165 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలతో పాల్గొన్నారు. వారిలో హిమజ రూపొందించిన అంధుల వాయిస్ ప్రింటర్ అంతర్జాతీయ స్థాయిలో టాప్ 20లో స్థానం సంపాదించింది. జాతీయస్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం ఈ ఆవిష్కరణకు మరింత గుర్తింపును తెచ్చింది. అంధులకు ఈ పరికరం మరో నేత్రంలా ఉపయోగపడాలనే భావనతో దీనికి ‘రుద్ర’ అనే పేరు పెట్టినట్లు హిమజ తెలిపారు. పరమేశ్వరుడి మూడో నేత్రం మాదిరిగా అంధుల జీవితాల్లో ఈ పరికరం వెలుగును నింపాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. అంధ విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ఉపయోగపడేలా ‘రుద్ర’ను మరింత అభివృద్ధి చేసే పనిలో హిమజ ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి: