Share News

ఆత్మనిర్భర్‌ పంచాయతీలు!

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:29 AM

రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ పథకం ద్వారా అనేక రంగాల్లో ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గండికోట, అహాబిలం, పెంచలకోన, శ్రీశైలం పరిసర గ్రామాలు, లంబసింగి, అరకు, హార్స్‌లీ హిల్స్‌ గ్రామ పంచాయతీలు పార్కింగ్‌, వసతి గృహాలు, ఎకో టూరిజం, బోటింగ్‌, ఫుడ్‌కోర్టులు వంటివి ఏర్పాటు చేసి ఆదాయం పొందవచ్చు

ఆత్మనిర్భర్‌ పంచాయతీలు!

  • గ్రాంట్లపై ఆధారపడొద్దు.. సొంత ఆదాయం పెంచుకోండి

  • స్వయం సమృద్ధి సాధించండి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

  • ఎంపికైన గ్రామాలకు సాంకేతిక సాయం

  • కర్నూలు జిల్లా బిల్లేకల్లు గురించి ప్రత్యేక ప్రస్తావన

  • రాష్ట్రంలో పర్యాటకం, సోలార్‌, గ్రామీణ మార్కెట్లు,

  • ఎకో పార్కులు, వ్యర్థాల నిర్వహణలో భారీ అవకాశాలు

  • రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను బట్టి ఈ పథకం ద్వారా అనేక రంగాల్లో ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గండికోట, అహాబిలం, పెంచలకోన, శ్రీశైలం పరిసర గ్రామాలు, లంబసింగి, అరకు, హార్స్‌లీ హిల్స్‌ గ్రామ పంచాయతీలు పార్కింగ్‌, వసతి గృహాలు, ఎకో టూరిజం, బోటింగ్‌, ఫుడ్‌కోర్టులు వంటివి ఏర్పాటు చేసి ఆదాయం పొందవచ్చు.

  • కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామ పంచాయతీని కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించింది. అక్కడ ఏర్పాటు చేసిన టమాటా- కూరగాయాల మార్కెట్‌ ద్వారా గ్రామ పంచాయతీ సొంత ఆదాయం పెంచుకున్న విధానాన్ని ఆదర్శంగా చూపించింది.

  • ప్రత్యేక ప్రస్తావన

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిధులపై ఆధారపడే పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీలు బయటకు రావాలని కేంద్రం భావిస్తోంది. గ్రామాలకు శాశ్వత ఆదాయ వనరులు సృష్టించడం ద్వారా అవి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో రూపొందించిన ఆత్మనిర్భర్‌ పంచాయతీ కార్యక్రమానికి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిలో భాగంగా దేశంలో అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్‌ పంచాయతీలు ఆదాయం తీసుకొచ్చే వినూత్న ప్రాజెక్టులను ప్రతిపాదించాలి. ఎంపికైన ప్రతిపాదనలకు నగదు గ్రాంట్లు కాకుండా సాంకేతిక సహాయం, ప్రాజెక్టు రూపకల్పన, ఆర్థిక వనరుల సమీకరణ, అమలుకు పూర్తి సహకారాన్ని కేంద్రం అందించనుంది. ఒకరకంగా ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ. ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి, ఆయా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. దీనిద్వారా గ్రామాల్లో ఆదాయ వనరులు పెరుగుతాయి. ప్రభుత్వ నిధులపై ఆధారపడటం తగ్గుతుంది. గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రైవేట్‌ పెట్టుబడులు రావడంతో పంచాయతీలు స్వయంగా ఆదాయం సంపాదించే సంస్థలుగా మారే అవకాశం ఉంటుంది.


పంచాయతీల అర్హతలు ఇవీ...

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏటా కనీసం రూ.50 లక్షల సొంత ఆదాయం కలిగి ఉండాలి. ఎన్నికైన పాలకవర్గానికి కనీసం మరో మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉండాలి. గ్రామసభ ఆమోదంతో గత మూడేళ్ల ఆడిట్‌ ఖాతాలు సమర్పించిన వాటిని ఆత్మనిర్భర్‌ గ్రామ పంచాయతీలుగా ఎంపిక చేస్తారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. స్కోరింగ్‌ విధానం, ఆర్థిక సాధ్యత, పర్యావరణ అనుకూలత, ఆదాయ సామర్థ్యం, గ్రామసభ ఆమోదం, రాజకీయ ఏకాభిప్రాయం వంటి అంశాల ఆధారంగా మార్కులు కేటాయించి కేంద్రానికి పంపుతుంది. చివరగా కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాతీయ స్థాయిలో పంచాయతీలను ఎంపిక చేస్తుంది. ఈ పథకం కింద కేంద్రం నేరుగా నగదు మంజూరు చేయదు. దానికి బదులు ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ, సాధ్యత అధ్యయనం, బ్యాంకు రుణాల సమీకరణ, సీఎస్ఆర్‌ నిధుల అనుసంధానం, పీపీపీ నమూనాల రూపకల్పన, టెండరు డాక్యుమెంట్లు, ఒప్పందాల తయారీ, అమలు పర్యవేక్షణ తదితరాలకు ప్రత్యేక సాంకేతిక సంస్థను నియమిస్తుంది. పంచాయతీలు తమ భూములను విక్రయించకుండా.. పీపీపీ విధానాల్లో ప్రైవేట్‌ పెట్టుబడులను ఆకర్షించి, శాశ్వత ఆదాయ వనరులు ఏర్పరచుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. భూమిని అమ్మకుండా లీజు ద్వారా ఆదాయం పొందే విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు.


ఏపీకి చక్కటి అవకాశం

ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి చాలావరకు ప్రభుత్వ నిధులపైనే ఆధారపడి ఉంది. సొంత ఆదాయం తక్కువగా ఉండటంతో చిన్నచిన్న అభివృద్ధి పనులకూ సర్కారు వైపు చూడాల్సి వస్తోంది. అయితే గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణ, గ్రామీణ పర్యాటకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ పథకం రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడనుంది. 13వేలకు పైగా గ్రామ పంచాయతీలు, వేల ఎకరాల పంచాయతీ భూములు, సముద్రతీరం, నదులు, చెరువులు, ఆధ్యాత్మిక కేంద్రాలు, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మత్స్య సంపద, పాడిపరిశ్రమ, ఉద్యానవన పంటలు ఉండటంతో దేశంలోనే అత్యధిక ఆదాయ ప్రాజెక్టులను ఏపీలో అభివృద్ధి చేయవచ్చు. ప్రత్యేకించి తిరుపతి, శ్రీకాకుళం, కోనసీమ, అరకు, అల్లూరి, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ స్థాయిలో ప్రాజెక్టులను అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రూర్బన్‌ గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాల డిజిటల్‌ సేవలు, స్వమిత్వ ఆస్తి మ్యాపింగ్‌, స్వర్ణ పంచాయతీ సేవలు, గ్రామీణ పర్యాటకం, వ్యర్థాల నిర్వహణ, హరిత శక్తి తదితరాలు ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తాయి. ఈ వనరులున్న గ్రామాలను నమూనాలుగా అభివృద్ధి చేసి తర్వాత ఇతర పంచాయతీలకు విస్తరించే వ్యూహాన్ని అనుసరిస్తే ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం సూచించిన ఆదాయ మార్గాలు

కమ్యూనిటీ హాళ్లు, గ్రామీణ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ట్రక్‌ టెర్మినళ్లు, పార్కింగ్‌ కేంద్రాలు, డిజిటల్‌ సేవా కేంద్రాలు, మొబైల్‌ టవర్లు, ప్రకటన హోర్డింగ్‌లు, శీతల గిడ్డంగులు, పర్యాటక కేంద్రాలు, మత్స్యకార ప్రాజెక్టులు, రైతు బజార్లు, టమాటా మార్కెట్లు, మిర్చి నిల్వ కేంద్రాలు, పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్లు, పాల ప్రాసెసింగ్‌, పాల శీతలీకరణ కేంద్రాలు, మేత బ్యాంకులు, ఎకో పార్కులు, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌, బయోగ్యాస్‌ ప్లాంట్లు, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు, బయోగ్యాస్‌, చెత్త ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితరాల ద్వారా పంచాయతీలు శాశ్వత ఆదాయం పొందవచ్చని కేంద్రం పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 04:29 AM