Share News

బలపడనున్న అర్నబ్ తుఫాను.. రేపు తీరాన్ని దాటే అవకాశం

ABN , Publish Date - Oct 27 , 2026 | 08:21 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీర రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

బలపడనున్న అర్నబ్ తుఫాను.. రేపు తీరాన్ని దాటే అవకాశం
arnab cyclone intensifying day by day

ఇంటర్నెట్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను బలపడి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తుఫాను అక్టోబర్ 28న ఉదయానికల్లా యానం, ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.


ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యాసంస్థలకు స్థానికంగా సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాకుండా.. స్థానికంగా పనిచేసే అంగన్‌వాడీ కేంద్రాలకు ఒడిశా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు పిల్లల నిరంతర పోషకాహార మద్దతును కొనసాగించేందుకు వీలుగా.. నేరుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తుఫానుకు సంబంధించి అసత్యప్రచారాలు, ఊహాజనిత అంచనాలు, హెచ్చరికలను ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని మీడియా సంస్థలకు ఒడిశా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ యంత్రాంగం, వాతావరణ శాఖ నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని ప్రజలకు సూచించింది.


తుఫాను కారణంగా 53 రైలు సర్వీసులు రద్దు: సౌత్ కోస్ట్ రైల్వే

అర్నబ్ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లో రైళ్ల సేవలను రద్దు చేస్తున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ కోరారు. తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున సమాచార మార్పిడి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం కోసం సౌత్ కోస్ట్ రైల్వే కార్యాలయం, డివిజనల్ కార్యాలయాల్లో 24x7 వార్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 08:59 AM