Share News

కస్సు బుస్సులు!

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:51 AM

బస్సులో సీటు కోసం పోటాపోటీ! కర్చీఫ్‌లు, టవళ్లు వేసి సీటు ‘ఖరారు’ చేసుకోవడం! కిటికీల్లోంచి దూరి మరీ బస్సులోకి వెళ్లడం! ఇవన్నీ ఒకప్పుడు కనిపించిన దృశ్యాలు! ఇప్పుడు మళ్లీ...

కస్సు బుస్సులు!

  • కష్టంగా మారుతున్న ఆర్టీసీ ప్రయాణం.. పెరిగిన ప్రయాణికులు, తగ్గిన బస్సులు

  • రోజుకు 44.66 లక్షల ప్రయాణికులు

  • రెండేళ్లలో 902 బస్సులు తగ్గుదల

  • మూలన పడుతున్న డీజిల్‌ బస్సులు

  • మరమ్మతులతోనే ప్రయాణికులకు సేవలు

  • ఎలక్ట్రిక్‌ బస్సులు వచ్చేదెప్పుడో?

  • బస్టాండ్లలో ప్రజలకు తప్పని పాట్లు

  • ‘స్త్రీ శక్తి’తో వచ్చే సానుకూలతకు చెల్లు

ఆర్టీసీ బస్సుల్లో 2023-24లో రోజుకు సగటున 36.39 లక్షల మంది ప్రయాణించారు. ఇప్పుడు ఆ సంఖ్య 44 లక్షలకు చేరింది. కానీ... రెండేళ్ల క్రితం 10,851 బస్సులుండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 9,949కి తగ్గిపోయింది.

ఆర్టీసీ బస్సుల్లో సగం కాలపరిమితి ముగిసినవే. మరమ్మతులతోనే భారంగా సేవలందిస్తున్నాయి. 2500 విద్యుత్‌ బస్సుల సమీకరణ ప్రణాళిక కార్యరూపం దాల్చడం లేదు. తొలివిడతగా రావాల్సిన 750 బస్సులు ఇంకా రోడ్డెక్కలేదు. అరకొరగా తిరుగుతున్న బస్సులతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): బస్సులో సీటు కోసం పోటాపోటీ! కర్చీఫ్‌లు, టవళ్లు వేసి సీటు ‘ఖరారు’ చేసుకోవడం! కిటికీల్లోంచి దూరి మరీ బస్సులోకి వెళ్లడం! ఇవన్నీ ఒకప్పుడు కనిపించిన దృశ్యాలు! ఇప్పుడు... మళ్లీ అవే కష్టాలు కనిపిస్తున్నాయి. ప్రయాణికులు పెరుగుతున్నా... బస్సుల సంఖ్య పెరగడంలేదు. పైగా... రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ‘స్త్రీ శక్తి’తో మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదే! కానీ... అసలు బస్సులే లేకుంటే ప్రయాణాలు సాఫీగా సాగేదెలా అని అటు పురుషులు, ఇటు మహిళలూ వాపోయే పరిస్థితి నెలకొంది. వెంటనే అదనపు బస్సులు సమకూర్చుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

నానాటికీ నాసిరకం...

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోజుకు 44.66 లక్షల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. కానీ... ఆ బస్సుల్లో సగానికిపైగా కాలపరిమితి ముగిసినవేనని ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి. కొత్తబస్సుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాత బస్సులనే మరమ్మతులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీనివల్ల తరచూ బస్సుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

కొన్ని బస్సులు మరమ్మతుల కోసం డిపోలకు పరిమితం అవుతుండటంతో కొన్ని రూట్లలో అరకొరగా బస్సులు తిప్పాల్సి వస్తోంది. ముఖ్యంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో రద్దీ అధికంగా ఉంటోంది. కొన్ని బస్టాపుల్లో బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారు. దీంతో డ్రైవర్లతో ప్రయాణికులు వాగ్వాదాలు, ఘర్షణలకు దిగుతున్నారు.


విద్యుత్‌ బస్సులు ఎక్కడ?

డీజిల్‌ బస్సులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రజా రవాణాలో విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 750, రెండో విడతలో మరో 1450, తిరుమల కోసం ప్రత్యేకంగా 300 కలిపి మొత్తం 2500 విద్యుత్‌ బస్సులను అందుబాటులోకి తేవాలని ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-బస్‌ సేవా పథకం కింద 11 నగరాల్లో తొలి విడత 750 బస్సులు నడపాలని నిర్ణయించారు. వీటి సరఫరా బాధ్యతను పుణెకు చెందిన సంస్థ దక్కించుకుంది. అయితే బస్సుల సరఫరా, డిపోల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యంతో ప్రణాళిక ముందుకు సాగడం లేదు.

జూలై నాటికి పూర్తికావాల్సిన ప్రక్రియ నవంబరు వచ్చినా కొలిక్కి రాలేదు. రెండో విడతలో వచ్చే 1450 బస్సులకు 29 డిపోల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంది. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటూ జాప్యమే. విద్యుత్‌ బస్సుల నిర్వహణకు డిపోల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరం. చార్జింగ్‌ కేంద్రాలు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, పవర్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది.

సింహాచలం, గాజువాకతో పాటు విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఈ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సుమారు రూ.90 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, కేంద్రం రూ.79.98 కోట్లను ఆమోదించింది. టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. జూలైలో విశాఖలోని సింహాచలం డిపోలో విద్యుత్‌ పవర్‌ రూమ్‌ను రవాణా శాఖ మంత్రి ప్రారంభించారు. అయినప్పటికీ అన్ని డిపోల్లోనూ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో బస్సుల ప్రవేశం ఆలస్యమవుతోంది. ప్రైవేటుకు అప్పగింతపై సంఘాల అభ్యంతరం నిర్వహణ విధానంపై వివాదం విద్యుత్‌ బస్సుల ప్రవేశానికి మరో అడ్డంకిగా మారింది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌(జీసీసీ) విధానంలో ప్రైవేటు సంస్థల ద్వారా బస్సులను సమకూర్చుకుని నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది.


ఈ మేరకు 9 మీటర్లు, 12 మీటర్ల పొడవున్న ఏసీ విద్యుత్‌ బస్సుల సరఫరా, నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యుత్‌ బస్సుల ప్రవేశానికి తాము వ్యతిరేకం కాదని, వాటిని ప్రైవేట్‌ సంస్థల ద్వారా కాకుండా ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసి నడపాలని డిమాండ్‌ చేస్తోంది. దీనికి ప్రభుత్వం నిధులు సమకూర్చాలని పేర్కొంటోంది.

అయితే, విద్యుత్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణకు భారీగా పెట్టుబడి అవసరమని, జీసీసీ విధానంతో ఆ భారం ప్రభుత్వంపై పడకుండా చూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్యాటరీల నిర్వహణ, సాంకేతిక బాధ్యతలను ప్రైవేట్‌ ఆపరేటర్లకు అప్పగిస్తే నిర్వహణ సులభమవుతుందని చెబుతున్నారు. కేంద్ర పథకాల కింద లభించే ప్రోత్సాహకాలను వినియోగించుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఉద్యోగ సంఘాలు మాత్రం ఆర్టీసీ సొంతంగానే కొనాలని, పాత బస్సులకు మరమ్మతులు, రిట్రోఫిటింగ్‌ పనులు చేపట్టాలని కోరుతున్నాయి. దీంతో విద్యుత్‌ బస్సుల రాకకంటే వాటి నిర్వహణ అంశమే ప్రధాన వివాదంగా మారింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్‌ బస్సు సేవలు విస్తరిస్తామని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.


గణాంకాలే చెబుతున్నాయి..

ఆర్టీసీ బస్సుల్లో 2023-24లో రోజుకు సగటున 36.39 లక్షల మంది ప్రయాణించారు. ఆ సంఖ్య 2024-25లో స్వల్పంగా తగ్గి 36.33 లక్షలుగా నమోదైంది. 2025-26లో ఆ సంఖ్య ఏకంగా 42.03 లక్షలకు చేరింది. రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సుల్లో ఆక్యుపెన్సీ నిష్పత్తి కూడా 2025-26లో 77.19 శాతం ఉండగా, 2026 సెప్టెంబరుకు 84.83 శాతానికి చేరింది. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెరగడం లేదు. 2023-24లో ఆర్టీసీలో 10,851 బస్సులుండగా, 2026 అక్టోబరు నాటికి వాటి సంఖ్య 9,949కి తగ్గిపోయింది. బస్సుల సంఖ్య తగ్గటంతో రద్దీ మార్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 04:03 AM