Share News

మార్కులు మార్చేశారు!

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:35 AM

వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తేల్చింది. నచ్చిన వారికి నచ్చినట్టుగా మార్కులు వేసుకున్నారని.. 97.55 శాతం పేపర్లలో అనధికారికంగా దిద్దుబాట్లు (కరెక్షన్స్‌) చేశారని పేర్కొంది.

మార్కులు మార్చేశారు!

  • గ్రూప్‌-1 మెయిన్స్‌ 3 సార్లు మూల్యాంకనం

  • పీఎస్ఆర్‌ నేతృత్వంలో హాయ్‌ల్యాండ్‌కు పత్రాలు

  • మెయిన్స్‌ అభ్యర్థులకు పొంతనలేని మార్కులు

  • 97.55 శాతం పేపర్లలో అనధికార దిద్దుబాట్లు

  • డిజిటల్‌ నుంచి మాన్యువల్‌ వరకు అక్రమాలు

  • ఎగ్జామినర్‌ సంతకాలు లేకుండానే సవరణలు

  • 154 ఓఎంఆర్‌ స్లిప్పులపై వైట్‌నర్‌ వినియోగం

  • హైకోర్టుకు తుది నివేదిక సమర్పించిన సిట్‌

ఒకే పేపర్‌ను మూడు సార్లు దిద్దారు. ప్రతిసారీ నచ్చినట్లుగా మార్కులు వేసుకున్నారు. డిజిటల్‌ మూల్యాంకనం, హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనం, మాన్యువల్‌ మూల్యాంకనం అంటూ అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారు. చివరికి జగన్‌ హయాంలో జరిగిన గ్రూప్‌-1ను అస్తవ్యస్తం చేసి అక్రమాల పుట్టగా మార్చారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసిన సిట్‌.. తాజాగా తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది.


అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) తేల్చింది. నచ్చిన వారికి నచ్చినట్టుగా మార్కులు వేసుకున్నారని.. 97.55 శాతం పేపర్లలో అనధికారికంగా దిద్దుబాట్లు (కరెక్షన్స్‌) చేశారని పేర్కొంది. మెయిన్స్‌ సమాధాన పత్రాలను మూడు సార్లు మూల్యాంకనం చేశారని, ప్రతి దశలోనూ అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్‌ తాజాగా తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో మూడు మూల్యాంకనాల్లో వచ్చిన మార్కులను సవివరంగా వివరించింది. ఇప్పటివరకూ అసలు హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనమే జరగలేదని వాదిస్తున్న వైసీపీ వర్గాలు, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్‌ ఆంజనేయులుకు షాక్‌ ఇచ్చేలా హాయ్‌ల్యాండ్‌ మార్కులను ఎలా వేశారో... ఎవరెవరు ఈ మూల్యాంకనంలో పాల్గొన్నారో కూడా నివేదికలో పూసగుచ్చినట్టు సిట్‌ అధికారులు వివరించారు.

మూడుసార్లు మూడు రకాలు

ఇంటర్వ్యూలకు ఎంపికైన 326 మంది అభ్యర్థులకు మూడు మూల్యాంకనాల్లో వచ్చిన మార్కులను నివేదికలో సిట్‌ పేర్కొంది. కొన్ని ఉదాహరణలు..

1) ఓ అభ్యర్థికి మొదట డిజిటల్‌ మూల్యాంకనంలో 530 మార్కులు వస్తే, హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంలో 519 మార్కులు వేశారు. తుది మాన్యువల్‌ మూల్యాంకనంలో 480.5 మార్కులు వచ్చాయి.

2) మరో అభ్యర్థికి మొదట 495.5 మార్కులు, రెండోసారి 480 మార్కులు, మూడోసారి 462 మార్కులు వచ్చాయి.

3) ఇంకో అభ్యర్థికి మొదటి మూల్యాంకనంలో 508 మార్కులు, రెండోసారి 483.5 మార్కులు, తుది మూల్యాంకనంలో 429 మార్కులు వచ్చాయి.

4) మొత్తం ఇంటర్వ్యూలకు ఎంపికైన 326 మందికి ప్రతి మూల్యాంకనంలోనూ మార్కులు మారిపోయాయి. వీటిలో చాలాచోట్ల మొదటి మూల్యాంకనం, హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనం మార్కులు స్వల్ప వ్యత్యాసంతో వేశారు. మొదట జరిగిన డిజిటల్‌ మూల్యాంకనం మార్కులనే హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంలో ప్రతిబింబించేలా చేయడానికి ప్రయత్నించినట్లు సిట్‌ పేర్కొంది. కానీ, తుది మూల్యాంకనంలో మాత్రం మొదటి.. రెండు మూల్యాంకనాలకు చాలా ఎక్కువ వ్యత్యాసంగా మార్కులు వచ్చాయి.


తలరాతే కాదు.. చేతిరాతనూ మార్చేశారు!

మూడుసారి చేసిన మాన్యువల్‌ మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగాయని సిట్‌ వివరించింది. విజయవాడలో జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనం ఆధారంగానే గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇచ్చారని తెలిపింది. ఆ తుది మూల్యాంకనంపైనా అనేక అనుమాలను వ్యక్తం చేసింది. సమాధానపత్రాల్లో అనేక మార్కులు చేసినట్లు స్పష్టంచేసింది. అవేంటంటే..

1) అసలు ఓఎంఆర్‌ స్లిప్పులను హాయ్‌ల్యాండ్‌లో వాడేయడంతో తుది మూల్యాంకనం కోసం మరోసారి వీటిని ప్రింట్‌ చేయించారు.

2) వాటిలో 736 పత్రాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా 97.55 శాతం మేరకు మార్పులు చేసినట్లు సిట్‌ గుర్తించింది.

3) 29 పత్రాల్లో ఎగ్జామినర్‌ సంతకాలు లేకుండానే సవరణలు చేశారు.

4) కొన్ని పత్రాల్లో మార్పులకు ఏపీపీఎస్సీ ఇచ్చిన పెన్నులు కాకుండా వేరే ఇంకు పెన్నులు వినియోగించారు.

5) చీఫ్‌ ఎగ్జామినర్లకు సవరణలు చేసే అధికారం లేకపోయినా కొన్ని పత్రాల్లో నేరుగా వారితోనే మార్పులు చేయించారు.

6) సంతకాలతో పాటు కొన్ని పత్రాల్లో అభ్యర్థుల చేతిరాత కూడా మారిపోయింది.

డేటా ఎంట్రీ ఆపరేటర్లతో..

హాయ్‌ల్యాండ్‌లో చేసిన మూల్యాంకనంలో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారని సిట్‌ పేర్కొంది. పేపర్లు దిద్దడానికి ఎగ్జామినర్లను కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి డిజిటల్‌ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను యథావిధిగా నమోదు చేయాలని ఆదేశించారు. హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనంలో కీలకంగా వ్యవహరించిన ఫ్రీలాన్సర్‌ మహంకాళి రఘురామ్‌ డిజిటల్‌ మూల్యాంకనం మార్కుల వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇచ్చారు. అయితే, వాస్తవంగా డిజిటల్‌ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు, రఘురామ్‌ ఇచ్చిన మార్కులు సరిపోలలేదు. ఒకేలా ఉంటే అనుమానాలు వస్తాయనే ఉద్దేశంతోనే స్వల్ప మార్పులతో మార్కులను డేటాఎంట్రీ ఆపరేట్లకు ఇచ్చి ఉండొచ్చుని సిట్‌ పేర్కొంది. హాయ్‌ల్యాండ్‌లో 84 రోజుల పాటు సమాధాన పత్రాలను ఉంచారు. 154 ఓఎంఆర్‌ స్లిప్పులపై వైట్‌నర్‌ వాడారు.


ఈ వార్తలనూ చదవండి:

స్థానిక పోరుకు సన్నద్ధం..!

రెన్యువల్‌ అయ్యేలా చర్యలు చేపట్టండి

Updated Date - Sep 10 , 2026 | 04:36 AM