Share News

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన కుంభకోణంపై ఈడీ ప్రకటన

ABN , Publish Date - Nov 05 , 2026 | 09:17 PM

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన కుంభకోణంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన కుంభకోణంపై ఈడీ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన కుంభకోణంపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏడు ప్రాంతాల్లో సోదాలు చేసినట్టు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17 కింద నవంబర్ 4న హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు గుంటూరు జిల్లాలో తనిఖీలు చేపట్టినట్టు వెల్లడించింది. ఈ క్రమంలో గ్రూప్-1 ఆన్సర్ షీట్ల మాన్యువల్ మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. మాన్యువల్ మూల్యాంకనం పేరుతో ప్రైవేట్ సంస్థకు రూ.1.14 కోట్లకు పైగా చెల్లింపులు జరిపినట్లు పసిగట్టింది. కాగా 2021 నవంబర్ 27 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు ఈ మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించినట్లు రికార్డుల్లో ఉందని, గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌కు ఆన్సర్ షీట్లను తరలించారని ఈడీ వెల్లడించింది.


84 రోజుల పాటు రిసార్ట్స్‌లోనే ఆన్సర్ షీట్లు ఉంచినట్లు పేర్కొంది. మూల్యాంకనం పేరుతో చెల్లించిన రూ.1.14 కోట్ల మొత్తాన్ని నేర ఆదాయంగా నిర్ధారించింది. కాగా అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఐపీఎస్ అధికారి పి.సీతారామాంజనేయులు నివాసంలో, మాన్యువల్ మూల్యాంకన బాధ్యతలు తీసుకున్న క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఇతర రికార్డుల స్వాధీనం చేసుకుంది. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు నిందితుల వాంగ్మూలాలు తీసుకుంది. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 05 , 2026 | 09:24 PM