అమరావతిలో మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:07 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, అన్వేషణ, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మైనింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఖనిజ వనరుల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
అమరావతి, నవంబరు 20: రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు కొత్త ఖనిజ నిక్షేపాల గుర్తింపు, అన్వేషణ, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. మైనింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ఖనిజ వనరుల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ని అత్యున్నత స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఖనిజ వనరులను కేవలం ప్రభుత్వ ఆదాయానికి పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తులుగా మార్చాలని సూచించారు. ఏపీఎండీసీ పరిధిలోని ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా, సంస్థ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా లెక్కించారు. ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేసేందుకు వచ్చే ఏడాది డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకుని ఐపీఓ ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అలాగే లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఖనిజాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వీటి కోసం విదేశాల్లో మైనింగ్ ఆస్తుల కొనుగోలుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APREDC) ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో ఖనిజ అన్వేషణను మరింత వేగవంతం చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 74,860 చదరపు కిలోమీటర్ల పరిధిలో 582 మినరల్ పొటెన్షియల్ ఏరియాలను గుర్తించినట్లు అధికారులు వివరించారు. వీటిని 209 క్లస్టర్లుగా విభజించినట్లు వెల్లడించారు. ఖనిజ అన్వేషణ.. వేలం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఐదేళ్ల రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
మరోవైపు.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతర బొగ్గు సరఫరా కోసం ఒడిశా, జార్ఖండ్‌లోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటోంది. ఈ మూడు బ్లాకుల్లో కలిపి 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. అలాగే పెండింగ్‌లో ఉన్న 6,500 క్వారీ లీజు దరఖాస్తులు, 223 రెన్యువల్స్ పరిష్కారానికి గడువు పొడిగించే ప్రతిపాదనను అధికారులు సమీక్షకు తీసుకువచ్చారు. ఈ దరఖాస్తులు, రెన్యువల్స్ పరిష్కారమైతే ప్రభుత్వానికి సుమారు రూ.400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఖనిజ సంపదను ఆర్థికాభివృద్ధికి కీలక వనరుగా మార్చడంతో పాటు మైనింగ్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
ఇవి కూడా చదవండి..
గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..