జల సంక్షోభం!
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:46 AM
ఎల్‌నినో రఉగ్రరూపం దాలుస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. జలాశయాల్లో నిల్వలు అడుగంటుతున్నాయి. సెప్టెంబరులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వచ్చే జనవరి నాటికి తాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని జల వనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం
నైరుతి సీజన్‌లో 50 శాతం లోటు నమోదు
డ్యాముల్లో సగానికి పడిపోయిన నిల్వలు
చిన్నతరహా నీటి వనరుల్లో 44.6 టీఎంసీలే
11.24 మీ. లోతుకు చేరిన భూగర్భ జలాలు
నైరుతి నిష్క్రమణ ప్రారంభం.. దేశంలో 15 శాతం లోటు
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో రఉగ్రరూపం దాలుస్తోంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొంది. జలాశయాల్లో నిల్వలు అడుగంటుతున్నాయి. సెప్టెంబరులోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వచ్చే జనవరి నాటికి తాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని జల వనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ జల వనరుల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెల 19 (శనివారం) నాటికి పరిస్థితులు ఇలా ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో సహా 113 జలాశయాల్లో 555.32 టీఎంసీల (50.44శాతం) నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇక చెరువులు, ఎత్తిపోతలు, నీటి కుంటలు వంటి 38,625 చిన్న తరహా నీటి వనరుల్లో కేవలం 44.6 టీఎంసీల (21.63శాతం) జలాలు మిగిలాయి. భూగర్భ జలాలు 11.24 మీటర్ల లోతుకు పడిపోయాయి. నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 511.02 మిల్లీమీటర్లు కాగా ఈసారి 256.19 మిల్లీమీటర్లు (49.87శాతం తక్కువ) మాత్రమే పడింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ లోటు నమోదైంది. కోస్తాంధ్రలో 43.63 శాతం, రాయలసీమలో 55.09 శాతం చొప్పున లోటు నెలకొంది. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 70.22 శాతం తక్కువ వర్షం కురిసింది. సత్యసాయి (64.37శాతం), ప్రకాశం (61.70శాతం), తూర్పుగోదావరి (57.34శాతం) జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా గుంటూరులో 29.46 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
జలాశయాలు వెలవెల
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు ఆందోళనకరంగా మారాయి. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 104.14 టీఎంసీలు (48.26శాతం) మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, రాయలసీమ కోసం 12,570 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీలకు గాను 178 (57శాతం) టీఎంసీల నిల్వ ఉంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వస్తున్న 7,456 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను మొత్తం కిందకు వదిలేస్తున్నారు. పులిచింతలలో 45.77 టీఎంసీలకు గాను 27.49 (60శాతం) టీఎంసీల నిల్వ ఉంది. పులిచింతల నుంచి 400 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలకు గాను 3.046 టీఎంసీల ( 99శాతం) నిల్వ నమోదైంది.
రేపటినుంచి 27 వరకూ శ్రీశైలానికి వరద
శ్రీశైలం జలాశయానికి ఈ నెల 21 నుంచి 27 వరకూ ఎగువ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో తాగునీటికి ఇబ్బంది ఉండదని జల వనరుల శాఖ భావిస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలపై చర్చించడానికి కేఆర్‌ఎంబీ అక్టోబరు 1న సమావేశం కానుంది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణకు చెందిన జల వనరుల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, సలహాదారులు పాల్గొని నీటి అవసరాలపై తమ లెక్కలను సమర్పించనున్నారు. నీటి వాటాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 66 శాతం వాటాకే కట్టుబడి ఉన్నామని, తెలంగాణ చెబుతున్నట్లుగా చెరి సగం వాటాకు అంగీకరించేది లేదని ఏపీ స్పష్టం చేస్తోంది.
ఈ వార్తలనూ చదవండి...
కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిధి పెంపు