Share News

నేడే ఎంపీపీల ఎన్నిక

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:03 AM

రాష్ట్రంలో కొత్త మండలాధ్యక్షులు కొలువుదీరనున్నారు. గురువారం 659 మండలాకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. మండలాధ్యక్షులు...

నేడే ఎంపీపీల ఎన్నిక

  • 659 మండలాలకు కొత్త అధ్యక్షులు

  • తొలుత కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

  • మధ్యాహ్నం ఎంపీటీసీల ప్రమాణం

  • 3 గంటల నుంచి ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ

  • వెంటనే మండల ప్రజా పరిషత్‌ పాలన

  • రేపు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

  • ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా వెల్లడి

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త మండలాధ్యక్షులు కొలువుదీరనున్నారు. గురువారం 659 మండలాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరగనున్నాయి. మండలాధ్యక్షులు, మండల ఉపాధ్యక్షుల ఎన్నికలకు ఎస్‌ఈసీ 10వ తేదీనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. గురువారాన్ని (2026 నవంబరు 19) మండల ప్రజా పరిషత్‌ల తొలి సమావేశ తేదీగా ఎస్‌ఈసీ ఖరారు చేసింది. సమావేశంలో భాగంగా తొలుత మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తారు. శుక్రవారాన్ని (2026 నవంబరు 20) జిల్లా ప్రజాపరిషత్‌ల తొలి సమావేశ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఈ తేదీల నుంచే సంబంధిత మండల, జిల్లా పరిషత్‌ల ప్రజాప్రతినిధుల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే మండలాధ్యక్షులు, జిల్లా చైర్‌పర్సన్ల ఎన్నిక జరిగి, జిల్లా ప్రజా పరిషత్‌, మండల ప్రజాపరిషత్‌ తొలి సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు.


ఇదీ షెడ్యూల్‌

  • గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుల నామినేషన్ల స్వీకరణ. 12 గంటల వరకూ స్క్రూటినీ. ఒంటి గంట వరకూ నామినేషన్ల ఉపసంహరణ.

  • కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం ఉంటుంది.

  • మూడు గంటలకు మండల ప్రజాపరిషత్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారు.

  • మండలాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వారిలో ఎవరికి ఎక్కువ మంది ఎంపీటీసీలు మద్దతుగా చేతులెత్తుతారో వారు ఎన్నికైనట్టుగా నిర్ణయిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 04:13 AM