Share News

ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టండి

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:57 AM

కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ‘సర్‌’పై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టండి

  • జిల్లా అధికారులకు సీఈవో వివేక్‌ యాదవ్‌ ఆదేశం

  • ఓటర్ల ఇళ్ల వద్దకే బీఎల్‌వోలు

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ‘సర్‌’పై గురువారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు ఎన్నికల సంఘం పలు వెసులుబాట్లు కల్పించినట్లు సీఈవో తెలిపారు. సర్‌ నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని, బీఎల్‌వోలే ఇళ్లకు వచ్చి అవసరమైన పత్రాలు సేకరించి ఈఆర్‌వో నెట్‌లో అప్‌లోడ్‌ చేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈఆర్‌వో నిర్ణయం మేరకు విచారణ నిర్వహిస్తారన్నారు.

సాధ్యమైనంత వరకు విచారణను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని ఈసీ సూచించిందన్నారు. అక్టోబరు 1వ తేదీ నాటికి 209 నోటీసులు విచారణ కోసం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నోటీసుల విచారణకు అవసరమైతే ఓటరు తరపున ఆ కుటుంబ సభ్యుడికి అవకాశం కల్పించవచ్చన్నారు. కార్మికులు, నిరుపేదలు, నిరాశ్రయులు తదితర అర్హులైన ఓటర్ల కోసం జిల్లా ఎన్నికల అధికారులు అవసరమైన సంఖ్యలో హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. సర్‌లో కానీ, ఆ తర్వాత ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, యువత, తొలిసారి ఓటు హక్కు పొందేవారు నిరంతర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సీఈవో ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:57 AM