Share News

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల తుది జాబితా విడుదల

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం మరింత ఆసక్తికరంగా మారింది. పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల తుది జాబితా విడుదల
AP Panchayat Elections

విజయవాడ, నవంబరు 29: ఆంధ్రప్రదేశ్‌లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో ఎన్నికలకు సంబంధించిన తుది గణాంకాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 జిల్లాలు, 46 రెవెన్యూ డివిజన్లు, 214 మండలాల పరిధిలో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం, తిరుపతి జిల్లాల్లో ఈ విడత ఎన్నికలు నిర్వహించడం లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. మూడో విడతలో మొత్తం 4,244 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 932 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఐదు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3,307 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 9,336 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సర్పంచ్ స్థానాల ఏకగ్రీవాల్లో 172 స్థానాలతో వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండగా, పల్నాడు 144, అనంతపురం 90, మార్కాపురం 51 స్థానాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


వార్డు స్థానాల్లోనూ హోరాహోరీ పోరు.. 57 వేల మందికి పైగా అభ్యర్థులు

మరోవైపు.. మూడో విడతలో 42,712 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. 16,125 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 89 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 26,498 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 57,639 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వార్డు సభ్యుల ఏకగ్రీవాల్లో 1,798 స్థానాలతో పల్నాడు జిల్లా అగ్రస్థానంలో ఉండగా, వైఎస్సార్ కడప 1,770, శ్రీకాకుళం 1,214, అనంతపురం 1,113 స్థానాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పోలింగ్ జరిగే సర్పంచ్ స్థానాల్లో 275 స్థానాలతో శ్రీకాకుళం జిల్లా ముందంజలో ఉండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకపోవడంతో మొత్తం 91 స్థానాలకు పోటీ నెలకొంది. వార్డు స్థానాల్లో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 1,992 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, విజయనగరం జిల్లాలో 1,927, శ్రీకాకుళం జిల్లాలో 1,848 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.


ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 12:48 PM