Share News

రౌడీలు, అరాచక శక్తులతో శాంతియుత ధర్నా!

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:20 AM

డీఎస్సీ అక్రమాలపై విజయవాడ ‘శాప్‌’ కార్యాలయం వద్ద జరుపుతున్న శాంతియుత భారీ ధర్నాపై ఖాకీలు తోడుగా టీడీపీ గూండాలు దాడి చేసినట్టు జగన్‌ సొంత పత్రిక సెలవిచ్చింది. అయితే, ‘శాంతియుతం’గా జరిగిన ధర్నాలో పాల్గొన్నవారి వివరాలను పోలీసులు మంగళవారం ప్రకటించారు.

రౌడీలు, అరాచక శక్తులతో శాంతియుత ధర్నా!

  • గురువులపై గూండాగిరీని దాచిపెట్టి... శాంతియుత ధర్నాపై దాడి చేశారంటూ రోత రాతలు

  • ‘ధర్నా’లో 45 మంది షీటర్లను గుర్తించిన పోలీసులు

  • డీఎస్సీ స్పోర్ట్స్‌ టీచర్లు లక్ష్యంగా రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు, వాటర్‌ బాటిల్స్‌తో దాడి వీరి పనే

  • 26 మందిపై కేసులు..15 మంది రౌడీషీటర్ల అరెస్టు..

  • మొత్తం 260 మంది దాడిలో పాల్గొన్నట్టు గుర్తింపు

  • నాడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలనే విజయవాడకూ తరలించినట్టు నిర్ధారణ

  • వారి కోసం వేట ముమ్మరం చేసిన ప్రత్యేక బృందాలు

  • ఎఫ్‌ఆర్‌సీ ద్వారా నిందితుల్ని గుర్తించే ప్రయత్నాలు

విజయవాడ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ అక్రమాలపై విజయవాడ ‘శాప్‌’ కార్యాలయం వద్ద జరుపుతున్న శాంతియుత భారీ ధర్నాపై ఖాకీలు తోడుగా టీడీపీ గూండాలు దాడి చేసినట్టు జగన్‌ సొంత పత్రిక సెలవిచ్చింది. అయితే, ‘శాంతియుతం’గా జరిగిన ధర్నాలో పాల్గొన్నవారి వివరాలను పోలీసులు మంగళవారం ప్రకటించారు. పోలీసులు విడుదల చేసిన జాబితా ప్రకారమే, 260 మంది పాల్గొన్న వైసీపీ ధర్నాలో 45 మంది రౌడీషీటర్లే ఉన్నారు. ఇంకా..46 మంది ట్రబుల్‌ మాంగర్స్‌, 71 మంది అల్లర్లు సృష్టించే వ్యక్తులు, తొమ్మిది మంది లా అండ్‌ ఆర్డర్‌ సస్పెక్ట్‌ షీటర్లు, ఏడుగురు క్రైమ్‌ సస్పెక్ట్‌ షీటర్లు, 76 మంది వివాదాల్లో పాల్గొనేవారు అక్కడ కనిపించినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో 91 మందిపై పలు పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్‌ కేసులున్నాయి. రౌడీషీటర్లలో గుర్తించిన 26 మందిలో 15 మందిని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని రెండు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడలో గురువులపై గూండాగిరీ వీరి పనేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ‘శాప్‌’ కార్యాలయం ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, బందరు రోడ్డు ప్రాంతాలను సోమవారం వైసీపీ రణరంగంగా మార్చిన విషయం తెలిసిందే.


తమపై వైసీపీ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలంటూ శాప్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా టీచర్లపై కర్రలు, నీళ్ల సీసాలతో ఉపాధ్యాయులపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. రౌడీలు, సస్పెక్ట్‌ షీటర్లు, మాజీ షీటర్లు... పోలీసులను సైతం తోసుకుని, బారికేడ్లను దాటుకుని మరీ దాడులకు దిగారు. ఈ దాడులకు తెగబడినవారిని మంగళవారం పోలీసులు ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాల(ఎఫ్ఆర్‌సీ) ద్వారా గుర్తించారు. విజయవాడ మాచవరం పోలీసులు క్రైం నంబరు 295/2026, 296/2026తో రెండు కేసులు నమోదు చేశారు.

దాడిలో...: వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ మేయర్‌లు, డిప్యూటీ మాజీ మేయర్‌లు, పది మంది మాజీ కార్పొరేటర్‌లు, 35 మంది ఆ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, పది మంది పార్టీ కార్యదర్శులు, ఐదుగురు అధికార ప్రతినిధులు, 114 మంది స్థానిక నాయకులు, 59 మంది గుర్తు తెలియని వ్యక్తులు టీచర్లపై దాడి ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.

రెండు జిల్లాల నుంచి వచ్చిన రౌడీ షీటర్లు

శాప్‌ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన రౌడీ, సస్పెక్ట్‌ షీటర్లు పాల్గొన్నారు. ఒక్కొక్కరిపై సుమారుగా 12 కేసులు వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్నాయి. తెనాలికి చెందిన రౌడీషీటర్‌ గుద్దేటి సురేంద్రపై 12 కేసులు ఉన్నాయి. నగరపాలేనికి చెందిన రమేశ్‌, బొల్లెదుల వెంకటేశ్వర్లు, పట్టాభిపురానికి చెందిన ఇచ్చంపాటి వెంకటకృష్ణ, అరండల్‌పేటకు చెందిన చల్లా వెంకట కోటేశ్వరరావు, పటమట రౌడీషీటర్‌ ఖండవల్లి ఆదిశేషు, బోని రవి (అజిత్‌సింగ్‌ నగర్‌), గరికే వెంకటేశ్వరరావు, పులిపాటి కృష్ణారెడ్డి(రాణిగారితోట) బెజవాడ రాజశేఖర్‌(నందిగామ) ఆందోళనలో పాల్గొన్నారు.


మాజీ సస్పెక్ట్‌ షీటర్‌ గెల్లిపోగు రాజు దాడిలో ముఖ్య పాత్ర పోషించాడు. మద్దకూరి సాయిబాబుపై నందిగామలో నాలుగు రాజకీయ పరమైన కేసులు ఉన్నాయి. క్రైం సస్పెక్ట్‌ షీటర్లు ఉష్టుల రామయ్య, గరికే వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులపై దాడి చేశారు. ప్రతి చిన్న విషయానికీ గొడవలు సృష్టించే స్వభావం కలిగిన జాబితాలో పది మందిని పోలీసులు గుర్తించారు. వారిలో వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్‌పై మాచవరంలో 13, అవుతు శ్రీనివాసరెడ్డిపై అజిత్‌సింగ్‌ నగర్‌లో 12, మొండితోక జగన్మోహనరావుపై నందిగామలో 11, భీమిరెడ్డి శివవెంకట జానారెడ్డిపై ఎనిమిది, మొండితోక అరుణ్‌కుమార్‌పై పటమటలో ఏడు, ఎండీ రుహుల్లాపై అజిత్‌సింగ్‌ నగర్‌లో ఏడు, షేక్‌ ఆసిఫ్‌పై కొత్తపేటలో ఐదు, కావటి దామోదర్‌పై పటమటలో ఐదు, కేడీసీసీబీ మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావుపై జగ్గయ్యపేటలో నాలుగు, మద్దుకూరి సాయిబాబుపై నందిగామలో నాలుగు కేసులు ఉన్నాయి.

రౌడీషీటర్లు మోర్త శ్రీనివాస్‌పై కంచికచర్ల పోలీసు స్టేషన్‌లో 15 కేసులు, వేమ సురేశ్‌బాబుపై 14 కేసులు ఉన్నాయి. గుద్దేటి సురేంద్రపై తెనాలిలో 12, బెజవాడ రాజశేఖర్‌పై నందిగామలో ఏడు, వేల్పుల రమేశ్‌పై కంచికచర్లలో మూడు, అరవ సత్యంపై మాచవరంలో ఒకటి, కురిటి శివపై సత్యనారాయణపురంలో ఒక కేసు ఉన్నాయి. కొత్తపేటకు చెందిన బంకా శివపై రౌడీషీట్‌ ఉంది. మాజీ రౌడీషీటర్‌ పూనూరు గౌతమ్‌రెడ్డిపై సత్యనారాయణపురంలో 43 కేసులున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన 17 మంది నిందితులు ఈ దాడిలో పాల్గొనడం గమనార్హం.

ముగ్గురి అరెస్టు...: క్రైం నంబరు 295/2026తో నమోదైన కేసులో మాచవరం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడ అయోధ్యనగర్‌కు చెందిన గుండే సుందర్‌పాల్‌, అజిత్‌సింగ్‌ నగర్‌ లూనా సెంటర్‌కు చెందిన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆకారపు రవిచంద్ర, గుంటూరుకు చెందిన గద్దేటి సురేంద్రను అరెస్టు చేశారు. వారిని ఏడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం రాత్రి హాజరుపరిచారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 04:20 AM