పట్టణ వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు షెడ్యూల్
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:03 AM
రాష్ట్రంలోని 41 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ఈనెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు.
41 చోట్ల రేపటి నుంచి 25 వరకు ఇంటింటి సర్వే
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు
26న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన
అభ్యంతరాలు, క్లెయిములకు రెండ్రోజుల సమయం
అక్టోబరు 1న తుది ఓటర్ల జాబితా సమర్పణ
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 41 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల రిజర్వేషన్ల ఖరారు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గుర్తింపునకు ఈనెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఎన్నికల రోల్‌ను వార్డు, పోలింగ్ స్టేషన్ వారీగా విభజించి ఓటర్లను గుర్తిస్తారు. ఎస్టీ ఓటర్లను ఆకుపచ్చ, ఎస్సీ ఓటర్లను ఎరుపు బాల్‌పాయింట్ పెన్‌తో గుర్తించడంతో పాటు మహిళా ఓటర్లను, బీసీ ఓటర్లను నల్ల బాల్ పాయింట్ పెన్‌తో గుర్తించనున్నారు. గుర్తించిన ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్లతో పాటు బీసీ ఓటర్ల ముసాయిదా ఓటర్ల జాబితాలను 26న మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. 27, 28 తేదీల్లో అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. క్లెయిమ్ ఫారం-2లో, అభ్యంతరాలు ఫారం-3లో దాఖలు చేయాలి. క్లెయిమ్‌ల జాబితాను నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు.
అభ్యంతరాలపై సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీచేస్తారు. 29, 30 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై విచారణ నిర్వహించి ముసాయిదా జాబితాలను సవరిస్తారు. అనంతరం అక్టోబరు 1న ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల తుది వార్డు వారీ జాబితాలను ఫారం-6లో ప్రచురించి, మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు సమర్పిస్తారు. బీసీ ఓటర్ల జాబితాకూ అదే షెడ్యూల్ వర్తిస్తుంది. మొత్తం ప్రక్రియను 9 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో అమలు కానుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం ప్రాంతాల పరిధిలోని పట్టణ స్థానికసంస్థలు ఇందులో ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి....
‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’
ఆర్‌వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక