Share News

ప్రతి ప్రాజెక్టుకూ 6 నెలల గడువు!

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:57 AM

పెట్టుబడులకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టులు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకూ 6 నెలల గడువు విధించాలని, నిర్ణీత వ్యవధిలోగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.

 ప్రతి ప్రాజెక్టుకూ 6 నెలల గడువు!

  • ప్రతి ప్రాజెక్టుకూ 6 నెలల గడువు!

  • నిర్ణీత వ్యవధిలోగా పనులు ప్రారంభం కావాలి: సీఎం చంద్రబాబు

  • సచివాలయంలో ఎస్‌ఐపీబీ సమావేశం

  • మరో 22,251 కోట్ల పెట్టుబడులకు ఓకే

  • వాటితో 19,989 మందికి ఉద్యోగావకాశాలు

  • రాష్ట్రంలో పోర్టు ఇన్‌ఫ్రా ఎకోసిస్టమ్‌

  • హార్డ్‌వేర్‌ తయారీ హబ్‌ ఏర్పాటుపై దృష్టి

  • 50 రోజుల్లో విశాఖ భాగస్వామ్య సదస్సు

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులకు ఆమోదం తెలిపిన తర్వాత ప్రాజెక్టులు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకూ 6 నెలల గడువు విధించాలని, నిర్ణీత వ్యవధిలోగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి మరో రూ.22,251.22 కోట్ల పెట్టుబడులు వచ్చే 28 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 19,989 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశాఖకు సెమీకండక్టర్లు, చిప్‌ తయారీ, రోబోటిక్స్‌ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లలో పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కేవలం ఎలకా్ట్రనిక్స్‌ తయారీతో ఆగకుండా పరిశోధన, డిజైన్ల రూపకల్పన, మాన్యుఫాక్చరింగ్‌తో పూర్తి స్థాయి ఎకోసిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. సోలార్‌ ప్యానెళ్ల తయారీ, వాటికి అవసరమైన అనుబంధ పరిశ్రమలు, సాంకేతికత, నైపుణ్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.


‘క్వాంటమ్‌ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌ వంటి అత్యాధునిక రంగాల్లో పరిశోధన, తయారీ సంస్థలు వేగంగా ఏర్పాటయ్యేలా చూడాలి. డ్రోన్‌, స్పేస్‌ సిటీల సమీపంలో ఆయా రంగాలకు అనుబంధంగా ఉండే క్లస్టర్‌ పరిశ్రమలు ఏర్పడేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి’ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, హార్డ్‌వేర్‌ తయారీ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి తైవాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఐటీ మంత్రి లోకేశ్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఎగుమతుల్లో శ్రీసిటీతో తిరుపతి జిల్లా దేశంలోనే 10వ స్థానంలో నిలిచిందని.. దానిని టాప్‌-5లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా 12 స్థానంలో ఉందన్నారు. డిసెంబరు 17, 18 తేదీల్లో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో హైడ్రోజన్‌ వ్యాలీ సదస్సు నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు సందర్భంగా పెట్టుబడిదారులకు అందించే ప్రోత్సాహకాల కోసం ఎస్ర్కో ఖాతాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. ఆతిథ్య రంగంలో హోటళ్లు పెద్దఎత్తున ఏర్పాటయ్యేలా చూడాలని, ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌ సంస్థలు వచ్చేలా ఆహ్వానించాలని చెప్పారు. భాగస్వామ్య సదస్సుకు మరో 50 రోజులు సమయమే ఉందని.. అప్పటికల్లా గతంలో కుదిరిన ఒప్పందాలు గ్రౌండ్‌ అయ్యేలా చూడాలన్నారు. ఇప్పటివరకు జరిగిన 21 ఎస్‌ఐపీబీ సమావేశాల్లో మొత్తం 387 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని.. వీటి ద్వారా రూ.14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


లాజిస్టిక్స్‌ హబ్‌గా ఏపీ..

పోర్టులు, షిప్‌బిల్డింగ్‌, లాజిస్టిక్స్‌ పరిశ్రమలను అనుసంధానించే సమగ్ర ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. లాజిస్టిక్స్‌ రంగంపై విస్తృతంగా పనిచేయాలని.. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. పోర్టులు, రైలు, రోడ్డు, ఎయిర్‌ కార్గో, అంతర్గత జల రవాణా వంటి అన్ని రవాణా మార్గాలను అనుసంధానించి సమగ్ర లాజిస్టిక్స్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలి’ అని తెలిపారు. రాష్ట్ర యువత నైపుణ్యాల్లో అగ్రస్థానంలో ఉండాలని సీఎం అన్నారు. విశాఖపట్నంలోని అదానీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌లో నైపుణ్య శిక్షణతో పాటు సివిల్‌ ఏవియేషన్‌ సహా ఎంఆర్వో ఫెసిలిటీని కూడా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు.

మెటీరియల్‌ రీసెర్చ్‌లో కీలక నైపుణ్యాలు: లోకేశ్‌

మెటీరియల్‌ రీసెర్చ్‌లో కూడా అత్యంత కీలకంగా నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు.

రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌పై ప్రత్యేక దృష్టి

రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ విషయంలో రాష్ట్రాన్ని హబ్‌గా తయారు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం అన్నారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఆధారిత ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత పరిశ్రమలు, పరిశోధన, తయారీ రంగాలను అనుసంధానం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రీన్‌ ఎనర్జీలో రాష్ట్రం నిర్దేశించుకున్న 160 గిగావాట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 113.75 గిగావాట్లకు సంబంధించి పెట్టుబడులు సాధించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎస్‌ సాయిప్రసాద్‌, మంత్రులు టీజీ భరత్‌, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్‌, వాసంశెట్టి సుభాష్‌, కందుల దుర్గేశ్‌, గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ, ఐ అండ్‌ ఐ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


విశాఖకు ముత్తూట్‌, డెలాయిట్‌!

  • అమరావతిలో ట్రైక్వాంటా లాబ్స్‌ పెట్టుబడులు

  • మచిలీపట్నంలో రూ.8000 కోట్లతో షిప్పింగ్‌ యార్డ్‌

విశాఖలో ముత్తూట్‌ ఫిన్‌కార్పొరేషన్‌ రూ.100 కోట్ల పెట్టుబడితో 2400 మందికి ఉద్యోగాలను కల్పించే ఇంటిగ్రేటెడ్‌ ఏఐ హబ్‌, టెక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ఆ సంస్థకు రూ.100 కోట్ల ప్రోత్సాహకం మంజూరు చేయాలని ఎస్‌ఐపీబీ నిర్ణయించింది. అలాగే విశాఖలో డెలాయిట్‌ సంస్థ రూ.43.75 కోట్లతో 2500 మందికి ఉద్యోగాలను కల్పించే ఐటీ/టెక్నాలజీ సర్వీస్‌ క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో షిప్పింగ్‌యార్డ్‌ నెలకొల్పే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుంది.


ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలివీ..

కడప జిల్లా: క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ సిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.950 కోట్ల పెట్టుబడి.. 90 మందికి ఉద్యోగాలు.

నంద్యాల జిల్లా: సాయి బయోఎనర్జీ ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.168.56 కోట్ల పెట్టుబడి.. 600 మందికి ఉద్యోగాలు.

శ్రీ సత్యసాయి జిల్లా: ఎం. వెంకటరావు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంవీఆర్‌ టెర్రావాంట్‌ జేవీ).. రూ.3,078 కోట్లు.. 1,300 ఉద్యోగాలు.

కర్నూలు జిల్లా: రిజాల్వెన్‌ టూ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.980 కోట్లు.. 250 ఉద్యోగాలు.

విశాఖపట్నం జిల్లా: ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ లిమిటెడ్‌.. రూ.100 కోట్లు.. 2,400 మందికి ఉద్యోగాలు.

విశాఖపట్నం జిల్లా: డెలాయిట్‌.. రూ.43.75 కోట్లు.. 2,500 ఉద్యోగాలు.

అమరావతి: సదరన్‌ గ్లోబ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌.. రూ.167 కోట్లు.. 600 ఉద్యోగాలు.

అమరావతి: క్వాంటమ్‌ కోడాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. క్వాంటమ్‌ ఏఐ/బయోటెక్నాలజీ.. రూ.167 కోట్లు.. 126 ఉద్యోగాలు.

అమరావతి: శ్రిష్టి క్వాంటమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌.. రూ.100 కోట్లు.. 110 ఉద్యోగాలు.

అమరావతి: ఆరోహక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. క్వాంటమ్‌ టెక్నాలజీ.. రూ.62 కోట్లు.. 300 ఉద్యోగాలు.

అమరావతి: ఫోటాన్‌కోర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.9 కోట్లు.. 45 ఉద్యోగాలు.

అమరావతి: వెరిడేటా హెల్త్‌ ఇంక్‌.. రూ.4.5 కోట్లు.. 50 ఉద్యోగాలు.

అమరావతి: క్వువాన్‌ఫ్లుయెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.5 కోట్లు.. 30 ఉద్యోగాలు.

అమరావతి: ట్రైక్వాంటా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌.. రూ.35 కోట్లు.. 175 ఉద్యోగాలు.


పల్నాడు: మై హోమ్‌ ఇండస్ర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.3,000 కోట్లు.. 2,000 ఉద్యోగాలు.

శ్రీసిటీ, తిరుపతి: క్యాటర్‌పిల్లర్‌ ఇంక్‌.. రూ.150 కోట్లు.. 80 ఉద్యోగాలు.

కుప్పం, చిత్తూరు: ఎంఏఎఫ్‌ క్లోతింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.215 కోట్లు.. 2,560 ఉద్యోగాలు.

కడప జిల్లా: దాల్మియా సిమెంట్‌, రూ.395.23 కోట్లు.

నెల్లూరు జిల్లా: అగర్వాల్‌ ఫౌండ్రీస్‌.. రూ.549 కోట్లు.. 245 ఉద్యోగాలు.

నెల్లూరు జిల్లా: శ్రీ వైభవలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.222.63 కోట్లు.. 300 ఉద్యోగాలు.

అనంతపురం జిల్లా: శ్రీ వసుధ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.254.06 కోట్లు.. 350 ఉద్యోగాలు.

చిత్తూరు జిల్లా: రావోక్స్‌ అగ్రిటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.1,388.14 కోట్లు.. 1,000 ఉద్యోగాలు.

శ్రీసిటీ: కెల్లాగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.211.70 కోట్లు.. 30 ఉద్యోగాలు.

నెల్లూరు జిల్లా: ఎపిటోమ్‌ ఇండస్ర్టీస్‌ ఇండియా లిమిటెడ్‌.. రూ.530.65 కోట్లు.. 238 ఉద్యోగాలు.

విజయనగరం, తిరుపతి: హిందుస్థాన్‌ కోకా-కోలా బేవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.1,127 కోట్లు.. 195 ఉద్యోగాలు.

తిరుపతి: గ్రాండ్‌ తిరుపతి హోటల్స్‌-రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. రూ.188.11 కోట్లు.. 851 ఉద్యోగాలు.

కడప జిల్లా: జేఎల్‌ అసోసియేట్స్‌.. రూ.53.25 కోట్లు.. 314 ఉద్యోగాలు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 03:57 AM