దాహం తీర్చండి!
ABN , Publish Date - Nov 24 , 2026 | 02:42 AM
కృష్ణా జలాల్లో తాగునీటి అవసరాలకు 9 టీఎంసీల కోసం ఏపీ పెట్టిన ఇండెంట్‌పై చర్చించేందుకు సోమవారం కేఆర్‌ఎంబీ భేటీ జరిగింది. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలోని కార్యాలయంలో...
‘సాగర్’ నుంచి 9 టీఎంసీలు ఇవ్వండి
సాగుకంటే తాగుకు ప్రాధాన్యం
ప్రొటోకాల్ పాటించి నీళ్లివ్వండి
కేఆర్‌ఎంబీ భేటీలో ఏపీ వాదన
తెలంగాణ అభ్యంతరాలకు కౌంటర్
శ్రీశైలం నుంచి ఎడాపెడా తోడేసింది!
విద్యుదుత్పత్తి పేరిట నీటిని వాడేశారు
దేశమంతటా ఎల్‌నినో ప్రభావం
రిజర్వాయర్ల నీరు తాగు అవసరాలకే
తెలంగాణలో సాగుకు వినియోగం: ఏపీ
పులిచింతలలోని నీటిని వాడుకోవాలని తెలంగాణ ఈఎన్‌సీ సలహా
సాగర్ నుంచి విడుదలకు ససేమిరా
ఎటూ తేల్చక చేతులెత్తేసిన కృష్ణా బోర్డు!
తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 9 టీఎంసీలు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఏపీ కోరింది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల తాగునీటి అవసరాలను వివరించింది.ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రొటోకాల్ ప్రకారం... సాగుకంటే తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. కానీ... తెలంగాణ అంగీకరిస్తేతప్ప సాగర్ నుంచి నీటి విడుదలకు ఆదేశించలేమంటూ కేఆర్‌ఎంబీ చేతులెత్తేసింది.
అమరావతి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తాగునీటి అవసరాలకు 9 టీఎంసీల కోసం ఏపీ పెట్టిన ఇండెంట్‌పై చర్చించేందుకు సోమవారం కేఆర్‌ఎంబీ భేటీ జరిగింది. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలోని కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి సతీశ్‌కుమార్ కాంబోజ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు కె.నరసింహమూర్తి, రవికుమార్ హాజరయ్యారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల తాగు నీటి అవసరాల కోసం తొమ్మిది టీఎంసీలను సాగర్ నుంచి పులిచింతలకు విడుదల చేయాలని నరసింహమూర్తి కోరారు.
తెలంగాణ ఈఎన్‌సీ జోక్యం చేసుకుని.. సాగర్‌లో జలాలు అడుగంటాయని, తెలంగాణలోనూ తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో ఏపీకి నీటి విడుదలకు అంగీకరించేది లేదని చెప్పారు. పైగా ఏపీలోని పులిచింతలలో 26.87 టీఎంసీల నిల్వలున్నాయని.. వాటిని తాగునీటి కోసం వాడుకోవాలని సలహా ఇచ్చారు. కావాలంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు తాగునీటి అవసరాల కోసం నీరు తీసుకోవచ్చని.. కృష్ణా డెల్టాకు మాత్రం ఇచ్చేందుకు సమ్మతించబోమని తెలిపారు. నరసింహమూర్తి స్పందిస్తూ.. ప్రాజెక్టుల్లో నిల్వ చేసిన నదీ జలాల వినియోగం మార్గదర్శకాలనూ, ప్రొటోకాల్స్‌ను గుర్తుచేశారు. తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేశారు.
‘‘తాగు నీరివ్వాలని కోరుతుంటే నాగార్జున సాగర్‌లో జలాలు అడుగంటాయని తెలంగాణ చెబుతోంది. అలాంటప్పుడు శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ కోసం, సాగు అవసరాలకు ఆ రాష్ట్రం ఎడాపెడా ఎందుకు నీటిని తోడేసింది? దేశమంతా ఎల్‌నినో ప్రభావం ఉంది. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను అత్యవసరమైన తాగునీటి కోసం కాకుండా సాగు కోసం వాడుకున్నారు’’ అంటూ తెలంగాణ తీరును కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీటి అవసరాల ప్రాధాన్యంపై ఏపీ వాదనతో బోర్డు సభ్య కార్యదర్శి ఏకీభవించారు. అయితే తాము తటస్థులమంటూనే.. సాగర్ నుంచి నీటి విడుదలకు తెలంగాణ అభ్యంతరం చెబుతున్నందున ఏమీ చేయలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. తెలంగాణ అంగీకరిస్తేనే 9 టీఎంసీల విడుదలకు సమ్మతిస్తామన్నారు.
సాగర్‌లో 511 అడుగుల వరకు వాడుకోవచ్చు..
ఏపీ వాదనల్లో నిజముందంటూనే.. తెలంగాణకు ఆమోదయోగ్యం కాదని బోర్డు చేతులెత్తేయడంపై నరసింహమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం 534.5 అడుగుల్లో 177 టీఎంసీల జలాలు ఉన్నాయని.. వాటిని 511 అడుగుల దాకా వాడుకునే అవకాశం ఉందని కేఆర్‌ఎంబీకి తెలిపారు. 511 అడుగుల కంటే దిగువకు తగ్గిపోతే సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా కిందకు నీరు పారదన్నారు. అందువల్ల ఇప్పుడు 9 టీఎంసీలు విడుదల చేస్తే జనవరి దాకా తాగునీటి అవసరాలకు వాడుకుంటామంటే.. ‘వాటర్ ప్రోటోకాల్’కు వ్యతిరేకంగా తెలంగాణ మాట్లాడుతోందని చెప్పారు. ఈ వాదనతో కేఆర్‌ఎంబీ కూడా ఏకీభవించింది.
దీంతో 9 టీఎంసీల విడుదలకు ఆదేశాలివ్వాలని ఏపీ కోరింది. కానీ సభ్య కార్యదర్శి స్పందించలేదు. పులిచింతల ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎ్‌స)కు నీటి విడుదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలంగాణ స్పష్టం చేసింది. అప్పటిదాకా ఏపీకి ఎంతో కొంత నీటిని విడుదల చేయాలంటూ చెబుతూ వచ్చిన కాంబోజ్.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేదదంటూ నీటి విడుదలపై మౌనం దాల్చారు. దీంతో ఉదయం, మధ్యాహ్నం రెండు దఫాలుగా చర్చించినా ఏపీకి కేటాయింపులపై నిర్ణయం తీసుకోకుండానే త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది.
జలజీవన్ మిషన్ ప్రాజెక్టుపై చర్చించొద్దు..
త్రిసభ్య కమిటీ భేటీలో.. నాగార్జున సాగర్ వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో రక్షిత మంచినీటి పథకం కోసం ఆంధ్రప్రదేశ్ నిర్మించిన ఇన్‌టేక్ వెల్‌పై చర్చించేందుకు తెలంగాణ ఈఎన్‌సీ రవికుమార్ సన్నద్ధమయ్యారు. అయితే ఇది పూర్తిగా పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని రక్షిత మంచినీటి పథకమని.. దీనితో జలవనరుల శాఖకు సంబంధం లేదని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి స్పష్టంచేశారు. దీనిపై చర్చ వద్దని చెప్పారు. జల్‌జీవన్ మిషన్ కింద జాతీయ స్థాయిలో నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇన్‌టేక్ వెల్స్ తవ్వి వాటి ఆధారంగా తాగునీటి అవసరాలను తీర్చడం సహజమేనన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వాటర్‌గ్రిడ్ పథకాలు వేలల్లో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుత అజెండాలో నీటి కేటాయింపులపై చర్చ జరగాల్సి ఉన్నందున ఈ అంశానికే పరిమితమవుదామని తేల్చిచెప్పారు. ఇందుకు కేఆర్‌ఎంబీ కూడా అంగీకరించడంతో ఈ అంశంపై చర్చ జరగలేదు.
ఈ 3 జిల్లాలకు జరిగే అన్యాయానికి బాధ్యత మీదే !
బోర్డు చైర్మన్‌కు ఏపీ స్పష్టీకరణ
త్రిసభ్య కమిటీ భేటీకి ముందు బోర్డు చైర్మన్ సుభ్రాంశు బిశ్వాస్‌తో ఈఎన్‌సీ నరసింహమూర్తి సమావేశయ్యారు. ఎన్‌టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు జరిగే అన్యాయానికి బోర్డుదే బాధ్యతని అన్నారు. ప్రాజెక్టుల నీటి వినియోగం ప్రొటోకాల్స్‌ను గుర్తు చేశారు. తాగునీటి అవసరాల తర్వాతే సాగు కోసం నీటిని వినియోగించాల్సి ఉంటుందని.. సాగు కోసం వినియోగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే శ్రీశైలం నీటిని విద్యుదుత్పాదనకు ఉపయోగించాలని ప్రోటోకాల్స్ చెబుతున్నాయని వివరించారు. ఆయనతో బిశ్వాస్ ఏకీభవించారు. ఏపీ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే తాము ఎటువైపూ మొగ్గుచూపడం లేదని.. కృష్ణా జలాల అంశం సున్నితమైనదిగా మారడంతో తెలంగాణ అంగీకరించకుండా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేపోతున్నామని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి: