Share News

చింతలపూడి అంచనా వ్యయాన్ని రూ.8,075.17 కోట్లకు పెంచండి

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:24 AM

చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.8075.17 కోట్లకు పెంచాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే కీలకమైన పథకం ఇది.

చింతలపూడి అంచనా వ్యయాన్ని రూ.8,075.17 కోట్లకు పెంచండి

  • ఆర్థిక శాఖను కోరిన జల వనరుల శాఖ

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని రూ.8075.17 కోట్లకు పెంచాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. గోదావరి, కృష్ణా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే కీలకమైన పథకం ఇది. 2008లో ఈ పథకాన్ని రూ.1701 కోట్లతో నిర్మాంచాలని భావించినా 2016 వరకూ సాకారం కాలేదు. అదే ఏడాది దాని అంచనా వ్యయాన్ని రూ.4909.80 కోట్లకు పెంచారు. అదే సమయంలో న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని నిలిపివేసింది. నిషేధం ఎత్తివేయించేందుకు నాటి జగన్‌ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని పంకల్పించి నిషేధం ఎత్తివేతకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటికి అనుగుణంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఈ పథకాన్ని రాష్ట్ర అనుమతులు సరిపోతాయని పేర్కొంది. దీంతో నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ రూ.4909.80 కోట్ల ఉన్న అంచనా వ్యయాన్ని ప్రస్తుత ధరల మేరకు 8075.17 కోట్లకు పెంచాలని రాష్ట్ర ఆర్థిక శాఖను రాష్ట్ర జల వనరుల శాఖ అభ్యర్థించింది.


చింతలపూడితో లబ్ధి ఇలా:

చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని మరో 2,10,000 ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. కొవ్వాడ కాల్వ, యెర్రకాల్వ, తమ్మిలేరు రిజర్వాయరుకు గోదావరి జలాలు పంపేందుకు వీలుంటుంది. ఏలూరు జిల్లాలోని 18 మండలాలకు చెందిన 467 గ్రామాలకు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 11 మండలాలకు తాగునీరు లభిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 04:24 AM