పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:38 AM
స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నామినేషన్ల పరిశీలన, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికారులు...
మున్సిపల్ ఫలితాలు రాత్రి 8గంటల్లోగా ఇవ్వాలి
డిసెంబరు 5తో ఎన్నికల ప్రక్రియకు ముగింపు:పునేఠా
రేపే తొలివిడత పంచాయతీ పోలింగ్
మిగిలిన 23 పట్టణ సంస్థలకు కూడా..
ఎన్నికల అధికారులతో ఎస్‌ఈసీ వర్చువల్ భేటీ
అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, నామినేషన్ల పరిశీలన, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా (ఎస్‌ఈసీ) సూచించారు. ఎన్నికల అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గతంకంటే అధికంగా కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల్లోపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తిచేసి, తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, నిబంధనల అమలుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అవసరమైన పోలీసు బలగాలను ముందుగానే సమకూర్చుకోవాలని చెప్పారు. నవంబరు 26న 23 పట్టణ స్థానిక సంస్థలు, 26 జిల్లాల్లో గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. అదేరోజు పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయన్నారు.
నవంబరు 30న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్టు తెలిపారు. నవంబరు 29న రెండో దశ, డిసెంబరు 2న గ్రామ పంచాయతీల మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబరు 5న 23 పట్టణ స్థానిక సంస్థలకు డిప్యూటీ మేయర్/వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించడంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని వివరించారు. ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్క అధికారి తప్పక పాటించాలని చెప్పారు.
పోస్టల్ బ్యాలెట్లపై ప్రత్యేక శ్రద్ధ
పోస్టల్ బ్యాలెట్లలో చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా నమోదవుతున్న అంశాన్ని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎ.మల్లికార్జున ప్రస్తావిస్తూ దీనికిగల కారణాలను విశ్లేషించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ అందించడంతోపాటు ఓటువేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. రీకౌంటింగ్ అభ్యర్థనలపై గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు ప్రకటించి రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన తర్వాత రీకౌంటింగ్ చేపట్టాల్సిన పరిస్థితి రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐజీ బి.రాజకుమారి మాట్లాడుతూ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా పూర్తి భద్రత కల్పించాలని, ఎలాంటి బెదిరింపులు, దాడులు, భయభ్రాంతులకు తావులేకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి