‘సంజీవని’ కోసం లక్ష మందికి శిక్షణ
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:48 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సంజీవని ప్రాజెక్టు కోసం ప్రణాళికా బద్ధంగా సిద్ధమవుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జనవరి 1న సంజీవని కింద వైద్య సేవలు ప్రారంభించేందుకు వీలుగా ...
జనవరి 1 నుంచి సంజీవని వైద్య సేవలు
డిసెంబరు 10న ట్రయల్ రన్: మంత్రి సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సంజీవని ప్రాజెక్టు కోసం ప్రణాళికా బద్ధంగా సిద్ధమవుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జనవరి 1న సంజీవని కింద వైద్య సేవలు ప్రారంభించేందుకు వీలుగా 1.02 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. సంజీవని ప్రాజెక్టు అమలుకు తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టాటా సంస్థ సహకారంతో నిర్వహించే సంజీవని కింద చేపట్టే కార్యక్రమాలపై వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఈ నెల 12వ తేదీ నుంచి నవంబరు 6వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. డిసెంబరు 10న సంజీవని సేవలను ట్రయల్ రన్ కింద ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,008 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంజీవని సేవల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. 537 కేంద్రాల్లో సంజీవని సేవల కోసం ప్రత్యేక గదులు సిద్ధం చేస్తున్నామన్నారు. మరో 1,726 కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా యూపీఎస్ లేదా ఇన్వర్టర్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ ఏర్పాట్లన్నీ నవంబరు 30 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. కాగా, సంజీవని ప్రాజెక్టు అమలులో భాగంగా రాష్ట్రంలోని వైద్య కేంద్రాల్లో 2,277 మంది రోగి సేవల సమన్వయకర్తలను గుర్తించి నియమించే ప్రక్రియ చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు