Share News

మొండి.. ఈ బండి!

ABN , Publish Date - Nov 26 , 2026 | 03:51 AM

ఆకలి బాధ ఒకరిదైతే, అజీర్తి సమస్య మరొకరిది అన్నట్లుంది ఆర్టీసీ పరిస్థితి. ఒకవైపు, పల్లె ప్రజలకు ప్రయాణ సేవలందించే బస్సులు వయోభారంతో తిరగలేక మూలకు చేరుతున్నాయి.

మొండి.. ఈ బండి!

పాత బస్సుల ఆపసోపాలు

కొత్త బస్సులున్నా రోడ్డెక్కవు

బయటకు రాకుండా ‘ఫిట్నెస్‌’ బ్రేకులు

స్పీడ్‌ లిమిట్‌ డివైజ్‌ ఉంటేనే రోడ్డుపైకి..

తేల్చిచెబుతున్న రవాణా శాఖ

బిగించాలంటే పరికరాలు లేవు

సరఫరాకు ముందుకు రాని సంస్థలు

ఆదాయం తెచ్చిపెట్టే శబరిమల యాత్ర

సీజన్‌లో ఆర్టీసీలో వింత పరిస్థితి

సమస్య పరిష్కరించే ప్రయత్నం చెయ్యని రవాణా శాఖ మంత్రి, కార్యదర్శి రాష్ట్రంలోని ఆర్టీసీ దుస్థితికి ఈ బస్సే నిదర్శనం. అటో భాగం.. ఇటో భాగం అన్నట్టు బస్సు వాలకం.. బాడీ అయినా ఫిట్‌గా ఉందా అంటే, అదీ అతుకుల బొంతే. బస్సు ముందుభాగం, వెనుక భాగం.. ఎక్కడ చూసినా పగుళ్లే. కాకినాడ జిల్లా ఏలేశ్వరం డిపోకు చెందిన ఈ బస్సు భారంగా బుధవారం ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వచ్చింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆకలి బాధ ఒకరిదైతే, అజీర్తి సమస్య మరొకరిది అన్నట్లుంది ఆర్టీసీ పరిస్థితి. ఒకవైపు, పల్లె ప్రజలకు ప్రయాణ సేవలందించే బస్సులు వయోభారంతో తిరగలేక మూలకు చేరుతున్నాయి. మరోవైపు, దూర ప్రాంత ప్రయాణ సేవలందించే కొత్త బస్సులు ఫిట్నెస్‌ రెన్యువల్‌ జరగక కదల్లేని పరిస్థితి నెలకొంది. నిర్ణయం తీసుకునే నాయకత్వం కనిపించదు. పరికరాలు సరఫరా చేసేవారు లేరు. తెప్పించుకునే మార్గం లేదు.

టెండర్లు ఎప్పుడు పూర్తవుతాయో ఆర్టీసీలో చెప్పేవారు కనిపించడం లేదు. దీంతో శబరిమలకు వెళ్లేందుకు బస్సులు కావాలని అయ్యప్ప భక్తులు అడుగుతున్నా, పెళ్లిళ్లకు బస్సు కావాలని ప్రజలు సంప్రదించినా.. ఏమీ చెప్పలేని అయోమయ స్థితి ఆర్టీసీ అధికారులది. అయ్యప్ప భక్తులకు, పెళ్లిళ్లకు అద్దెకు పంపేందుకు బస్సులున్నా రవాణా శాఖ నిబంధనలతో వాటిని నడపలేని పరిస్థితి నెలకొంది. మినహాయింపు తీసుకుని నడుపుదామంటే ఆ శాఖ మంత్రి, కార్యదర్శి ఆ దిశగా ప్రయత్నమే చెయ్యరు.

ఫలితంగా ఇటు ప్రయాణికులకు సేవలు అందవు. అటు ఆర్టీసీకి ఆదాయం రాదు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో రోజుకు 35నుంచి 36 లక్షల మందికి ఆర్టీసీ సేవలు అందేవి. తాజా గణాంకాల ప్రకారం ఆ సేవలు ఇప్పుడు 45లక్షల మందికి చేరుతున్నాయి. సరాసరి రోజుకు 9నుంచి 10లక్షల మంది ప్రయాణికులు పెరుగుతున్నారు. కానీ ఆ స్థాయిలో ఆర్టీసీ సేవలు అందించలేక పోతోంది. కాలం చెల్లిన బస్సులు మూలకు చేరడం.. కొత్త బస్సులకు ఫిట్నెస్‌ రెన్యువల్‌ గాక, తిప్పలేక పోవడమే దీనికి కారణం.


ఆదాయం పోతున్నా పట్టించుకోరేం!

ప్రయాణికుల ఆదరణ పొందిన ప్రజా రవాణా సంస్థలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో సుమారు 1400 కొత్త డీజిల్‌ బస్సులు సమకూరాయి. ఆ తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు విద్యుత్‌ బస్సుల వైపు మొగ్గు పెరిగింది. అయితే 2024 ద్వితీయార్థంలో కొనుగోలు చేసిన కొత్త బస్సులకు తప్పనిసరిగా రెండేళ్లలో ఫిట్నెస్‌ చేసి తీరాలి. అలా చేద్దామంటే దానికి వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌(వీఎల్‌టీడీ) అమర్చాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి వాహనానికీ ఐదు వేలు నుంచి ఆరున్నర వేల ఖర్చుతో వీఎల్‌టీడీ అమర్చారు. తాజాగా స్పీడ్‌ లిమిట్‌ డివైజ్‌(ఎ్‌సఎల్‌డీ) తప్పనిసరి అంటూ రవాణా శాఖ ఉత్తర్వులిచ్చింది. ప్రయాణ, సరుకు రవాణా వాహనాలకు ఎస్‌ఎల్‌డీ ఉంటేనే ఫిట్నెస్‌ రెన్యూవల్‌ అంటూ మెలిక పెట్టింది. కేంద్ర రవాణా శాఖ ఈ విషయంలో కఠినంగా ఉందంటూ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఐటీ విభాగాన్ని అప్రమత్తం చేసి, ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌(ఏటీఎస్)లకు అనుసంధానం చేసింది. రాష్ట్రంలో ఏ రవాణా వాహనమైనా ఏటీఎస్‌ కేంద్రాలకు వెళ్లి ఫిట్నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే పరీక్షలకు ముందు వీఎల్‌టీడీ, ఎస్‌ఎల్‌డీ తప్పనిసరిగా అమర్చి ఉండాలి. వీఎల్‌టీడీ ఉన్నా ఎస్‌ఎల్‌డీ లేకపోవడంతో రెండేళ్ల క్రితం రోడ్డెక్కిన బస్సులు సైతం సర్టిఫికెట్‌ పొందలేని పరిస్థితి. కార్తీక మాసం, శబరిమల అయ్యప్ప యాత్ర సీజన్‌లో ఆర్టీసీకి ప్రత్యేక ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను కోరుతున్నారు. ఇలాంటి సమయంలో ఫిట్‌నెస్‌ సమస్యలతో బస్సులు అందుబాటులో లేక భక్తులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఆర్టీసీ బస్సులకు స్పీడ్‌ లిమిటింగ్‌ డివైజ్‌లు బిగించుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా .. వాటిని సరఫరా చేసేవారే లేరు! రాష్ట్రంలో ఎక్కడా అవసరమైన సంఖ్యలో పరికరాలు అందుబాటులో లేవు. ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుందామంటే నిబంధనలు అడ్డొస్తున్నాయి. కొత్తగా టెండర్లు పిలుద్దామంటే ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు ఉన్నత స్థాయిలో రాజకీయ జోక్యం, కమీషన్ల డిమాండ్లపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఫలించని పొరుగు ప్రయత్నాలు..

ఇతర రాష్ట్రాల నుంచి స్పీడ్‌ లిమిట్‌ డివైజ్‌ పరికరాలు తెప్పించుకునేందుకు భువనేశ్వర్‌లోని రవాణా సంస్థలను సంప్రదించారు. అయితే అక్కడ వినియోగిస్తున్న పరికరాలు ఏపీ వాహనాల్లో పనిచేయవని, తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ వేరుగా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. కర్ణాటక సంస్థలను సంప్రదించగా.. తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా టెండర్‌ ప్రక్రియ ఉందని స్పష్టం చేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి పరికరాలు తెచ్చుకునే మార్గం కూడా మూసుకుపోయింది. మన రాష్ట్రంలో అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో కొత్తగా టెండర్లు పిలిచినా అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేయడం, సాంకేతిక పరిశీలన, ధరల ఖరారు, సరఫరా ఉత్తర్వులు, పరికరాల ఏర్పాటు, వాటిని వాహన్‌ పోర్టల్‌తో అనుసంధానం చేయడం.. ఇలా ఒక్కో దశకు సమయం పడుతుంది. ఆలోపు అయ్యప్ప యాత్ర సీజన్‌ ముగిసిపోతుంది.


ఇప్పటికే ఫిట్‌నెస్‌ గడువు సమీపిస్తున్న బస్సులకు పరికరాలు అమర్చకపోతే రోడ్డెక్కే పరిస్థితి లేదు. టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు బస్సులను నిలిపివేయాలా? లేక నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషించాలా? అనే దానిపై సముచిత నిర్ణయం తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ లేకపోవడం, జేఎండీ స్థాయిలో అనుభవలేమిపై అంతర్గతంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్టీసీకి వేలాది బస్సులు ఉండగా, వాటి నిర్వహణ, పరికరాల కొనుగోలు, ఫిట్‌నెస్‌ వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక ఉండాల్సిన అవసరం లేదా? కేంద్ర నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిసినప్పుడు ముందుగానే పరికరాల సరఫరాకు ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 03:52 AM