Share News

టాలెంట్‌ హబ్‌గా రెసిడెన్షియల్‌ స్కూళ్లు

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:25 AM

రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

టాలెంట్‌ హబ్‌గా రెసిడెన్షియల్‌ స్కూళ్లు

  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లుగా 10 పాఠశాలలు

  • నిమ్మకూరులో నీట్‌, జేఈఈ అకాడమీ ఏర్పాటు

  • 1978 నుంచి ఇంటర్‌ సర్టిఫికెట్లు డిజిటలైజేషన్‌: మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ 59వ గవర్నింగ్‌ బాడీ సమావేశం శుక్రవారం ఉండవల్లిలో జరిగింది. రాష్ట్రంలో 10 రెసిడెన్షియల్‌ పాఠశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేసేందుకు గవర్నింగ్‌ బాడీ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు ఏపీఆర్‌జేసీ కాలేజీల్లో ఐఐటీ-జేఈఈ, నీట్‌ అకాడమీతోపాటు, ఆరు రెసిడెన్షియల్‌ పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు కూడా ఆమోదం లభించింది.

జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం రెసిడెన్షియల్‌ స్కూల్‌ను విద్య, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. విద్యా సంస్థల సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు, పీఈటీలను పీడీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు ఆమోదం లభించింది. సమావేశంలో ఉన్నతాధికారులు జె.శ్యామలరావు, రంజిత్‌ బాషా, భరత్‌ గుప్తా పాల్గొన్నారు. కాగా, ఈ ఏడాది నుంచి ఇంటర్‌ సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను 32 పేజీలకు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. 1978 నుంచి జారీచేసిన అన్ని సర్టిఫికెట్లనూ డిజిటలైజ్‌ చేసి, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇంటర్‌ బోర్డు సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదించారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:25 AM