Share News

బీపీ, షుగర్‌ పైపైకి..!

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:49 AM

రాష్ట్రంలో బీపీ, షుగర్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్వహించిన ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) సర్వే 4.0లో కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు (బీపీ), 11,58,632 మందికి మధుమేహం (షుగర్‌) ఉన్నట్లు...

బీపీ, షుగర్‌ పైపైకి..!

  • రాష్ట్రంలో కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు

  • నాలుగో విడత ఎన్‌సీడీ 4.0 సర్వేలో గుర్తింపు

  • ప్రస్తుతం 13.93 శాతం మందికి బీపీ, 11.45 శాతం మందికి షుగర్‌

  • 59 లక్షలకు చేరిన బీపీ.. 48 లక్షలకు పెరిగిన షుగర్‌ కేసులు

అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీపీ, షుగర్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ తాజాగా నిర్వహించిన ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) సర్వే 4.0లో కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు (బీపీ), 11,58,632 మందికి మధుమేహం (షుగర్‌) ఉన్నట్లు గుర్తించారు. గతేడాది సెప్టెంబరు 17వ తేదీ నుంచి ఈ ఏడాది నవంబరు 10వ తేదీ వరకూ నాలుగో విడత ‘ఎన్‌సీడీ సర్వే 4.0’ నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా 3,339 మందికి నోటి క్యాన్సర్‌, 9,171 రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు బయటపడ్డాయి.

సర్వేలో భాగంగా రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.85 కోట్ల మందికి బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్‌ పరీక్షలు, 1.46 కోట్ల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహించారు. సర్వేలో కొత్తగా బయటపడిన 12.23 లక్షల కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం బీపీ కేసులు 59.63 లక్షలకు చేరాయి. అలాగే కొత్తగా బయటపడిన 11.58 లక్షలతో కలిపి రాష్ట్రంలో మొత్తం షుగర్‌ కేసులు 48.95 లక్షలకు పెరిగాయి.

వారిలో 34 లక్షల మందికి బీపీ, షుగర్‌ రెండూ ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 13.93 శాతం మందికి బీపీ, 11.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో బీపీ కేసులు అధికంగా నమోదయ్యాయి. తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కడప, ఏలూరు జిల్లాల్లో షుగర్‌తో బాధపడుతున్న వారు అత్యధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కాగా, ఎన్‌సీడీ 4.0 సర్వే నివేదికను ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు శనివారం ఉదయం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు సమర్పించారు.


వయసుల వారీగా బీపీ, షుగర్‌..

60 ఏళ్లు దాటిన వారిలో అత్యధిక మంది బీపీ, షుగర్‌ రెండు సమస్యలతో బాధపడుతున్నారని ఈ సర్వేలో తేలింది. 60 దాటిన వారిలో 47.60 శాతం మంది బీపీ, 43.39 శాతం మందికి షుగర్‌ ఉంది. అలానే 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో 11,827 మందికి బీపీ, 10,360 మందికి షుగర్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది. 20 నుంచి 29 ఏళ్ల వయస్సుల్లో 81,983 మంది బీపీ, 75,431 మంది షుగర్‌ బాధితులున్నారు.

30 నుంచి 39 ఏళ్ల మధ్యలో 2,89,865 మందికి బీపీ, 2,86,680 మందికి షుగర్‌ ఉన్నట్లు గుర్తించారు. 40 నుంచి 49 ఏళ్ల మధ్యలో 9,99,833 మందికి బీపీ, 9,22,583 మందికి షుగర్‌ నిర్థారణ అయింది. 50 నుంచి 59 ఏళ్ల మధ్యలో 17,41,147 మందికి బీపీ, 14,76,353 మందికి షుగర్‌ బయటపడింది. 60 ఏళ్లు దాటిన వారిలో 28,38,552 మందికి బీపీ, 21,24,428 మందికి షుగర్‌ ఉన్నట్లు నిర్థారణ అయింది.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 02:49 AM