Share News

పట్టణ మౌలిక వసతుల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:21 AM

రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రైవేట్‌ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అమలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

పట్టణ మౌలిక వసతుల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు

  • పీపీపీ విధానం అమలుకు ప్రత్యేక మార్గదర్శకాలు

  • స్థానిక సంస్థలు, అథారిటీలు, కార్పొరేషన్లకు వర్తింపు

  • పట్టణ సౌకర్యాల్లో భారీ పెట్టుబడులు వస్తాయని అంచనా

  • పీపీపీ మోడల్‌లో 56 ప్రాజెక్టుల గుర్తింపు

  • అంచనా వ్యయం రూ. 23 వేల కోట్లు

  • చిన్న, మధ్య మున్సిపాలిటీలకు పెద్ద ప్రయోజనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రైవేట్‌ పెట్టుబడులను భారీ స్థాయిలో ఆకర్షించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అమలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పీపీపీ విధానం అమలు చేసేందుకు ఈనెల 27 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్గదర్శకాలు పట్టణ స్థానికసంస్థలు, పట్టణాభివృద్ధి అథారిటీలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌, తదితర సంస్థలకు వర్తిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివశిస్తున్నారు. దీని వల్ల రహదారులు, తాగునీరు, కాలువలు, ఘనవ్యర్థాల నిర్వహణ, గృహనిర్మాణం, ట్రాఫిక్‌, పట్టణ సౌకర్యాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల లోటు సుమారు రూ. 45 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రైవేట్‌ పెట్టుబడులు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది.


వివిధ దశల్లో ప్రాజెక్టులు

పీపీపీ మోడల్‌లో అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 56 ప్రాజెక్టులను గుర్తించింది. వీటి అంచనా వ్యయం రూ. 23,801 కోట్లుగా ఉంది. ఇందులో 16 పట్టణ స్థానిక సంస్థల్లో 50 ప్రాజెక్టులు రూ.5717 కోట్ల వ్యయంతో ఉండగా, మిగతా ఐదు ప్రాజెక్టులు సీఆర్‌డీఏ/ఏజీఐసీఎల్‌ పరిధిలో రూ.17484 కోట్లతో అభివృద్ధి దశలో ఉన్నాయి. తొలిదశలో రూ.330 కోట్ల విలువైన ఒక ప్రాజెక్టు నిర్మాణదశలో, రూ.3747 కోట్లతో 15 ప్రాజెక్టులు బిడ్డింగ్‌ దశలో, రూ.244 కోట్లతో నాలుగు డీపీఆర్‌ దశలోను, రూ.560 కోట్లతో రెండు కాన్సెప్ట్‌ దశలో ఉన్నాయి. రెండో దశలో రూ.745 కోట్లతో 25 ప్రాజెక్టులు డీపీఆర్‌ దశలో, రూ.90 కోట్లతో మూడు ప్రాజెక్టులు కాన్సెప్ట్‌ దశలో ఉన్నాయి.

మున్సిపల్‌ శాఖలో అర్బన్‌ పీపీపీ యూనిట్‌..

పట్టణ స్థానిక సంస్థలకు సాంకేతిక సాయం అందించేందుకు మున్సిపల్‌ శాఖలో ప్రత్యేకంగా అర్బన్‌ పీపీపీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టుల రూపకల్పన, టెండర్లు, ఫైనాన్షియల్‌ స్ట్రక్చరింగ్‌, వివాద పరిష్కారం వంటి అంశాల్లో పట్టణ స్థానికసంస్థలకు ఆ యూనిట్‌ సహకరిస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం డీబీఎఫ్ఓటీ/బీఓటీ, ఆర్‌ఓఎంటీ, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌, బిల్డ్‌ ఓన్‌ ఆపరేట్‌, ఓ అండ్‌ ఎం కాంట్రాక్టులు, జాయింట్‌ డెవల్‌పమెంట్‌ వంటి పలు మోడళ్లలో ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కల్పించారు. అమృత్‌ 2.0, పీఎంఏవై 2.0, అర్బన్‌ చాలెంజ్‌ఫండ్‌, యూఐడీఎఫ్‌, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టు డెవల్‌పమెంట్‌ ఫండ్‌ వంటి కేంద్ర పథకాలతో అనుసంధానం కూడా కల్పించారు.


అమరావతిలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు...

సీఆర్‌డీఏ పరిధిలో అమరావతి కేంద్రంగా పలు భారీ ప్రాజెక్టులు గుర్తించారు. వాటిలో అమరావతి ఐ, అమరావతి మెరీనా, స్పోర్ట్సు సిటీ, రోప్‌వే, ఇన్నర్‌రింగ్‌రోడ్డు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులున్నాయి. అదనంగా రూ.600 కోట్ల విలువైన మరో ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీంతో పాటు వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు, నగర రహదారి అభివృద్ధి, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థలు, ఎస్‌టీపీలు, హ్యాబిట్‌ సెంటర్లు, కైలా్‌సగిరిలో రోప్‌వే, లూజ్‌రైడ్‌, ఎంఐజీ హౌసింగ్‌, ఐకానిక్‌ రెసిడెన్షియల్‌ టవర్స్‌, ఆధునిక బస్టాండ్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, వాటర్‌థీమ్‌ పార్కులు, సోలార్‌ ప్రాజెక్టులు, పరిశ్రమలకు శుద్దిచేసిన నీటి సరఫరా, డీసాలినేషన్‌ ప్రాజెక్టులు వంటి విభిన్న రంగాలు ఉన్నాయి. కాగా, ఈ మార్గదర్శకాల వల్ల చిన్న, మధ్యతరహా మున్సిపాలిటీలకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థల విశ్వసనీయత పెరుగుతుందని చెప్తున్నారు. ఈ మార్గదర్శకాలతో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో దేశానికి ఆంధ్రప్రదేశ్‌ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఆర్థికవృద్ధి కేంద్రాలుగా పట్టణాలు..

రాష్ట్రంలో పట్టణాలను ఆర్థికవృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రాంట్ల ఆధారంగా జరిగే పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను, ఇకపై ప్రైవేట్‌ పెట్టుబడులు, సాంకేతిక, నూతన ఆవిష్కరణలు, ఆపరేషనల్‌ సామర్థ్యంతో ముందుకు తీసుకెళ్తారు. నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, నగర రహదారులు, గృహనిర్మాణం, ప్రభుత్వ స్థలాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, టూరిజం ఆధారిత పట్టణ సౌకర్యాల్లో భారీ పెట్టుబడులు వస్తాయి. ప్రాజెక్టుల ఎంపిక నుంచి ఫీజబిలిటీ అధ్యయనం, రిస్క్‌ షేరింగ్‌, టెండర్లు, మానిటరింగ్‌, వివాద పరిష్కారం వరకు పూర్తి విధానాన్ని ఇందులో పొందుపరిచారు.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:21 AM