Share News

ఏపీలో ఇకపై 'నిధి' పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రాసెసింగ్.. కీలక ఉత్తర్వులు జారీ!

ABN , Publish Date - Apr 13 , 2026 | 07:53 PM

పెన్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో ఇకపై 'నిధి' పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రాసెసింగ్.. కీలక ఉత్తర్వులు జారీ!
AP Govt Introduces Major Pension Reforms

అమరావతి, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల మంజూరు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి (NIDHI) పోర్టల్ (RBPS) ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిజికల్ అప్లికేషన్లకు స్వస్తి చెప్పి, మే 1 నుంచి ఈ కొత్త రూల్ అమలు చేయబోతోంది.

ప్రస్తుతం కొనసాగుతున్న కాగితపు దరఖాస్తుల విధానానికి ప్రభుత్వం గడువు విధించింది. ఏప్రిల్ 30, 2026 వరకు అందిన ఫిజికల్ పెన్షన్ ప్రపోజల్స్‌ను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు. మే 1, 2026 నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్లను స్వీకరించబోమని ప్రభుత్వం చెప్పింది. ఆ తేదీ తర్వాత వచ్చే పెన్షన్ దరఖాస్తులన్నీ తప్పనిసరిగా నిధి పోర్టల్ ద్వారానే ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది.


వివిధ శాఖల్లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఫిజికల్ దరఖాస్తులన్నింటినీ ఏప్రిల్ 30లోపు సంబంధిత కార్యాలయాలకు సమర్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పెన్షన్ ప్రాసెసింగ్‌లో వేగం పెంచడమే లక్ష్యంగా తెచ్చిన ఈ డిజిటల్ విధానం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఫైల్ ఏ స్టేజ్‌లో ఉందో అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, డిజిటల్ పద్ధతిలో వేగంగా ఆమోదం పొందే అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సేవలు అందుతాయి.

ఈ కొత్త విధానంపై అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకు, జిల్లా అధికారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఉద్యోగులు పదవీ విరమణ పొందే ముందే వారి పెన్షన్ పేపర్లను నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు చేకూరనుంది. పెన్షన్ మంజూరులో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను తొలగించి, సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశం.


ఇవి కూడా చదవండి

క్రూడాయిల్ పైకి.. స్టాక్ మార్కెట్లు కిందకి..

జీవితం నాశనం చేసే అలవాట్లు ఇవే.. ప్రతి పురుషుడు తప్పక తెలుసుకోవాల్సినవి

Updated Date - Apr 13 , 2026 | 09:00 PM