రేపే పరిషత్ పోలింగ్
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:02 AM
రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం ఆయా పరిషత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
ముగిసిన ఎన్నికల ప్రచారం
659 జడ్పీ, 9,829 ఎంపీటీసీల్లో ప్రక్రియ
సర్వం సిద్దం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం ఆయా పరిషత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 659 జడ్పీటీసీలు, 9,829 ఎంపీటీసీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.81 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిషత్‌కు పోలింగ్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అవసరమైతే 6వ తేదీ శుక్రవారం రీపోలింగ్ చేపట్టి శనివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35,333 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 9,966 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 9,186 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మిగిలిన కేంద్రాలు సాధారణ కేటగిరీలో ఉన్నాయి. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 659 మండల కేంద్రాలు, 28 జిల్లా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. 35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలపై..
మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించింది. అదేవిధంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లో 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో 44 పోలింగ్ కేంద్రాలు.. మొత్తం 88 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమయాన్ని సాయంత్రం 3 గంటలకే ముగించేలా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
పలుచోట్ల ఎన్నికలు వాయిదా?
మురసు తుఫాను కారణంగా పలు మండలాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ఆయా జిల్లాల అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సమాచారం ఇచ్చారు. మరోవైపు తుఫాను ప్రభావంతో రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పరిషత్ పోలింగ్‌కు పటిష్ఠ బందోబస్తు
38 వేల మంది పోలీసులతో భద్రత: డీజీపీ
రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా, మండల పరిషత్ స్థానాలకు గురువారం జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కు వినియోగించుకునేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు శాఖ గుర్తించిన 17,555 సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి చర్యలు తీసుకుంది. బ్యాలెట్ బాక్సుల్ని భద్రపరిచే 178 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ బలగాల్ని రంగంలోకి దించింది.
మొత్తం 31,472 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,348 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు చెప్పారు. అత్యంత సమస్యాత్మక 1,841 పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక 2,645 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా సాయుధ పోలీసుల్ని రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తారని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం