ఎమ్మెల్యేల ‘పంచాయతీ’ గోల
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:39 AM
అధికార పార్టీలో నాయకత్వ లోపాలు.. ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అధికారం తెచ్చిన అహంతో పెట్రేగిపోయే ఎమ్మెల్యేలు కొందరైతే....
కొన్నిచోట్ల కూటమి ఫలితాలపై ఎఫెక్ట్.. సమన్వయం, నాయకత్వ లోపాలతో దెబ్బ
ఉమ్మడి కృష్ణా, అనంత, ఏలూరు, నంద్యాలలో పోటాపోటీగా నిలిచిన వైసీపీ
కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కంటే ముందంజ
పట్టణ, పరిషత్ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం
కానీ తొలి విడత పంచాయతీలో కొన్నిచోట్ల ‘తేడా’
కూటమి స్ట్రయిక్ రేట్ 68.97కే పరిమితం
ఎన్నికల తర్వాత ఫలితాలపై కూటమి విశ్లేషణ
ఎమ్యెల్యేలు-క్యాడర్ మధ్య దిద్దుబాటు చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అధికార పార్టీలో నాయకత్వ లోపాలు.. ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అధికారం తెచ్చిన అహంతో పెట్రేగిపోయే ఎమ్మెల్యేలు కొందరైతే.. మమ్మల్ని అడిగేదెవరన్న రీతిలో ప్రవర్తిస్తున్న ప్రజాప్రతినిధులు మరికొందరు.
వీరి తీరు కారణంగా.. కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా కొన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. పార్టీలు, గుర్తులకు అతీతంగా జరుగుతాయనే పేరే కానీ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ ప్రజల మనోభావాలకు అద్దం పడతాయి. తాజాగా జరిగిన తొలి విడత పంచాయతీ పోరులో 3949 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 760 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3189 స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 1807 స్థానాలు గెలుచుకుని 56.7 శాతం స్ట్రయిక్ రేటు సాధించింది.
జనసేన 166 స్థానాలు, బీజేపీ 19 స్థానాలు సాధించాయి. మొత్తం మీద ఎన్డీయే కూటమి 1992 స్థానాలతో 62.5 శాతం స్ట్రయిక్ రేటు నమోదు చేసింది. వైసీపీ 1072 స్థానాలను గెలుచుకుని 33.62 శాతం స్ట్రయిక్ రేటు నమోదు చేసింది. ఏకగ్రీవాలనూ పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీయే కూటమి 2724 స్థానాలతో 68.97 శాతం స్ట్రయిక్ రేటు నమోదు చేయగా, వైసీపీ 1081 స్థానాలతో 27.37 శాతం స్ట్రయిక్ రేటు సాధించింది. ఉమ్మడి కృష్ణా, అనంతపురం జిల్లాలతో పాటు ఏలూరు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వాల కారణంగా కూటమి ప్రతికూల ఫలితాలను మూటగట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సంస్థాగతంగా బలంగా ఉన్న వైసీపీ కూటమి ఎమ్మెల్యేల తీరుతో మరింత బలపడుతోంది.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు జిల్లాలోని పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల కారణంగా కూటమి భారీగా నష్టపోయింది. పోలవరం ఎమ్మెల్యే సొంత ఊరిలో తమ్ముడి భార్యనూ గెలిపించుకోలేకపోయారు. పోలవరం నియోజకవర్గంలో 73 పంచాయతీలకుగాను 23 స్థానాలు వైసీపీ గెలుచుకోగా 33 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేదీ అదే తీరు. ఎవ్వరినీ లెక్కచేయకుండా తాను ఏది చెబితే అదే వేదం అన్నట్టు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 76 పంచాయతీలకుగాను కూటమికి 39 స్థానాలు దక్కగా, వైసీపీ 32 స్థానాలు కైవసం చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మొత్తం 40 పంచాయతీలకు కూటమి 23 స్థానాలు గెలిస్తే వైసీపీ 16 స్థానాలను దక్కించుకుంది. స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మరింత చురుగ్గా ఎన్నికల్లో పాల్గొని ఉంటే కూటమి మరిన్ని స్థానాలు గెలిచేదని టీడీపీ నేతలు అంటున్నారు.
నందాల్య జిల్లా నంద్యాల నియోజకవర్గంలో 32 స్థానాలకుగాను టీడీపీ 17, వైసీపీ 14 స్థానాల్లో విజయం సాధించాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లోనూ ఆశాజనకమైన స్థాయిలో ఫలితాలు రాలేదు.
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పెద్ద పంచాయతీల్లో ఎక్కువ చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఉదాహరణకు పార్వతీపురం మండలంలోని సంఘం వలస, తాళ్ల బురిడీ, జమదాల, ఎమ్మార్ నగరం, బలిజిపేట మండలంలో నారాయణపురం, పెద్దపింకీ, బలిజిపేట, చిలకలపల్లి పంచాయతీల్లో వైసీపీ మద్దతు దారులు విజయం సాధించారు. పార్టీని నమ్ముకున్నవారికి.. గెలిచే వారికి టికెట్లు దక్కకపోవడంతో చాలా చోట్ల టీడీపీ రెబల్స్ బరిలోకి దిగి గెలిచారు. నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగాను 55 టీడీపీకి దక్కగా, వైసీపీ 32 స్థానాల్లో విజయం సాధించింది.
విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ పరిధిలో 111 పంచాయతీలకుగాను టీడీపీ 73, వైసీపీ 37 గెలుచుకున్నాయి. బొబ్బలిలో 110 పంచాయతీలకుగాను టీడీపీ 72, వైసీపీ 34 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ ఎమ్మెల్యేలు మరింత దృష్టి సారించి ఉంటే వైసీపీకి అన్ని స్థానాలు దక్కేవి కాదన్నది కూటమి నేత ల వాదన.
ఉమ్మడి కృష్ణాలో..
కృష్ణా జిల్లా అంటే.. తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాంటిచోట ప్రత్యర్థి వైసీపీ పైచేయి సాధించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గాలలోనే జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 84 పంచాయతీలు ఉండగా.. టీడీపీ-33, జనసేన-1, బీజేపీ-1, స్వతంత్రులు-10 మంది గెలిస్తే.. వైసీపీ బలపరిచిన అభ్యర్థులు 39 మంది గెలుపొందారు. కృష్ణా జిల్లాలో తొలివిడతలో 145 పంచాయతీలకు ఎన్నికలు జరగగా టీడీపీ 70, జనసేన 2, ఇతరులు 17, వైసీపీ 55 స్థానాలు గెలుచుకున్నాయి.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో 64 పంచాయతీ స్థానాలకు గాను టీడీపీ- 35, జనసేన- 2, స్వతంత్రులు- 6 స్థానాలను గెలవగా వైసీపీ- 21 స్థానాలలో గెలుపొందింది. గన్నవరం నియోజకవర్గంఎమ్మెల్యేపై తొలి నుంచి స్థానిక టీడీపీ నేతల్లో అసంతృప్తి నెలకొని ఉంది. పార్టీని నమ్ముకుని ఉన్న వారిని కాకుండా తనతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని, తొలి నుంచి టీడీపీలో ఉన్న వారిని కోవర్టులుగా చూస్తున్నారని నియోజకవర్గ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ బాగా పుంజుకుంది. మైలవరం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. తనతో పాటు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తూ తొలి నుంచీ టీడీపీలో ఉన్న వారిని విస్మరిస్తుండటంతో ఆ ప్రభావం పంచాయతీ ఎన్నికల్లో కనబడిందని మైలవరం టీడీపీ నేతలు అంటున్నారు.
ఎన్నికల తర్వాత విశ్లేషణ
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తే.. పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకించి కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదు? కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా? అక్కడ ఎమ్మెల్యేల వైఫల్యం ఎంతవరకు కారణం? ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడానికి కారణాలు ఏమిటి? అన్నదానిపై ఎన్నికల తర్వాత అధికార పార్టీ దృష్టిపెట్టనుంది. ప్రతికూల ఫలితాలు రావడానికి గల కారణాలపై విశ్లేషించనుంది. పార్టీలో అసంతృప్తులను సరిదిద్దుకునేందుకు అధిష్ఠానం చర్యలు తీసుకోనుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 57 పంచాయతీలకుగాను టీడీపీ 27 స్థానాలు. వైసీపీ 27 గెలుచుకున్నాయి. జనసేన 1, స్వతంత్రులు 2 గెలుచుకున్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గంలో 74 పంచాయతీలకుగాను టీడీపీ 49, వైసీపీ 23 గెలుచుకున్నాయి. బీజేపీ 1, స్వతంత్రులు 1 గెలుచుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 87 సర్పంచ్ స్థానాలకుగాను టీడీపీకి 56, వైసీపీకి 31 స్థానాలు దక్కాయి. ఇక్కడ స్థానిక నాయకత్వంలో సమన్వయలోపాలే వైసీపీకి లాభించాయనేది కూటమి నేతల మాట. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 72 పంచాయతీలకుగాను 32 టీడీపీ, 34 వైసీపీ గెలుచుకున్నాయి. బీజేపీ 3, జనసేన 1, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. కూటమి నేతల సమన్వయలోపం వైసీపీకి వరంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..