Share News

ఓటుకు రారండి

ABN , Publish Date - Nov 16 , 2026 | 02:28 AM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో హడావుడి నెలకొంది. AP panchayat elections, Hyderabad voters, AP local elections, vote buying, cash for votes, voter transportation, sarpanch elections, polling on November 26, election campaign, AP political leaders, migrant voters

ఓటుకు రారండి

  • ఏపీలో పంచాయతీ పోరు.. హైదరాబాద్‌లో ఓట్ల వేట

  • ఓటర్లను కలిసేందుకు క్యూ కడుతున్న నేతలు

  • ఎన్నికల రోజు సొంతూరికి వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి

  • ఓటుకు నోటు ఇచ్చి.. ఖర్చులు భరిస్తామని హామీ

  • వాహనాలు పెడతామని.. టికెట్లు బుక్‌ చేస్తామని వెల్లడి

  • కార్తీక మాసం కావడంతో వన భోజనాలకూ ప్లానింగ్‌

  • 26న తొలి విడత పోలింగ్‌.. నామినేషన్లకు ముందే హడావుడి


ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ.. హైదరాబాద్‌లో ఓట్ల వేట మొదలైంది..! నగరంలో ఉంటున్న ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల నేతలు, అభ్యర్థులు వివిధ మార్గాలు వెతుకుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకాకముందే తమ ఊరి ఓటర్లను బుకింగ్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓటుకు నోటిస్తాం.. రవాణా, ఇతర ఖర్చులు భరిస్తాం.. మీరు వచ్చి ఓటు వేసి వెళితే చాలని కాకా పడుతున్నారు. కార్తీక మాసం కావడంతో కొందరైతే ఇక్కడే తమ ఊరి ఓటర్లకు వనభోజనాలు ఏర్పాటు చేసి ‘మీ ఓటు మాకే వేయాలి’ అని అభ్యర్థించాలని ప్రణాళిక రచిస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో హడావుడి నెలకొంది. ఉపాధి నిమిత్తం ఏపీ నుంచి ఇక్కడకు వచ్చి ఉంటున్న వారి వద్దకు పార్టీల నేతలు, అభ్యర్థులు బారులు తీరుతున్నారు. సొంత గ్రామానికి వచ్చి ఓటు వేసి వెళ్లాలని కోరుతున్నారు. రవాణా ఖర్చులతోపాటు ఓటుకు కొంత నగదూ ఇస్తున్నారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో నగరంలో ఉంటున్న ఏపీ ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు, నేతలు వచ్చారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సర్పంచ్‌ అభ్యర్థి బేగంపేటలోని తమ గ్రామానికి చెందిన ఓటర్లను కలిశారు. యోగ క్షేమాలు కనుక్కొని.. ఎన్నికల విషయం ప్రస్తావించారు. ఫలానా పార్టీ నుంచి తాను పోటీ చేస్తున్నానని ఊరికి వచ్చి ఓటు వేయాలని అభ్యర్థించారు. రవాణా ఖర్చులతోపాటు ఓటుకు రూ.1000 చొప్పున ఐదు ఓట్లకు రూ.5 వేలు ఇచ్చారు. తప్పకుండా రావాలని, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం గుర్తు చెబుతానని పేర్కొన్నారు. కార్తీక మాసం కావడంతో కొందరు అభ్యర్థులు.. తమ గ్రామానికి చెందిన ఓటర్లకు ఇక్కడే వనభోజనాలు ఏర్పాటుచేసి ఒకే చోట అందరినీ ఓటు కోసం విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నారు. అదే సందర్భంగా కానుకలూ ఇచ్చేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.


రవాణా సదుపాయం.. ఓటుకు నోటు..

సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నిక కోసం ఏపీలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 26న తొలి దశ, 29న రెండో విడత, డిసెంబరు 2న మూడో దశ పోలింగ్‌ ఉంటుంది. మొదటి దశ పోలింగ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. 17న నామినేషన్‌ దాఖలుకు ఆఖరు తేదీ కావడంతో.. ఆ తర్వాత ప్రచార పర్వం ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలకు చెందిన నాయకులు, అభ్యర్థులు ముందుగా నగరానికి వచ్చి ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్ల కోసం కొందరు వాహనాలూ సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రామ ఓటర్ల చిరునామాలు తెలుసుకుని ప్రత్యక్షంగా కలిసి అభ్యర్థించడంతోపాటు.. అందరికీ అనువుగా ఉండే ప్రాంతంలో వాహనం కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఓ పార్టీ నుంచి సర్పంచ్‌గా బరిలో నిలవనున్న నాయకులు, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే వారు ప్రత్యేక వాహనంలో నగరానికి వచ్చారు. కూకట్‌పల్లి, బేగంపేట, అమీర్‌పేట, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లో ఉండే గ్రామ ఓటర్లను కలిశారు. అమీర్‌పేటలో వాహనం ఏర్పాటుచేస్తామని, అక్కడి నుంచి అందరూ కలిసి రావాలని కోరారు.

ఓటుకు ఇంత అని ముట్టజెప్పారు. కొందరు పోలింగ్‌ రోజు మరి కొంత నగదు ఇస్తామని ఆశ పెడుతున్నారు. ఓటర్ల కోసం కొందరు అభ్యర్థులు రానుపోను రైల్‌/బస్‌ టికెట్లు బుక్‌ చేస్తుండడం గమనార్హం. ఎన్నికల రోజు అల్పాహారం, భోజనాల ఏర్పాట్లు కూడా ఉంటాయని, వచ్చి ఓటు వేస్తే చాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసానిస్తున్నారు. ఇదే అదనుగా ఇప్పటికే కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు పోలింగ్‌ తేదీలకు ముందు, తర్వాత రెండు, మూడు రోజులు టికెట్‌ ధరలు పెంచేశాయి.


సొంత గ్రామంలో ఓటు వేసేందుకు..

ఏపీలో మునిసిపల్‌, పరిషత్‌ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. వీటితో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీలు, నాయకులు, అభ్యర్థులు ప్రతి ఓటునూ కీలకంగా భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎంత ఇస్తుందో తెలుసుకొని అంతకంటే కొంత ఎక్కువ మొత్తమే ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు హైదరాబాద్‌లోని ఓటర్లతో ఫోన్లలో మాట్లాడి.. తమ అనుచరులను వారి వద్దకు పంపుతున్నారు. గ్రామంలో ఓటు వేయకుంటే అనంతరం ఏదైనా పనికోసం వెళితే సహకరించరేమో అన్న ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. దీంతో పోలింగ్‌ రోజు సొంత గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ కుటుంబానికి సొంత గ్రామంలో ఎనిమిది ఓట్లు ఉన్నాయి. ఓ పార్టీ అభ్యర్థి ఇప్పటికే అనుచరుల ద్వారా వారికి డబ్బులు పంపగా.. ప్రత్యర్థి పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి పోన్‌ చేసి రెండు, మూడు రోజుల్లో వచ్చి కలుస్తానని చెప్పాడని సదరు ఓటరు పేర్కొన్నారు. కొందరైతే రెండు పార్టీల అభ్యర్థుల నుంచీ డబ్బులు తీసుకుంటున్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇచ్చిన డబ్బులు తీసుకోకపోయినా ఇబ్బందే. డబ్బులు వద్దంటే.. మేం వారికి ఓటు వేయం’ అనే నిర్ధారణకు వస్తారని సనత్‌నగర్‌లో ఉండే విజయవాడకు చెందిన ఓటరు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 02:37 AM