Share News

నేడే పల్లె పోరు.. తాయిలాల జోరు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:34 AM

తొలి విడత పంచాయతీ పోరు చివరి ఘట్టానికి చేరింది. గురువారమే పోలింగ్‌. దీంతో పల్లెల్లో బుధవారం తాయిలాల జోరుకు తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు.

నేడే పల్లె పోరు.. తాయిలాల జోరు

  • ఓటరుకు ‘గుర్తుండేలా మంచాలు, ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, వంకాయలు పంపిణీ

  • ‘పంచాయతీ’ ప్రచారంలో అభ్యర్థుల సిత్రాలు

  • ఎన్నికల చిహ్నం గుర్తుండేలా వింత విన్యాసాలు

  • మరోవైపు జోరుగా సొమ్ము పంపిణీ

  • కొన్నిచోట్ల 5 వేలు దాకా పలికిన ఓటు

  • చాలాచోట్ల ఓటుకు వెయ్యినుంచి రూ.1500

  • అల్లూరిలో కుక్కర్లు, ఇడ్లీ పాత్రలు, చీరల పంపిణీ

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): తొలి విడత పంచాయతీ పోరు చివరి ఘట్టానికి చేరింది. గురువారమే పోలింగ్‌. దీంతో పల్లెల్లో బుధవారం తాయిలాల జోరుకు తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. తమ ఎన్నికల గుర్తును పరిచయం చేయడానికి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. హైటెక్‌ పద్ధతులతో ప్రచారంలో జోష్‌ పెంచుతున్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలంలో ఓ అభ్యర్థికి ఈసీ మంచం గుర్తు ఇచ్చింది. దీంతో ఇనుప, ఫైబర్‌తో తయారైన మంచాలు కొనుగోలు చేసి గ్రామంలోపంపిణీ చేశారు.

ఇదే మండలంలో పలువురు సర్పంచ్‌ అభ్యర్థులు ఇక్కడ తమ ఎన్నికల గుర్తు ఓటర్లకు గుర్తుండేలా అదే గుర్తుతో కూడిన గిఫ్ట్‌లు పంపిణీ చేశారు. మరో చోట కత్తెర గుర్తు వచ్చిన అభ్యర్థి కత్తెరలు కొనుగోలు చేసుకోమంటూ ఓటర్లకు డబ్బులు ఇచ్చారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుదారు శానంపూడి చిరంజీవి తానే కత్తెర్లు కొని పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో పలువురు అభ్యర్థులకు ఈసీ కత్తెర గుర్తును కేటాయించింది. దీంతో ఆ ప్రాంతంలో కత్తెరలకు యమ డిమాండ్‌ పెరిగిపోయింది. అభ్యర్థులు వాటిని కొనుగోలు చేసి ఇంటింటికి తిరిగి పంచారు.

విజయవాడ రూరల్‌ మండలంలో ఓ సర్పంచ్‌ అభ్యర్థికి ఐరన్‌ బాక్సు ఎన్నికల గుర్తుగా వచ్చింది. ఆయన పెద్దఎత్తున ఐరన్‌ బాక్స్‌లు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. ఇదే మండలంలో వంకాయ గుర్తు వచ్చిన అభ్యర్థి.. కిలోల చొప్పున వాటిని ఓటర్లకు పంచారు. రామవరప్పాడు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి కొల్లా ఆనందకుమార్‌కు ఎన్నికల సంఘం మంచం గుర్తు కేటాయించింది. డ్రోన్‌ సాయంతో మంచాన్ని గాల్లో ఎగరేస్తూ, ఆయన వినూత్న ప్రచారం నిర్వహించారు.


ఓటుకు రూ.15,000..

దండం పెట్టిన అభ్యర్థులు

బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో 10మంది ఎస్టీ ఓటర్లు ఓటుకు రూ.15వేలు అడగడంతో అభ్యర్థులు.. ‘మీకో దండం’ అంటూ అక్కడనుంచి వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్న ఓ కుటుంబానికి ఇద్దరు అభ్యర్థులు ఓటుకు రూ.3వేలు వంతున పంచారు. దీంతో ఆ కుటుంబానికి రూ.24వేలు వచ్చాయి. ఇదే మండలంలో పలు గ్రామాల్లో ఓటుకు రూ. వెయ్యినుంచి రెండు వేలు పంచారు. అయితే, మేజర్‌ పంచాయతీ అయిన మార్టూరులో ఓటుకు రూ.500 పంచడంపై ఓటర్లు అసంతృప్తితో రగిలిపోయారు.

‘వలస’ ఓటుకు రూ.ఐదు వేలు

నెల్లూరు జిల్లాలో ఒక్క ఓటు కూడా వదలకూడదన్న పట్టుదలను అభ్యర్థులు ప్రదర్శించారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు రూ.5వేల వరకు ఇచ్చి, రాను పోను చార్జీలు ఇచ్చి మరీ గ్రామాలకు రప్పిస్తున్నారు. ప్రత్యర్థి ఎంత ఇస్తే.. దానికి 50 శాతం మొత్తాన్ని అదనంగా చేర్చి ఓటర్లకు పంచుతున్న వైనం కావలి మున్సిపాలిటీలో కనిపించింది. ఇదే పోకడ కాకినాడ కార్పొరేషన్‌లోను కనిపించింది. కాకినాడ రూరల్‌ నియోజక వర్గం పరిధిలోని తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి తరలిస్తోన్న మిక్సీలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నగదు పంపకాలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి.

ఒక్కో వార్డుకు నాలుగు మద్యం కేసులు చొప్పున పంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమికి స్వతంత్ర అభ్యర్థులు తలనొప్పిగా మారారు. భీమవరంలోని ఓ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కుక్కర్‌ ఇస్తే, కూటమి అభ్యర్థి చీర అందించారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం, గణపవరం గ్రామాల్లో అన్‌ లిమిటెడ్‌గా పంపకాలు జరుగుతున్నాయి. వెల్వడంలో ఓటుకు రూ.5 వేలకు పైగానే ఇచ్చారు. అల్లూరి జిల్లాలో అభ్యర్థులు ఓటర్లకు కుక్కర్లు, ఇడ్లీ పాత్రలు, చీరలు పంచారు.


రెండో విడతలో 1171 సర్పంచ్‌లు ఏకగ్రీవం

  • 19,651 వార్డులు కూడా..

  • మిగతా 3803 సర్పంచ్‌ స్థానాలు,

  • 29,608 వార్డులకు 29న పోలింగ్‌

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రెండో విడత ఎన్నికలు ప్రకటించిన 4975 పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) బుధవారం రాత్రి ప్రకటించింది. వీటిలో 1171 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

అలాగే 49,318 వార్డులకు గాను 19,651 వార్డులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో విశాఖ జిల్లా తప్ప మిగతా 27 జిల్లాల్లో 52 మండలాల పరిధిలో.. మిగతా 3803 సర్పంచ్‌ స్థానాలకు, 29,068 వార్డులకు ఈ నెల 29వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. సర్పంచ్‌ స్థానాలకు 10,292 మంది పోటీచేస్తుండగా.. వార్డులకు 63,410 మంది బరిలో నిలిచినట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 02:44 AM