కూటమి జోరు!
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:19 AM
మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో జయభేరి మోగించిన కూటమి.. పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ జోరు కొనసాగించింది.
తొలి దశ పంచాయతీల్లో 2600కు పైగా గెలుపు
వెయ్యికి చేరువలో వైసీపీ
అల్లూరి, కృష్ణాలో పోటాపోటీ
మిగతా జిల్లాల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులదే పైచేయి
అన్నమయ్య జిల్లాలో క్లీన్ స్వీప్
పంచాయతీ సమరంలోనూ కూటమి సత్తా చాటింది. ఒకటి రెండు చోట్ల వైసీపీ మద్దతుదారులు కూడా పోటాపోటీగా నిలిచారు. 3949 పంచాయతీలకు గాను కడపటి వార్తలందేసరికి పాలక కూటమి 2600కుపైగా గ్రామాల్లో విజయం సాధించింది. వైసీపీ మద్దతుదారులు దాదాపు 1000 పంచాయతీల్లో పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు సైతం 100 వరకు గెలుచుకున్నా.. వీరిలో కూటమి రెబల్సే ఎక్కువని సమాచారం.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో జయభేరి మోగించిన కూటమి.. పార్టీల గుర్తు లేకుండా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ జోరు కొనసాగించింది. తొలి దశలో ఎన్నికలు జరిగిన 3949 పంచాయతీల్లో 760 పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కూటమి మద్దతుదారులు... గురువారం ఎన్నికలు జరిగిన పంచాయతీల్లోనూ అధిక స్థానాల్లో సత్తా చాటారు. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు.. కూటమి మద్దతుదారులు 2600కుపైగా స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ బలపరచినవారు వెయ్యికి చేరువయ్యారు. స్వతంత్రులు-ఇతరులు కూడా 100కుపైగా స్థానాల్లో విజయం సాధించారు.
పంచాయతీ ఎన్నికలు జరిగిన అన్ని జిల్లాల్లో కూటమి పార్టీలు బలపరచిన అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టారు. పట్టణ ఓటరు నుంచి పల్లె ఓటరు వరకు అందరూ కూటమి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. ఈవీఎంలైనా.. బ్యాలెట్‌లైనా.. కూటమిదే విజయమని నిరూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రయిక్ రేటు, జడ్పీ ఎన్నికల్లో 96.42 శాతం స్ట్రయిర్ రేటు, ఎంపీపీ ఎన్నికల్లో 95 శాతం స్ట్రయిక్ రేటు నమోదు చేసిన పాలక సంకీర్ణం.. పంచాయతీల్లోనూ అదే జోరు కొనసాగించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించిన వైసీపీ.. పంచాయతీ ఎన్నికల్లో ఆ జోరు కొనసాగించింది. మొత్తం 66 పంచాయతీలకు గాను 29 చోట్ల గెలిచింది. కూటమి 26 స్థానాలను కైవసం చేసుకుంది. పరిషత్ ఎన్నికల్లో కూటమి దాదాపు క్లీన్‌స్వీప్ చేసిన తిరుపతి జిల్లాలో.. 404 పంచాయతీలకు గాను వైసీపీ మద్దతుదారులు 61 వరకు గెలుచుకోవడం గమనార్హం. మిగతా జిల్లాలో కూటమి బలపరచిన అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఏకపక్ష విజయం అందుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా