Share News

తొలి ‘పోరు’ ఉద్రిక్తం

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:40 AM

తొలి విడత పంచాయతీ పోరు అక్కడక్కడా అదుపు తప్పింది. ఎన్నికల సందర్భంగా, అనంతరం సర్పంచ్‌ల ఎంపిక సమయంలో కొన్నిచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.

తొలి ‘పోరు’ ఉద్రిక్తం

  • ఆళ్లగడ్డలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

  • భూమా అఖిలప్రియ వాహనాలపై రాళ్లదాడి

  • అన్నమయ్యలో టీడీపీ వర్గీయుల కిడ్నాప్‌

  • పల్నాడులో బ్యాలెట్‌ బాక్స్‌ బద్దలు

  • సత్యసాయిలో ‘వైసీపీ’ మహిళా అభ్యర్థి వీరంగం

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌): తొలి విడత పంచాయతీ పోరు అక్కడక్కడా అదుపు తప్పింది. ఎన్నికల సందర్భంగా, అనంతరం సర్పంచ్‌ల ఎంపిక సమయంలో కొన్నిచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామ పంచాయతీ లోని పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనాలపై రాళ్ల దాడి చేశారు.

పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల ఏజెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన అఖిలప్రియ, యువ నాయకుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి తమ వాహనాలను పోలింగ్‌ కేంద్రంలోని బారికేడ్ల వద్ద ఉంచి వెళ్లారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఆక్రోశంతో ఎమ్మెల్యే వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు చెందిన మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

అఖిలప్రియ కారు డ్రైవర్‌పై ఎస్పీ సమక్షంలో దాడి చేశారు. దీంతో.. వాహనం అదుపు తప్పి ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దాడిలో గాయపడ్డ డ్రైవరు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ ఘటనలో పోలీసుల తీరును అఖిలప్రియ తీవ్ర స్వరంతో గర్హించారు.


కిడ్నాప్‌ కలకలం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట నగర పంచాయతీ చైర్మన్‌ స్థానం కోసం తొమ్మిది మంది పోటీ చేశారు. టీడీపీ వర్గానికి చెందిన ఇద్దరిని వైసీపీ వాళ్లు కిడ్నాప్‌ చేశారు. రెండు కార్ల అద్దాలు పగులకొట్టారు. అక్కడున్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంతో వైసీపీ శ్రేణులు మరింత చెలరేగిపోయారు. పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతూ కొత్తగా కనిపించిన వాళ్లపై దాడులు చేశారు. 16వ వార్డు టీడీపీ అభ్యర్థి ఇంటిపై రాళ్లదాడి చేశారు. కాగా, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ మద్దతుతో నిలబడిన సర్పంచ్‌ అభ్యర్థి సుకన్య 7వ వార్డు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి బ్యాలెట్‌ బాక్సులో ఇంకు పోశారు. అక్కడ శుక్రవారం రీపోలింగ్‌ జరపాలని అధికారులు నిర్ణయించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులోని ఒకటో వార్డులో బ్యాలెట్‌ బాక్స్‌ను ధ్వంసం చేశారు. అక్కడ శుక్రవారం రీపోలింగ్‌ జరగనుంది.

అధికారులపై దాడులు..

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేట పంచాయతీ ఆర్‌ఆర్‌-1 పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇదే నియోజకవర్గం పెనగలూరు మండల కేంద్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఈవోపీఆర్డీ శ్రీకాంత్‌ను అడ్డుకుని, దౌర్జన్యం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలంలోని ఎగువరెడ్డిపల్లె వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. జనసేన పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలతో ఆ గ్రామానికి చెందిన దాదాపు 120 మంది ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

గ్రామస్థుడిని ఈడ్చుకెళ్లిన కారు..

చిత్తూరు జిల్లా కుప్పం మండలం వనగుట్టపల్లిలో సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో.. ఆ పార్టీ నాయకులు బరి తెగించారు. అక్కడ ఉన్న ఆర్‌వో వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ వాహనం టీడీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రాజేంద్ర అనే కార్యకర్తను కారు లాక్కుని పోయింది. అతడు కాళ్లు తెగి, శరీరం నుజ్జునుజ్జయి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.


ధర్మాన హౌస్‌ అరెస్టు

శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్‌, 60 కార్పొరేటర్‌ స్థానాలకు ఓటింగ్‌ జరిగిన సందర్భంగా... వైసీపీ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వైసీపీ మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి స్వయంగా తానే జనరల్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తామని గతంలో ధర్మాన ప్రకటించారు. ఓ మాజీమంత్రి జనరల్‌ ఏజెంట్‌గా వెళ్లడం.. వివాదాలు జరగవచ్చన్న సంకేతాలు అందడంతో పోలీసులు ముందే జాగ్రత్త పడ్డారు. ధర్మాన ఇంటి నుంచి రాకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 05:46 AM