Share News

నేడే రెండో విడత..పల్లె పోరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:22 AM

రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాష్ట్రంలోని 27 జిల్లాలు, 246 మండలాల పరిధిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

నేడే రెండో విడత..పల్లె పోరు

  • 3880 పంచాయతీలకు పోలింగ్‌

  • 83.52 లక్షల మంది ఓటర్లు

  • ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్‌

  • ఆ వెంటనే ఫలితాల విడుదల

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం రాష్ట్రంలోని 27 జిల్లాలు, 246 మండలాల పరిధిలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండో విడత ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 52 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 246 మండలాల్లో ప్రక్రియ చేపట్టింది. మొత్తం 3,880 గ్రామ పంచాయతీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మొత్తం 83,52,338 మంది ఓటర్లు తమ గ్రామానికి ప్రథమ పౌరుడిని, వార్డు ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. వారిలో 41,05,292మంది పురుషులు, 42,46,608మంది మహిళలు, ఇతరులు 438 మంది ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 1,41,316 ఎక్కువగా ఉండటం విశేషం.

1095 ఏకగ్రీవాలు, 3803 చోట్ల పోటీ...

రెండో విడతలో మొత్తం 4975 సర్పంచ్‌ స్థానాల్లో 1171 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండుస్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3803 సర్పంచ్‌ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో 10,295 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 49,318 వార్డులకు గాను 19,655 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 60 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 29,603 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో 63,395 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలు రెండూ ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు 1095 ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.


పెద్ద జిల్లాల్లో ఆసక్తికర పోటీ...

తిరుపతి జిల్లాలో అత్యధికంగా 249 గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత విజయనగరం 246, నెల్లూరు 215, కర్నూలు 170, ఏలూరు 166, శ్రీసత్యసాయి జిల్లాలో 165 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలో 71, పల్నాడులో 54, మార్కాపురంలో 64, బాపట్లలో 99 పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కాగా, మిగిలిన గ్రామాల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. విశాఖ జిల్లాలో రెండో విడతలో ఎన్నికలు లేవు.

నిఘా నీడలో పోలింగ్‌....

ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సాంకేతిక నిఘాను విస్తృతం చేసింది. మొత్తం 50,476 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టింది. తుది పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 3,70,915గా ఉంది. ఎస్‌ఈసీ కార్యాలయం నుంచి 9,300 కెమెరాలను కేటాయించగా, 8,470 గదుల్లో వీడియోగ్రఫీ, 5,186 గదుల్లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు.

ఉదయం 7 గంటలకు పోలింగ్‌

ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు విడివిడిగా ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.


ఉపసర్పంచ్‌ ఎన్నిక మరో కీలక ఘట్టం...

ఎన్నికైన వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఇందుకోసం వార్డు సభ్యుల మద్దతు కూడగట్టడం అభ్యర్థులకు ముఖ్యంగా మారనుంది. ఫలితాలు ప్రకటించిన రోజే ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్‌ సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా... బ్యాలెట్‌ బాక్సులకు నష్టం జరిగినా, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగినా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రీపోలింగ్‌ నిర్వహించవచ్చు. ఇందుకోసం నవంబరు 30వ తేదీని కేటాయించారు. ఆ రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. రీపోలింగ్‌ జరిగే గ్రామాల్లో ఉపసర్పంచ్‌ ఎన్నికను కూడా రీపోలింగ్‌ ఫలితాల అనంతరమే నిర్వహించనున్నారు.


భద్రతపై ప్రత్యేక దృష్టి....

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా గుమికూడకుండా, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరగకుండా నిఘా ఉంచనున్నారు. కోడ్‌ ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.

పల్లెతీర్పుపై ఉత్కంఠ...

పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ప్రత్యక్ష పార్టీ ఎన్నికలు కాకపోయినా, గ్రామ స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులే బరిలో ఉంటారు. దీంతో ఈప్రక్రియ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక నాయకుల బలాబలాలు, గ్రామాల్లో ప్రజలతో ఉన్న సంబంధాలు, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఏకగ్రీవమైన గ్రామాలు మినహా మిగిలిన పంచాయతీల్లో ఓటర్లు ఇచ్చే తీర్పు ఆదివారం సాయంత్రం నుంచి స్పష్టమవుతుంది. రెండో విడత ఫలితాలతో గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 02:28 AM