ఏకగ్రీవాల జోరు!
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:27 AM
ఒకప్పుడు గ్రామ పెద్దల మాటే శాసనంగా సాగిన ఏకగ్రీవాల ప్రక్రియ.. ఇప్పుడు రూ.లక్షల హామీల చుట్టూ తిరుగుతోంది!..
గూడవల్లి సర్పంచ్ పదవి కోటీ 20 లక్షలకు వేలం
జొన్నలగడ్డ రూ.81 లక్షలు.. ముత్తనపల్లిలో రూ.18 లక్షలు
పల్లెదొడ్డిలో రూ.32.50 లక్షలకు ఒప్పందం
ఏకగ్రీవం చేస్తే 2 ఎకరాలిస్తానంటున్న గొల్లవానితిప్ప అభ్యర్థి
కోటి, ఎకరం స్థలం ఇస్తానంటున్న తాటిపాకవాసి
వేలం, విరాళాల బాటలో మరికొన్ని స్థానాలు
విజయవాడ, నరసరావుపేట, డెంకాడ, భీమవరం రూరల్, అంతర్వేది, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు గ్రామ పెద్దల మాటే శాసనంగా సాగిన ఏకగ్రీవాల ప్రక్రియ.. ఇప్పుడు రూ.లక్షల హామీల చుట్టూ తిరుగుతోంది!.. రాష్ట్రంలో జరగబోయే తొలివిడ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకోవడానికి ఔత్సాహికులు డబ్బే ప్రధానంగా పావులు కదుపుతున్నారు. కొందరు గ్రామాభివృద్ధికి డబ్బు ఇస్తామని చెబుతుంటే.. మరికొందరు ఎకరం.. రెండెకరాల భూమిని సైతం ఇస్తామని ప్రకటిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలతోపాటు ధనబలం కూడా చర్చనీయాంశంగా మారింది. వివరాలివీ..
ఎన్టీఆర్ జిల్లా గూడవల్లి సర్పంచ్ స్థానాన్ని టీడీపీకి చెందిన నీలకంఠ మానేశ్వరరావు (నిఖిల్ యాదవ్) వేలంలో రూ. 1,20,50,100 లకు దక్కించుకున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాలన్నీ టీడీపీకి చెందిన వారే తీసుకునేలా ఒప్పందం కుదిరింది. వైసీపీ ఎక్కడా పోటీ పడదు. మరి వైసీపీకి ప్రయోజనం ఏమిటి అనుకుంటున్నారా? గ్రామంలో జరిగే పనులన్నింటినీ చెరి సగం పంచుకునేలా అంతర్గత ఒప్పంద కుదిరినట్టు భోగట్టా.
అలాగే, జనరల్ మహిళకు రిజర్వ్ అయిన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ సర్పంచ్ స్థానం కోసం సతీమణుల భర్తలు రంగంలోకి దిగారు. వేలంలో సర్పంచ్ పదవిని యర్రా శ్రీనివాసరావు తన సతీమణి పుష్పలత కోసం రూ.81 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే, రొంపిచర్ల మండలం ముత్తనపల్లి సర్పంచ్ కుర్చీ రేటు రూ.18 లక్షలు పలికింది. గ్రామంలో రామాలయం నిర్మాణానికి ఆ డబ్బు కేటాయించేలా గాడిపర్తి సురేశ్ అనే వ్యక్తి ఒప్పందం చేసుకొని సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నారు. శానంపూడి సర్పంచ్ కుర్చీ రూ.18.50 లక్షలకు పలికినట్టు తెలిసింది. అలాగే, తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కోటి రూపాయలు ఇస్తానని విజయనగరం జిల్లా డెంకాడ పంచాయతీ సర్పంచ్ పదవిని ఆశిస్తున్న బీజేపీ అభ్యర్థి కర్రి కృష్ణ గురువారం ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్