Share News

ఊరి భవిత కోసం..

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:03 AM

పంచాయతీ ఎన్నికలంటే కేవలం సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అది ఆ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య ప్రక్రియ.

ఊరి భవిత కోసం..

  • ఏకగ్రీవాల భావనకు మూలమిదే.. సంప్రదాయ వర్గపోరుకు చెక్‌

  • అభివృద్ధి రాజకీయాలకు ఊతమే లక్ష్యం

  • ప్రభుత్వ నజరానాలతో గ్రామాన్నిబాగు చేసుకోవచ్చుననేది తలంపు

  • రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ అందుతాయనే ముందుచూపుతో మంచి నిర్ణయం

  • సర్పంచ్‌, వార్డు సభ్యులు..అందరూ ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న సర్కారు

  • పంచాయతీలకు 50 లక్షల వరకు సాయం

(అమరావతి-ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలంటే కేవలం సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎన్నుకోవడం మాత్రమే కాదు. అది ఆ గ్రామ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య ప్రక్రియ. గ్రామంలో ఎవరు పాలన సాగించాలి?, అభివృద్ధి పనులకు ఎవరు బాధ్యత వహించాలి?, ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరించాలి? అన్నది ఓటర్లే నిర్ణయిస్తారు. నిజమే, ఆధునిక భారతంలో రాజ్యాధికార ప్రక్రియ ఇక్కడే మొదలవుతుంది. గ్రామ స్వరాజ్యం భావన ప్రాణం పోసుకుంటుంది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ విభేదాలు, వర్గపోరు, వ్యక్తిగత కక్షలు ముందుకురావడం, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతిని, అభివృద్ధి వెనక్కి పోవడం ఒక చేదు అనుభవంగా మిగులుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది, గ్రామాలను బాగు చేసుకోవడం లక్ష్యంగా ముందుకొచ్చిన భావనే ఏకగ్రీవ ఎన్నికలు! భారీ నజనారాలతో ప్రభుత్వం ఈ భావనకు ఊపును తెస్తోంది.

అభివృద్ధికి అదనపు నిధులు: ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకం ఆ గ్రామానికి అదనపు ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంది. చిన్న పంచాయతీలకు సైతం ఏకగ్రీవం అయితే రూ.15 లక్షల వరకూ నజరానా అందుతుంది. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వినియోగించుకొనే వెసులుబాటు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీకి వెచ్చించే డబ్బును అభివృద్ధి పనులకు మళ్లించడం దీనివెనుక ఉన్న మరో ఆలోచన. వాస్తవానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.

అయినప్పటికీ రాజకీయ పార్టీల మద్దతు, స్థానిక నాయకుల జోక్యం, వర్గాల బల ప్రదర్శన ప్రభావం చూపుతున్నాయి. ఏకగ్రీవంగా గ్రామస్థులందరూ ఒక అభ్యర్థిని ఎన్నుకుంటే రాజకీయ జోక్యం, పోటీ వాతావరణం, ఘర్షణలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సర్పంచ్‌తో పటు వార్డు సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎన్నికైతే పాలకవర్గం సమన్వయంతో పనిచేసే అవకాశం ఉంటుంది.


2001 నుంచీ ప్రోత్సాహకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించే విధానం 2001 నుంచీ ఉంది. అప్పట్లో జనాభా ప్రాతిపదికన రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు నజరానా ఇచ్చేవారు. 2008లో దీన్ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు, ఆ తర్వాత 2013లో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. 2021లోనూ అప్పటి ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. గ్రామస్థులందరూ స్వచ్ఛందంగా ఒకే అభ్యర్థిని అంగీకరించి ఎన్నుకోవడానికి, పోటీ చేయాలనుకునే వారిని బెదిరించి, ఒత్తిడి చేసి నామినేషన్లు ఉపసంహరింపజేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఏకగ్రీవం పేరుతో ప్రజల ఎన్నికల హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వ లక్ష్యమే దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలు రహస్య ఓటింగ్‌ ద్వారా జరగాలి. కాబట్టి ఏకగ్రీవం అనేది చట్టబద్ధమైన ఎన్నికల ప్రక్రియలో స్వచ్ఛందంగా ఏర్పడిన ఏకాభిప్రాయం కావాలి. బలవంతపు ఏకగ్రీవాలకు తావుండకూడదు.

నజరానా కంటే ఐక్యతే ముఖ్యం

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం ప్రకటించడం ద్వారా ప్రభుత్వం గ్రామాల్లో ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఈ విధానం నిజంగా ఫలితాలిస్తుందా?, ప్రోత్సాహకం కోసమే ఏకగ్రీవాలు జరుగుతున్నాయా?, గ్రామస్థులందరి అభిప్రాయానికి నిజమైన ప్రాధాన్యం లభిస్తోందా? అనేవి కూడా పరిశీలించాల్సిన అంశాలే. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గం గ్రామాభివృద్ధికి ఎంతవరకు కృషి చేస్తుందన్నది కూడా కీలకమే.


ప్రోత్సాహకం దక్కాలంటే...

ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను మూడు కేటగిరీలుగా నిర్ణయించి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • 5వేల మంది వరకు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15 లక్షలు.

  • 5,001 నుంచి 10,000 మంది జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు.

  • 10వేల మందికి పైగా జనాభా కలిగిన పంచాయతీలు ఏకగ్రీవమైతే 50 లక్షలు నజరానా అందించనున్నారు.

  • సర్పంచ్‌తో పాటు గ్రామంలోని అన్ని వార్డు సభ్యుల స్థానాలు కూడా ఏకగ్రీవం కావాలి.

  • నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన పంచాయతీలకే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుంది.

  • ఈ పథకం ప్రస్తుతం ఎన్నికలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 01:08 AM