కూటమి కుమ్మేసింది!
ABN , Publish Date - Nov 04 , 2026 | 03:38 AM
‘పట్టణం’ కూటమికి జైకొట్టింది. అధికార కూటమి అభ్యర్థులకే పట్టం కట్టింది. రెండున్నరేళ్ల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితమే ‘పుర’ ఎన్నికల్లో పునరావృతమైంది.
పుర పోరులో గెలుపు హోరు
12 కార్పొరేషన్లు, 83 మునిసిపాలిటీలు కూటమికే!
ఆదోని, నెల్లిమర్లలో జనసేన, టీడీపీ రెబల్స్ గెలుపు
జనసేన 100 శాతం స్ట్రైక్ రేట్ రిపీట్
పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ‘గ్లాసు’ గలగల
3 లక్షల రికార్డు మెజార్టీతో విశాఖ పీఠంపై శ్రావణి
గుంటూరు మేయర్‌గా లక్ష్మీ అపర్ణ.. లక్షకు పైగా మెజార్టీ
విజయవాడలో ఆధిక్యంలో వంగవీటి రాధా
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘పట్టణం’ కూటమికి జైకొట్టింది. అధికార కూటమి అభ్యర్థులకే పట్టం కట్టింది. రెండున్నరేళ్ల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితమే ‘పుర’ ఎన్నికల్లో పునరావృతమైంది. టీడీపీ గెలుపు గాలికి వైసీపీ గల్లంతైపోయింది. చివరికి... వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే కడప ఖిల్లాకు సైతం ‘కూటమి’ బీటలు కొట్టింది. జగన్ సొంత గడ్డ పులివెందుల మునిసిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో పడింది. ‘వైఎస్’ కుటుంబం నుంచి పులివెందుల చేజారడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పులివెందుల, పుంగనూరు, కుప్పంలో అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందన్న జగన్ ఆరోపణలను తిప్పి కొడుతూ... రాష్ట్రమంతా వైసీపీకి వ్యతిరేకంగానే ఓటేసింది.
కూటమి నాయకులు ప్రలోభపెట్టారన్న వైసీపీ ఆరోపణల్లో పస లేదని తేల్చేసింది. అటు కార్పొరేషన్లు, ఇటు మునిసిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు ఏకపక్ష విజయం నమోదు చేశారు. స్థానిక ఎన్నికల్లో తొలిదశగా ఈనెల 1వ తేదీన నగర పాలక, పురపాలక స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే! మంగళవారం ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. పలు చోట్ల భారీ వర్షాలు, బ్యాలెట్ల లెక్కింపు కావడంతో రాత్రి పొద్దుపోయేదాకా ఫలితాలు వెలువడుతూనే ఉన్నాయి.
తుది సమాచారం అందేసరికి... ఎన్నికలు జరిగిన 13 మునిసిపల్ కార్పొరేషన్లలో 12చోట్ల కూటమిదే ఆధిక్యం! బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన అనంతపురంలో మాత్రం వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక... ఎన్నికలు జరిగిన 86 మునిసిపాలిటీల్లో 83 పీఠాలపై ‘కూటమి’ పాగా వేయడం ఖాయమైంది. పలు కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపు సాధించారు. మొత్తంగా... అనంతపురం కార్పొరేషన్‌తోపాటు నంద్యాల జిల్లా నందికొట్కూరు, బేతంచర్ల, తిరుపతి జిల్లా నాయుడుపేట మాత్రమే వైసీపీ ఖాతాలో పడ్డాయి.
గెలిపించిన అభివృద్ధి.. సమన్వయం
ప్రభుత్వ పనితీరుతోపాటు కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపికలో ‘సోషల్ ఇంజనీరింగ్’... వీటన్నింటి ఫలితమే పురపోరులో ఘనవిజయం! 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీనికి స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల అగ్రనేతల సమన్వయం, సంయమనం తోడయ్యాయి. సీట్ల సర్దుబాటు ఫలించదని, ‘కూటమి’ విజయానికి రెబల్స్ గండి కొడతారని వచ్చిన అంచనాలు పటాపంచలయ్యాయి. క్షేత్రస్థాయిలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా జరిగింది.
కర్నూలు జిల్లా ఆదోని మునిసిపాలిటీలో మాత్రమే జనసేన రెబల్ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. బీజేపీకి కేటాయించిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మునిసిపాలిటీలో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. వెరసి... బీజేపీకి దక్కిన స్థానాల్లో రెండు కూటమి రెబల్స్ సత్తా చాటారు. ఇక... సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన... ‘పుర పోరు’లోనూ అదే జోరు కనబరిచింది. మేయర్, చైర్మన్ స్థానాల్లో కూటమి తరఫున బరిలోకి దిగిన జనసేన అభ్యర్థులంతా విజయం సాధించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం